Sridhar Babu: 11 నెలల్లో రూ.36 వేల కోట్ల పెట్టుబడులు!
ABN, Publish Date - Nov 15 , 2024 | 04:27 AM
తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత గత 11 నెలల్లో 140 ప్రాజెక్టులకు సంబంధించి సుమారు 36వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కోన్నారు.
ఉపాధి కల్పనలో లైఫ్ సైన్సెస్ పాత్ర కీలకం
సీఎం అమెరికా పర్యటనతో సత్ఫలితాలు
ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత గత 11 నెలల్లో 140 ప్రాజెక్టులకు సంబంధించి సుమారు 36వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కోన్నారు. ఫార్మారంగంలో లైఫ్‌సైన్సెస్ పురోగతి సంతృప్తికరంగా ఉందని తెలిపారు. హెచ్‌ఐసీసీలో గురువారం విలేకరులతో మాట్లాడిన మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ రంగం పురోగతిని వివరించారు. ఫార్మా రంగంలో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పనను ప్రోత్సహించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఫార్మా మాన్యుఫాక్చరింగ్ యూనిట్లు, ఆర్ అండ్ డీ సెక్టార్, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు, ఇన్నోవేషన్ హబ్స్ ద్వారా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభించనుందన్నారు. ప్రత్యక్షంగా 51వేల మందికి పరోక్షంగా లక్షా 50వేలమందికి ఉపాధి దొరకనుందని తెలిపారు.
రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలను ఎలా ఆహ్వానిస్తున్నామో, ఇప్పటికే ఉన్నవారు వ్యాపార విస్తరణ చేసేలా ప్రోత్సహిస్తున్నామని వివరించారు. జీనోమ్ వ్యాలీలో అంతర్జాతీయ స్దాయిలో రిసెర్చ్ సెంటర్లు పని ప్రారంభించాయని, లారెన్స్ యూరోపియన్ కంపెనీ రూ.2వేల కోట్ల పెట్టుబడితో రిసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చిందన్నారు. భారతీయ పరిశ్రమలతో కలిసి జపాన్‌కు చెందిన కంపెనీ ఏటా 5 కోట్ల డెంగ్యూ టీకాలు ఉత్పత్తి చేయనుందని తెలిపారు. అలాగే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన సత్ఫలితాలను ఇచ్చిందని అమెరికాకు చెందిన ప్రముఖ బయోటెక్నాలజీ కంపెనీ జీనోమ్ వ్యాలీలో కార్యాలయం ప్రారంభించిందని తెలిపారు. పశు వైద్యానికి సంబంధించి మరో సంస్థ వెటర్నరీ మందుల ఉత్పత్తి ప్రారంభిస్తుందని చెప్పారు. హెల్త్ కేర్ ఉత్పత్తుల తయారు చేసే మరో కంపెనీ కూడా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిందన్నారు. మెట్రానిక్స్ అనే ఐటీ కంపెనీ కూడా తెలంగాణలో తమ కార్యకలాపాలు ప్రారంభించనుందని తెలిపారు. కాగా, లగచర్లలో ఘటనలో కుట్రకోణం నిర్ధారణ అయితే కుట్రదారులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని మంత్రి శ్రీధర్ బాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. నిరుపేద దళితుల ముసుగులో సంఘ విద్రోహకశక్తులు అధికారులపై దాడికి పాల్పడ్డారని అన్నారు.
Updated Date - Nov 15 , 2024 | 04:27 AM