Sridhar Babu: ప్రభుత్వాలు కూల్చిన చరిత్ర బీజేపీది
ABN, Publish Date - Nov 04 , 2024 | 03:43 AM
ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చిన బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుమ్మక్కయ్యాయని రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. కుట్రపూరితంగా వివిధ రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూల్చి వేసిన చరిత్ర బీజేపీకి ఉందని పేర్కొన్నారు.
రాష్ట్రంలో బీజేపీ, బీఆర్‌ఎస్ కుమ్మక్కయ్యాయి : శ్రీధర్ బాబు
హైదరాబాద్, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చిన బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుమ్మక్కయ్యాయని రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. కుట్రపూరితంగా వివిధ రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూల్చి వేసిన చరిత్ర బీజేపీకి ఉందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడంలో బీజేపీ నేతలు సిద్ధహస్తులను ధ్వజమెత్తారు. జూన్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి మారతారంటూ బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలపై శ్రీధర్ బాబు ఘాటుగా స్పందించారు. ఎన్నికల్లో గెలిస్తే అధికారం చేపట్టడం, ఓడితే బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్రను పోషించడం ప్రజాస్వామ్యబద్ద పార్టీల విధి అని, కానీ బీజేపీ మూడో మార్గాన్ని ఎంచుకుందని విమర్శించారు.
కాంగ్రెస్ అధికారంలోకి రావడాన్ని జీర్ణించుకోలేక బీఆర్‌ఎ్‌సతో కలిసి ప్రభుత్వం ఎప్పుడు కూలుతుందా ? అని చూస్తోందని మండిపడ్డారు. కుట్రపూరితంగా వివిధ రాష్ర్టాల్లో ప్రభుత్వాలను బీజేపీ కూల్చి వేసిందంటూ, మహారాష్ట్రలో బీజేపీ అనుసరించిన వైఖరిని గుర్తు చేశారు. మహారాష్ట్ర ప్రజలు ఎన్నికల్లో బీజేపీకి తగిన పాఠం చెబుతారని అన్నారు. సీఎం మారుతారన్న ప్రకటన ద్వారా రాష్ట్ర ప్రజలకు బీజేపీ ఏ సంకేతం ఇవ్వదలుచుకుందని నిలదీశారు. ఇక, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన రెండో రోజు నుంచి బీఆర్‌ఎస్ విషం చిమ్మడం మొదలుపెట్టిందని ఆరోపించారు. బీఆర్‌ఎ్‌సది అధికార దాహామని, ప్రజలు ఆ పార్టీని గద్దె దించిన విషయాన్ని కూడా మరిచిపోతుందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీఆర్‌ఎస్, బీజేపీ కుమ్మక్కయ్యాయనీ, అందుకే ఆ పార్టీల నేతలు విపరీతమైన వ్యాఖ్యలు చేస్తున్నారని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
Updated Date - Nov 04 , 2024 | 03:43 AM