ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sridhar Babu: ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ.. ఐటీ పరిశ్రమలు నెలకొల్పండి!

ABN, Publish Date - Dec 15 , 2024 | 03:19 AM

రాష్ట్రంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ ఐటీ పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.

  • గ్రామాల్లో ప్రతిభావంతులకు కొదవలేదు

  • త్వరలో రాష్ట్రవ్యాప్తంగా టీఫైబర్‌ నెట్‌వర్క్‌

  • ఐటీ కంపెనీలు సద్వినియోగం చేసుకోవాలి

  • టెక్‌వేవ్‌ గ్లోబల్‌ సెంటర్‌ ప్రారంభోత్సవంలో ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ ఐటీ పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. గ్రామీణ యువతకు ఉపాధి కల్పించటంలో ఈ పరిశ్రమలు తోడ్పడతాయని తెలిపారు. గ్రామాల్లో ప్రతిభావంతులకు కొదవలేదన్నారు. హైదరాబాద్‌లో టెక్‌వేవ్‌ కంపెనీ రెండో గ్లోబల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ను మంత్రిశనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మంథని లాంటి మారుమూల గ్రామాల నుంచి కూడా వర్క్‌ఫ్రమ్‌ హోం ద్వారా బహుళజాతి కంపెనీల్లో పనిచేస్తున్న ఉద్యోగులు వందల సంఖ్యలో ఉన్నారన్నారు. తెలంగాణలో ప్రస్తుతం 220కిపైగా అంతర్జాతీయస్థాయి కంపెనీల కేంద్రాలు ఉన్నాయని, వాటిని 400కు పెంచాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. హైదరాబాద్‌ కేంద్రంగా ఐటీ పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయని.. అయితే.. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో కూడా ఐటీ సంస్థలను నెలకొల్పి గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు పెంచాలని కోరారు. అమెరికాలోని హ్యూస్టన్‌లో ప్రధాన కార్యాలయం ఉన్న టెక్‌వేవ్‌ సంస్థ.. యూకే, హంగరీ, దక్షిణాఫ్రికా వంటి 11 దేశాల్లో ఐటీ సేవలు అందిస్తోందన్నారు.


టెక్‌వేవ్‌ కంపెనీ హైదరాబాద్‌లో 2400 మంది, ఖమ్మంలో 500 మంది ఐటీ ఉద్యోగులను నియమించుకోవటంపై శ్రీధర్‌బాబు హర్షం వ్యక్తం చేశారు. అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయాలన్న ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా టెక్‌వేవ్‌ సంస్థ పనిచేస్తోందన్నారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా టీ ఫైబర్‌ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని, దీన్ని ఐటీ కంపెనీలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. టెక్‌వేవ్‌ సహ వ్యవస్థాపకుడు, చైర్మన్‌ గుమ్మడపు దామోదర్‌రావు మాట్లాడుతూ.. 20వ వార్షికోత్సవం సందర్భంగా తమకు ఇది ప్రత్యేకమైన సందర్భం అని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా 4 వేల మంది ఐటీ ఉద్యోగులతో తమ కార్యాలయాలు పని చేస్తున్నాయన్నారు. నూతన సాంకేతిక ఆవిష్కరణలకు తమ బృందం శక్తివంచన లేకుండా పనిచేస్తుందని తెలిపారు. కాగా, హైదరాబాద్‌లోని నానక్‌రాంగూడలో సుమారు లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటైన టెక్‌వేవ్‌ సంస్థ కార్యాలయంలో 1200 మంది కొత్తగా పనిచేసే అవకాశం ఉంది. ఐటీలో ప్రపంచవ్యాప్తంగా సేవలు అందిస్తున్న టెక్‌వేవ్‌ ఏర్పాటు చేసిన ఏఐ ఆధారిత గ్లోబల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌.. డిజిటల్‌ తెలంగాణకు మైలురాయిగా నిలుస్తుందని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు.

Updated Date - Dec 15 , 2024 | 03:19 AM