Professor Post: ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కోసం... ప్రత్యేక కమిటీ
ABN, Publish Date - Dec 14 , 2024 | 04:41 AM
యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి తీసుకోవాల్సిన చర్యలను సూచించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది.
చైర్మన్‌గా చక్రపాణి, సభ్యులుగా ఇద్దరు వీసీలు
అధ్యయనం చేసి నివేదిక ఇవ్వనున్న కమిటీ ఉన్నత విద్యా మండలి నిర్ణయం
హైదరాబాద్, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి తీసుకోవాల్సిన చర్యలను సూచించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ ఉన్నత విద్యామండలి నిర్ణయం తీసుకుంది. నియామకాలను ఎలా చేపట్టాలన్న అంశంపై ఈ కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదికను సమర్పించనుంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి శుక్రవారం విశ్వవిద్యాలయాల వీసీలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో ఉన్నత విద్య అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. విశ్వవిద్యాలయాలు ఎదుర్కొంటున్న సవాళ్లను గుర్తిం చి, పరిష్కార మార్గాలను అన్వేషించాలని నిర్ణయించారు. ప్రొఫెసర్ పోస్టుల భర్తీ, కెరీర్ అడ్వాన్స్‌మెంట్ స్కీం వంటి అంశాలపై అధ్యయనం చేయడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. అంబేడ్కర్ వర్సిటీ వీసీ ఘంటా చక్రపాణి చైర్మన్‌గా వ్యవహరించే ఈ కమిటీలో సభ్యులుగా ఉస్మానియా వీసీ కుమార్ మొలుగారం, మహాత్మాగాందీ వర్సిటీ వీసీ ఖాజా అల్తాఫ్ హుేస్సన్‌ను నియమించారు. మరో ఇద్దరు నిపుణులు కూడా ఈ కమిటీకి సహాయం అందించనున్నారు. వాస్తవానికి ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కోసం గతంలో ప్రత్యేక నియామక బోర్డును ఏర్పాటు చేశారు. అయితే... దీనికి సంబంధించిన బిల్లు ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి, ఈ పోస్టులను భర్తీ చేయాలనే యోచనలో ప్రభుత్వం ఉంది. తాజాగా శుక్రవారం నాటి సమావేశంలో ఇందుకోసం కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నివేదిక సమర్పించాక ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది.
నిధుల కొరతపైనా చర్చ
ఉన్నత విద్యలో నాణ్యతను పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలపైనా ఉన్నతవిద్యా మండలి సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా యూనివర్సిటీల ర్యాంకింగ్, బోధన తీరును మెరుగు పరచడానికి అనుసరించాల్సిన విఽధానాలపై చర్చ జరిగింది. వర్సిటీల్లో విద్యా ప్రమాణాలను పెంపొందించడానికి మరో కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ నాణ్యతలో రాజీ లేకుండా యూనివర్సిటీల అభివృద్దికి కృషి చేయాలని వీసీలను కోరారు. కాగా, వర్సిటీల్లో నిధుల కొరత అంశాన్ని పలువురు వీసీలు ప్రస్తావించారు. వర్సిటీల అవసరాల మేరకు బడ్జెట్ ఉండకపోవడంతో మౌలిక సదుపాయాలను కల్పించలేకపోతున్నట్టు వివరించారు. ఈ సమస్యను అధిగమించేందుకు పరిశ్రమల నుంచి వచ్చే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులను, పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి నిధులను ఉపయోగించుకోవాలని నిర్ణయించారు.
Updated Date - Dec 14 , 2024 | 04:41 AM