ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Loksabha Elections 2024: తెలంగాణలో ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌!

ABN, Publish Date - May 01 , 2024 | 06:08 AM

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డబుల్‌ ఆర్‌ (ఆర్‌ఆర్‌) ట్యాక్స్‌ విధించిందంటూ సీఎం రేవంత్‌రెడ్డి,

వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు రహస్యంగా చెల్లించుకుంటున్నారు

ఆ సొమ్మంతా ఢిల్లీకి వెళ్తోందిట్రిపుల్‌ ఆర్‌తో దేశం తలెత్తుకుంటే..

డబుల్‌ ఆర్‌తో తల దించుకుంటోంది

నా ప్రాణం ఉన్నంతవరకూ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లను ముస్లింలకు దక్కనివ్వ

రాజ్యాంగాన్ని మార్చే శక్తి ఎవరికీ లేదు ఉద్రిక్తతలు రెచ్చగొట్టేందుకే ఫేక్‌ వీడియో

అవినీతిలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఒకటే మెదక్‌ జిల్లా అల్లాదుర్గంలో ప్రధాని మోదీ

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డబుల్‌ ఆర్‌ (ఆర్‌ఆర్‌) ట్యాక్స్‌ విధించిందంటూ సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీలపై ప్రధాని మోదీ పరోక్ష విమర్శలు గుప్పించారు. వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు ఈ ట్యాక్సును రహస్యంగా ఇచ్చుకోవాల్సి వస్తోందని, తెలంగాణ వ్యాప్తంగా దీనిపై చర్చ జరుగుతోందన్నారు. డబుల్‌ ఆర్‌ ట్యాక్సు ఢిల్లీకి వెళ్తుందని, అక్కడ ఎవరికి చేరుతుందో అందరికీ తెలుసన్నారు. ఈ సందర్భంగా, ఆస్కార్‌ అవార్డు అందుకున్న ట్రిపుల్‌ ఆర్‌ సినిమాను మోదీ ప్రస్తావించారు.


‘ట్రిపుల్‌ ఆర్‌ సినిమాతో మన దేశ ఖ్యాతిని తెలుగు సినీ పరిశ్రమ ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పింది. కానీ, డబుల్‌ ఆర్‌ ట్యాక్స్‌తో దేశం సిగ్గుతో తలదించుకుంటోంది’ అని పేర్కొన్నారు. మంగళవారం మెదక్‌ జిల్లాలోని జహీరాబాద్‌ నియోజకవర్గం పరిధిలో ఉన్న అల్లాదుర్గంలో బీజేపీ నిర్వహించిన బహిరంగసభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. తెలంగాణను తొలుత బీఆర్‌ఎస్‌ ఎలా దోచుకుందో, ఇప్పుడు కాంగ్రెస్‌ కూడా అదే విధంగా డబుల్‌ ఆర్‌ ట్యాక్సు పేరుతో దోచుకుంటోందని ఆరోపించారు.

రాష్ట్రంలోని 17 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే ఈ డబుల్‌ ఆర్‌ ట్యాక్సు వసూళ్లను అడ్డుకుంటామని చెప్పారు. అధికారంలోకి వస్తే కాళేశ్వరం అవినీతిపై విచారణ జరిపిస్తామని ప్రకటించిన కాంగ్రెస్‌.. ఇప్పుడు అధికారంలో ఉన్నా, ఆ ప్రాజెక్టు అవినీతి ఫైళ్లను తొక్కిపెడుతోందన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ రెండూ ఒకటేనని, ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కూడా ఇది కనిపిస్తుందని తెలిపారు.


ముస్లింలకు రిజర్వేషన్లు దక్కనివ్వను

తన ప్రాణం ఉన్నంతవరకూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను మతపరంగా ముస్లింలకు దక్కనివ్వనని మోదీ ప్రకటించారు. కాంగ్రెస్‌ పార్టీకి, ఆ పార్టీకి తొత్తులుగా ఉన్న వారికి ఇదే సవాల్‌ అని పేర్కొన్నారు. ‘కాంగ్రెస్‌ నేతలారా! కాంగ్రె్‌సకు మద్దతిస్తున్న పార్టీల నేతలారా! చెవులు రిక్కించి వినండి. మోదీ జీవించి ఉన్నంత వరకు రాజ్యాంగాన్ని మార్చే శక్తి ఎవరికీ ఉండదు. దళితులు, ఆదివాసీలు, ఓబీసీల హక్కులను మతపరంగా ముస్లింలకు దక్కనివ్వబోను’ అని పేర్కొన్నారు.

రిజర్వేషన్‌లపై నాడు రాజ్యాంగసభలో సుదీర్ఘ చర్చల అనంతరం, మతపరమైన రిజర్వేషన్‌లు ఉండరాదని తీర్మానం చేశారని చెప్పారు. రాజ్యాంగాన్ని పవిత్ర గ్రంథంగా బీజేపీ భావిస్తుందని స్పష్టం చేశారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయనివిధంగా తాను గుజరాత్‌ సీఎంగా ఉన్నప్పుడు.. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాజ్యాంగాన్ని ఏనుగుపై ఉంచి భక్తిశ్రద్ధలతో ఊరేగింపు నిర్వహించినట్లు గుర్తుచేశారు. తొలిసారి ప్రధాని అయిన తర్వాత 2014లో పార్లమెంటుకు సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాతే అందులో అడుగుపెట్టానని, రెండోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాజ్యాంగాన్ని పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లో ఏర్పాటు చేశామని వివరించారు.


ఓటుబ్యాంకు కోసం ఎన్నికల సంఘాన్ని, ఈవీఎంలను ప్రశ్నిస్తున్న కాంగ్రెస్‌.. రాజ్యాంగాన్ని సైతం బద్‌నాం చేస్తోందని మోదీ ధ్వజమెత్తారు. ప్రపంచం ఆర్థిక ప్రగతితో దూసుకుపోతుంటే భారత్‌ను కాంగ్రెస్‌ అవినీతి ఊబిలోకి నెట్టివేసిందని, అధికారంలోకి వచ్చిన ఎన్‌డీఏ ప్రభుత్వం కష్టపడి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిందన్నారు. ఇప్పుడు మళ్లీ పాత రోజులను తీసుకువచ్చేందుకు కాంగ్రెస్‌ కుట్ర చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్‌ ఎక్కడ అధికారంలో ఉంటే, అక్కడ పంచసూత్రాల పాలన సాగుతుందని.. అబద్ధాలు- మోసపూరిత వాగ్దానాలు, ఓటుబ్యాంకు రాజకీయాలు, మాఫియాను పెంచి పోషించడం, కుటుంబ పాలన, అవినీతి - ఇవే ఆ పంచ సూత్రాలని ఎద్దేవా చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమికి ప్రతిపక్ష హోదా కూడా దక్కబోదన్నారు.

ఎన్నికలను అపహాస్యం చేస్తూ ఫేక్‌ వీడియో

దేశంలో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించేందుకు తెలంగాణ కాంగ్రెస్‌ ఓ ఫేక్‌ వీడియోను సృష్టించిందని, ఈ వ్యవహారంలో డబుల్‌ ఆర్‌లో ఒక పేరు (రేవంత్‌రెడ్డి) బయటకు వచ్చిందని మోదీ తెలిపారు. వారసత్వంగా లభించే ఆస్తిపై 55 శాతం పన్ను విధించాలని కాంగ్రెస్‌ ఆలోచిస్తోందని ఆరోపించారు. ‘కాంగ్రెస్‌ పొరపాటున అధికారంలోకి వస్తే, మీరు కష్టపడి సంపాదించుకున్న ఆస్తిపై ట్యాక్సు తీసుకువస్తుంది. 55 శాతం వసూలు చేయడం ఖాయం. ఆ పార్టీ పట్ల అప్రమత్తంగా ఉండాలి’ అని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో రైతులను మోసం చేసిందని, వంద రోజుల్లో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని, ఽధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్‌ ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేసిందని ఆరోపించారు. తమ పాలనలో బాలికల కోసం బేటీ బచావో, బేటీ పడావో పథకాన్ని ప్రవేశపెట్టామని.. ఇందులో భాగంగా బాలికల కోసం పాఠశాలల్లో ప్రత్యేకంగా మరుగుదొడ్లు నిర్మించామని మోదీ చెప్పారు. పేదలకు ఇచ్చే ఇళ్లు కూడా మహిళల పేరిటే ఇస్తున్నామని, వారి భద్రతకు కఠిన చట్టాలు తీసుకువచ్చామన్నారు.


మా దేశభక్తికి రామమందిరం ఓ ఉదాహరణ

కేంద్రంలో దేశభక్తి కలిగిన, బలమైన ప్రభుత్వం ఉంటే చరిత్రాత్మక నిర్ణయాలు అమలవుతాయని, అయోధ్యలో రామమందిరం నిర్మాణం ఇందుకు ఒక ఉదాహరణ అని మోదీ తెలిపారు. స్వాతంత్ర్యానికి ముందే నిర్మించాల్సిన ఈ ఆలయం, తమ హయాంలో సాకారమైందని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన.. ‘రామమందిరం ఎవరు నిర్మించారు?’ అంటూ సభకు హాజరైన జనాన్ని పలుమార్లు ప్రశ్నించారు. వారు ‘మోదీ.. మోదీ..’ అంటూ పెద్దపెట్టున సమాధానం ఇచ్చారు. దీనికి మోదీ.. మీరు ఇచ్చిన ఓట్లతో, సంపూర్ణ అధికారంతోనే రామమందిరం నిర్మించామని తెలిపారు. కాంగ్రె్‌సకు ఓటు బ్యాంకే ముఖ్యమని, హైదరాబాదులో శ్రీరామనవమి శోభాయాత్రపై ఆంక్షలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే అని ఆరోపించారు.


ఉమ్మడి ఏపీలో 2004-2009లో తెలంగాణ నుంచి కాంగ్రె్‌సకు రికార్డు స్థాయిలో ఎంపీలను, ఎమ్మెల్యేలను ఇస్తే.. రాష్ట్రాన్ని మతపరమైన రిజర్వేషన్లకు ప్రయోగశాలగా మార్చి ఓబీసీలకున్న రిజర్వేషన్‌ తగ్గించి ముస్లింలకు ఇచ్చిందన్నారు. తెలంగాణలో ఉంటున్న లింగాయత్‌, మరాఠాల్లోని 26 జాతులను ఓబీసీలను చేర్చని కాంగ్రెస్‌, ముస్లింలను మాత్రం రాత్రికి రాత్రి ఓబీసీల్లో చేర్చిందన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ బంజారాలను, మాదిగలను మోసం చేశాయని పేర్కొంటూ, ఎస్సీ వర్గీకరణకు తాము కట్టుబడి ఉన్నామని మోదీ పేర్కొన్నారు.


‘తొలుత రాజ్యాంగంలోని ప్రతీ పేజీలో రామాయణం, మహాభారత చిత్రాలు ఉండేవి. కానీ, యువరాజు ముత్తాత (నెహ్రూ) వాటిని తొలగించారు. ఆ తర్వాత, యువరాజు నానమ్మ (ఇందిర) రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి ఎమర్జెన్సీ విధించారు. యువరాజు తండ్రి (రాజీవ్‌గాంధీ) మీడియా స్వేచ్ఛను హరించే భయంకర చట్టాన్ని తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. నాడు, బీజేపీ, ఇతర పక్షాలతో కలిసి ఉద్యమించడంతో ఆయన వెనక్కి తగ్గారు. ప్రధాని మన్మోహన్‌ అధ్యక్షతన క్యాబినెట్‌ తీసుకున్న నిర్ణయం కాపీని యువరాజు బహిరంగంగా చింపివేసి రాజ్యాంగాన్ని అవహేళన చేశారు’ అని మోదీ విమర్శించారు.


10న ఎల్బీ స్టేడియంలో మోదీ బహిరంగసభ!

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 30(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండటంతో బీజేపీ తన ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఈ నెల 10న ఎల్బీ స్టేడియంలో బహిరంగసభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాని మోదీ, ఈ సభకు హాజరుకానున్నారు. 8న కరీంనగర్‌ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో మోదీ పర్యటించనున్నారు. వేములవాడలో నిర్వహించనున్న బహిరంగసభలో పాల్గొంటారు.

నేడు హైదరాబాద్‌లో అమిత్‌ షా రోడ్‌ షో

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా బుధవారం హైదరాబాద్‌ పార్లమెంటు పరిధిలో రోడ్‌ షోలో పాల్గొంటారు. లాల్‌దర్వాజలోని మహంకాళి అమ్మవారి ఆలయం నుంచి శాలిబండ సుధా టాకీస్‌ వరకు ఈ రోడ్‌ షో కొనసాగనుంది.

Updated Date - May 01 , 2024 | 09:17 AM

Advertising
Advertising