SC categorization: వర్గీకరణపై ఏక సభ్య కమిషన్!
ABN, Publish Date - Oct 09 , 2024 | 03:20 AM
షెడ్యూల్డు కులాల (ఎస్సీ) వర్గీకరణపై ఏక సభ్య జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జి సారథ్యంలో ఏర్పాటు చేయాలి
న్యాయపరమైన చిక్కుల్లేకుండా ఉండటానికే కమిషన్
2011 జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ వర్గీకరణ
ప్రభుత్వానికి మంత్రివర్గ ఉపసంఘం సిఫారసులు
నాలుగో సమావేశంలో పలు అంశాలపై చర్చ
ఉపసంఘానికి 1,082 ప్రజా వినతులు
పంజాబ్, తమిళనాడులో బృందాల అధ్యయనం
త్వరలో జిల్లాల పర్యటన: మంత్రి ఉత్తమ్ కుమార్
బీసీల సామాజిక, ఆర్థిక సర్వే చేయాలి
హైకోర్టు నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలి
ప్రభుత్వానికి మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు
హైదరాబాద్, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): షెడ్యూల్డు కులాల (ఎస్సీ) వర్గీకరణపై ఏక సభ్య జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ వర్గీకరణ కోసం 2011 నాటి జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సారథ్యంలో ‘వర్గీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం’ మంగళవారం సచివాలయంలో సమావేశమైంది. కమిటీకిది నాలుగో సమావేశం. ఈ భేటీలో కమిటీ సభ్యులైన మంత్రులు దామోదర రాజనర్సింహ, సీతక్క, పొన్నం ప్రభాకర్, డి.శ్రీధర్‌బాబుతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ పలు అంశాలపై చర్చించింది. ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ కోసం ఏక సభ్య జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
సుప్రీంకోర్టు లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జితో కమిషన్‌ను ఏర్పాటు చేయాలని సూచించింది. ఎస్సీల్లోని ఉప కులాల వెనకబాటుతనాన్ని సమగ్రంగా గుర్తించడానికి ఈ కమిషన్ ఏర్పాటు అవసరమని అభిప్రాయపడింది. వర్గీకరణ ప్రక్రియ ఎలాంటి న్యాయ చిక్కులు లేకుండా చట్టబద్ధంగా ఉండాలని, అందుకే న్యాయ (జ్యుడీషియల్) పరిశీలన అవసరమని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ జ్యుడీషియల్ కమిషన్‌కు అవసరమైన ముసాయిదా నియమ నిబంధనలను అడ్వొకేట్ జనరల్ సిద్ధం చేశారని అధికారులు సమావేశం దృష్టికి తెచ్చారు. ఎస్సీల్లోని ఉప కులాలవారీగా ఉన్న ఉద్యోగుల వివరాలను ఇవ్వాలంటూ ఇప్పటికే టీజీపీఎస్సీ, టీజీఎల్పీఆర్బీ, ఎస్సీసీఎల్, ఎంహెచ్‌ఎ్‌సఆర్‌బీ, ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ వంటి సంస్థలను కోరినట్లు వివరించారు. ఇప్పటికే 30 శాతం వివరాలను ఆర్థిక శాఖ ద్వారా సేకరించినట్లు తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై మొత్తం 1,082 వినతులు క్యాబినెట్ సబ్ కమిటికీ అందాయి. వీటిని ఆన్లైన్, ఆఫ్‌లైన్ పద్ధతిలో స్వీకరించినట్లు వివరించారు. పంజాబ్, తమిళనాడు రాష్ట్రాలు అమలు చేస్తున్న ఎస్సీ వర్గీకరణను ఇప్పటికే రాష్ట్ర బృందాలు అధ్యయనం చేసి వచ్చాయి.
పంజాబ్, తమిళనాడులో వర్గీకరణ ఇలా..
పంజాబ్‌లో ఉద్యోగ నియామకాల కోసం ఎస్సీ వర్గీకరణను రెండు గ్రూపులుగా చేశారు. బాల్మీకి, మఝాబి సిక్కులను ఒక గ్రూపులో, మిగతా 37 సామాజిక వర్గాలను మరో గ్రూపులో ఉంచారు. 25 శాతం ఎస్సీ రిజర్వేషన్లను ఈ రెండు గ్రూపుల మధ్య విభజించి అమలు చేస్తున్నారు. అక్కడి ఎస్సీ జనాభాలో 40 శాతం వరకు ఉన్న బాల్మీకిలు, మఝాబి సిక్కులకు 12.5 శాతం రిజర్వేషన్లు, 60 శాతం వరకు ఉన్న మిగతా 37 సామాజిక వర్గాలకు 12.5 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తున్నారు. సెప్టెంబరు 23, 24 తేదీల్లో రాష్ట్ర బృందం తమిళనాడులో అధ్యయనం చేసింది. అక్కడి ప్రభుత్వం విద్య, ఉద్యోగ నియామకాల్లో ఎస్సీలకు 18 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తోంది. ఎస్సీల్లో 76 వరకు ఉప కులాలున్నాయి. ఎస్సీల వర్గీకరణ కోసం 2008 మార్చి 25న తమిళనాడు ప్రభుత్వం జస్టిస్ ఎంఎస్ జనార్దనం ఆధ్వర్యంలో ఏక సభ్య జ్యుడీషియల్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కమిషన్ సిఫారసుల మేరకు ‘తమిళనాడు అరుంధతీయర్స్ (ప్రత్యేక రిజర్వేషన్లు) చట్టాన్ని-2009’ను అమల్లోకి తెచ్చింది. ఆ చట్టం ప్రకారం.. మొత్తం 18 శాతం ఎస్సీ రిజర్వేషన్లలో అరుంధతీయర్లకు విద్య, ఉద్యోగ నియామకాల్లో 3 శాతం రిజర్వేషన్లను వర్తింపజేసింది. 2009 నుంచి ఆ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్లు విజయవంతంగా అమలవుతున్నాయి.
వర్గీకరణ పూర్తికి నిర్దిష్ట గడువు ఉండాలి
ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను పూర్తి చేయడానికి నిర్దిష్ట గడువు ఉండాలని మంత్రి సీతక్క అన్నారు. క్యాబినెట్ సబ్ కమిటీ కొన్ని కీలక జిల్లాలను సందర్శించి, వర్గీకరణపై ప్రజాభిప్రాయాన్ని సేకరించాలని మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే జ్యుడీషియల్ కమిషన్ తప్పనిసరిగా సామాజిక న్యాయాన్ని ప్రతిబింబింపజేయాలని, నివేదికకు న్యాయబద్ధత ఉండాలని అన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. క్యాబినెట్ సబ్ కమిటీ త్వరలోనే జిల్లాల పర్యటన చేపడుతుందని చెప్పారు. వివిధ మార్గాల ద్వారా సేకరించిన ఎస్సీ ఉప కులాల సమాచారాన్ని సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీ్‌స(సెస్) సమీక్ష కోసం పంపిస్తామిని తెలిపారు.
బీసీల సామాజిక, ఆర్థిక సర్వే చేయాలి
రాష్ట్రంలోని వెనకబడిన తరగతుల (బీసీ) సామాజిక ఆర్థిక సర్వేను చేపట్టాలని ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. బీసీ ఓటర్ల గణనను డిసెంబరు 9లోపు పూర్తి చేయాలంటూ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీ ఓటర్ల లెక్కింపుతో పాటే బీసీల సామాజిక ఆర్థిక సర్వేను కూడా చేపట్టి గడువులోగా పూర్తి చేయాలని ఉపసంఘం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఎస్సీ వర్గీకరణ అంశంపై చర్చించడానికి మంగళవారం సచివాలయంలో సమావేశమైన ఈ కమిటీ బీసీల సామాజిక ఆర్థిక సర్వేపై కూడా చర్చించింది. రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కమిటీ సమావేశంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, సీతక్క, పొన్నం ప్రభాకర్, డి.శ్రీధర్‌బాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
బీసీల సామాజిక ఆర్థిక సర్వే, ఓటర్ల లెక్కింపు కూడా యుద్ధప్రాతిపదికన చేపట్టాలంటూ కమిటీ సిఫారసు చేసింది. అసెంబ్లీలో చేసిన తీర్మానం, క్యాబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు బీసీల సామాజిక ఆర్థిక సర్వేను చేపట్టాల్సి ఉందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పునరుద్ఘాటించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.. బీసీ ఓటర్ల సమాచారం కచ్చితత్వంతో ఉండాలని చెప్పారు. రాజకీయాల్లో బీసీల రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించడానికి ఒక కమిషన్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని సీనియర్ అధికారులు సూచించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. బీసీ ఓటర్ల గణన, సామాజిక ఆర్థిక సర్వే సజావుగా సాగాలన్నారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. బీసీ ఓటర్ల గణన ఎలాంటి తప్పులు లేకుండా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా సర్వేకు అవసరమైన ప్రొఫార్మా, న్యాయబద్ధత, నోడల్ ఎజెన్సీ బాధ్యతలు వంటి అంశాలను అధికారులు సమావేశం దృష్టికి తెచ్చారు. ఈ విషయాలన్నింటినీ తదుపరి క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో చర్చిద్దామని మంత్రులు తెలిపారు.
Updated Date - Oct 09 , 2024 | 03:20 AM