Siddipet: ఇక సిద్దిపేట కుంకుమ పువ్వు
ABN, Publish Date - Oct 17 , 2024 | 04:01 AM
కశ్మీర్ లాంటి చల్లని వాతావరణంలో మాత్రమే సాగయ్యే కుంకుమ పువ్వు పంటను డీఎక్స్‌ఎన్ కంపెనీ ఏరోఫోనిక్స్ టెక్నాలజీ సాయంతో సిద్దిపేటలో సాగు చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది.
మందమర్రిలో డీఎక్స్‌ఎన్ కంపెనీ సాగు
40 వేల మొక్కలతో గదిలో పైలట్ ప్రాజెక్టు
4 నెలల్లోనే 600 గ్రాముల దిగుబడి..
సిద్దిపేట టౌన్, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): కశ్మీర్ లాంటి చల్లని వాతావరణంలో మాత్రమే సాగయ్యే కుంకుమ పువ్వు పంటను డీఎక్స్‌ఎన్ కంపెనీ ఏరోఫోనిక్స్ టెక్నాలజీ సాయంతో సిద్దిపేటలో సాగు చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. పంట సాగును ప్రారంభించిన నాలుగు నెలల్లోనే 600 గ్రాముల దిగుబడిని రాబట్టింది. త్వరలోనే ఇది సిద్దిపేట కుంకుమపువ్వుగా మార్కెట్‌లో అందుబాటులోకి రానుంది. మాజీ మంత్రి హరీశ్ రావు సూచన మేరకు 2019లో డీఎక్స్‌ఎన్ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డా.లిమ్ సియోవ్ జిన్ సిద్దిపేట అర్బన్ మండలం మందపల్లి శివారులో 50 ఎకరాల్లో కంపెనీని స్థాపించారు.
20 రకాల ఆహార పదార్థాలు
ఇక్కడ పలు వ్యవసాయ ప్రాజెక్టులు నడుస్తుండగా.. 20 రకాల ఆహార పదార్థాలు ఉత్పత్తవుతున్నాయి. 500 మందికి పైగా ఉపాధి లభిస్తోంది. ఈ నేపథ్యంలోనే సియోవ్ జిన్ కశ్మీర్ నుంచి కుంకుమపువ్వు విత్తనాలను తెచ్చి 40 వేల మొక్కలతో పైలట్ ప్రాజెక్టు కింద సాగు మొదలుపెట్టారు. ఇందుకోసం కంపెనీలోని ఐడబ్ల్యూహెచ్ బ్లాకులో ఏరోఫోనిక్స్ సాయంతో ఓ గదిని ఏర్పాటు చేశారు. దానిలో కుంకుమపువ్వు సాగుకు అవసరమయ్యే చల్లని ఉష్ణోగ్రత ఉండేలా ఏసీలను అమర్చారు. ఆ గదిలో ట్రేలలో విత్తనాలను ఉంచి ఎలాంటి మట్టి, నీరు అందించకుండా సంరక్షించారు. దీంతో సాధారణంగా ఎకరా స్థలంలో రావాల్సిన 600 గ్రాముల కుంకుమ పువ్వు.. గది విస్తీర్ణంలోనే సాగు అయ్యింది.
తెలంగాణలోనే అతి పెద్దది..
కుంకుమ పువ్వు పెంపకం ప్రాజెక్టు తెలంగాణలోనే అతి పెద్దది. ఇది కంపెనీ చైర్మన్ కల.. ఆయన సూచనలతోనే మేం సాధించగలిగాం. దీన్ని కంపెనీతో పాటు ఇక్కడి ప్రజల సహకారంతో సాధించిన విజయంగా భావిస్తున్నాం. తెలంగాణ భూభాగంపై డీఎక్స్‌ఎన్ ఒక అద్భుతమైన విజయాన్ని సాధించినందుకు సంతోషంగా ఉంది.
- పవన్ దేశ్‌పాండే, డీఎక్స్‌ఎన్ ప్రాజెక్టుల కో ఆర్డినేటర్
ఇది కూడా చదవండి:
నా కష్టం... వేరొకరికి రాకూడదని...
Updated Date - Oct 17 , 2024 | 09:51 AM