Registration Services: 72 సేవలపై స్టాంప్ డ్యూటీ!
ABN, Publish Date - Aug 27 , 2024 | 04:26 AM
ప్రజలకు అందించే రిజిస్ట్రేషన్ సేవల్లో మార్పు రావాలని, అదే సమయంలో ఆదాయాన్నీ పెంచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటైన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ పరిధిలో ఉన్న అన్ని ఆదాయ మార్గాలపైనా దృష్టి సారిస్తోంది.
ఫ్రాంచైజీ, కాపీరైట్స్, ప్రకటనలు,
కార్పొరేట్ ఒప్పందాలపైనా ఫీజులు
ఆన్‌లైన్ చేసి, రాబడి పెంచుకోవడంపై దృష్టి
రిజిస్ట్రేషన్ సేవల్లో మార్పులకు సర్కారు సిద్ధం!
భూముల విలువలను శాస్త్రీయంగా పెంచాలి
ప్రజలకు భారంగా పరిణమించకూడదు
అధికారులకు మంత్రి పొంగులేటి సూచన
మహారాష్ట్ర, ఎంపీ, కర్ణాటకకు బృందాలు
హైదరాబాద్, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): ప్రజలకు అందించే రిజిస్ట్రేషన్ సేవల్లో మార్పు రావాలని, అదే సమయంలో ఆదాయాన్నీ పెంచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ప్రధాన ఆదాయ వనరుల్లో ఒకటైన స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ పరిధిలో ఉన్న అన్ని ఆదాయ మార్గాలపైనా దృష్టి సారిస్తోంది. అనేక డాక్యుమెంట్లకు స్టాంప్ డ్యూటీని వర్తింపజేయాలని యోచిస్తోంది. సాధారణంగా రిజిస్ట్రేషన్లంటే క్రయవిక్రయాలు, గిఫ్ట్ డీడ్‌లు, డెవల్‌పమెంట్ అగ్రిమెంట్లు మాత్రమే మనకు కనిపిస్తాయి. కానీ, తనఖా, లీజ్ అగ్రిమెంట్స్, ఫ్రాంచైజీ లీజ్ వంటివి అనేకం ఉన్నాయి.
రిజిస్ట్రేషన్ చట్టంలోని నిబంధనల ప్రకారం 72 రకాల డాక్యుమెంట్ల ద్వారా కూడా ఆదాయాన్ని పొందాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆ దిశగా కసరత్తు చేయాలని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజలకు అందించే రిజిస్ట్రేషన్ల సేవల్లో మార్పు రావాలని, అదేసమయంలో సర్కారుకు రాబడినీ పెంచాలని స్పష్టం చేశారు. ఇందుకోసం ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న ఉత్తమ విధానాలను అధ్యయనం చేయాలని చెప్పారు. వాటిలో అత్యుత్తమమైన వాటిని రాష్ట్రంలో అమల్లోకి తీసుకొద్దామని అన్నారు. అంటే మరిన్ని సేవలకు రిజిస్ట్రేషన్ ఫీజు వసూలు చేసేందుకు సర్కారు సన్నద్ధమైందన్నమాట! ప్రస్తుతం 39 రకాల సేవలు వినియోగంలో ఉన్నా.. వాటికి స్టాంప్‌డ్యూటీ ఆశించిన మేర రావడం లేదు.
ఆన్‌లైన్ సేవలు అందుబాటులో లేకపోవడం, కార్యాలయాల వరకు ఏం వెళతామనే ధోరణితో చాలా మంది స్టాంప్ డ్యూటీతో ప్రమేయం లేకుండానే ఒప్పందాలు చేసేసుకుంటున్నారు. ఇకపై ఈ పరిస్థితిని మార్చి, 72 రకాల డాక్యుమెంట్ల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు సర్కారు సిద్ధమవుతోంది. ఉదాహరణకు నైక్ అనే బహుళజాతి సంస్థ తన ఫ్రాంఛైజీ లీజ్‌కు ఇచ్చేందుకు ఒప్పందాలు చేసుకుంటుంది. అయితే ఈ ఒప్పందాల డాక్యుమెంట్లకు స్టాంప్ డ్యూటీ ఎక్కడ చెల్లిస్తారనేదానిపై స్పష్టత ఉండదు. ఇలాంటి కంపెనీలు నిత్యం భారీ సంఖ్యలో లీజు ఒప్పందాలు చేసుకుంటూనే ఉంటాయి. వీటన్నింటినీ చట్టం పరిధిలోకి తీసుకొస్తే ప్రభుత్వ ఖజానా కాసులతో కళకళలాడుతుందని భావిస్తున్నారు. అందులో భాగంగానే రిజిస్ట్రేషన్ శాఖ సేవల్లో మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
సేవల పరిధిని పెంచాలి..
రాష్ట్రంలో ప్రస్తుతం 72 రకాల డాక్యుమెంట్లు స్టాంప్ డ్యూటీ పరిధిలో ఉన్నా, రిజిస్ట్రేషన్ చార్జీలను మాత్రం కొద్ది మంది మాత్రమే చెల్లిస్తున్నారు. సేల్, గిఫ్ట్, మార్టిగేజ్, డెవల్‌పమెంట్, లీజు అగ్రిమెంట్లు వంటి పత్రాల ద్వారా స్టాంప్ డ్యూటీ ఎక్కువగా వస్తోంది. ఇందులో సుమారు 70 శాతం ఆదాయం విక్రయాలకు సంబంధించిన డ్యాక్యుమెంట్ల ద్వారానే సమకూరుతోంది. పుస్తకాల కాపీరైట్లు, ప్రకటనలు, హీరోల ఒప్పందాలు, కార్పొరేట్ ప్రకటనలు, రియల్ ఎస్టేట్ ప్రకటనల ఒప్పందాలు వంటివి అనధికారికంగా జరిగిపోతున్నాయి. ఇవేమీ స్టాంప్ డ్యూటీ పరిధిలో ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చిపెట్టడం లేదు.
రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో సబ్ రిజిస్ట్రార్లు సహకరించకపోవడం, అవినీతి వంటి కారణాల వల్ల చాలా మంది తమ డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వెళ్లడం లేదు. ఈ పరిస్థితిని మార్చాలని, ఆన్‌లైన్ సేవలు తీసుకొచ్చి 72 రకాల డాక్యుమెంట్లకు స్టాంప్ డ్యూటీని రాబట్టాలని మంత్రి పొంగులేటి అధికారులకు స్పష్టం చేసినట్లు తెలిసింది. మరోవైపు కొందరు స్టాంప్ పేపర్లకు అనధికారికంగా ఫ్రాంకింగ్ చేసేస్తున్నారు. రూ.2000 పైన ఫ్రాంకింగ్ చేయాలంటే తప్పనిసరిగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్లాలనే నిబంధన ఉంది. అంతకంటే తక్కువ మొత్తంలో స్టాంప్ పేపర్ల మీద ఫ్రాంకింగ్ చేయడంలో కొంత మంది చేతి వాటం ప్రదర్శిస్తున్నారు. రూ.100 స్టాంప్ పేపర్ మీద ఫ్రాంకింగ్ చేస్తే, సంబంధిత వ్యక్తులకు రూ.1.50 చెల్లిస్తుండగా.. మిగిలిన రూ.98.50 ప్రభుత్వానికి వెళుతోంది. కానీ, అనధికారికంగా ఫ్రాంకింగ్ చేయడంతో ఖజానాకు నష్టం వాటిల్లుతోంది. దీంతో సాధ్యమైనన్ని ఎక్కువ సేవలను ఆన్‌లైన్ ద్వారా అందించి, ఆదాయాన్ని పెంచుకోవాలని సర్కారు భావిస్తోంది.
విలువల పెంపు శాస్త్రీయంగా ఉండాలి
రాష్ట్రంలో భూముల విలువల పెంపు శాస్త్రీయంగా ఉండాలని మంత్రి పొంగులేటి ఆదివారం ఎంసీహెచ్‌ఆర్డీలో నిర్వహించిన సమావేశంలో అధికారులకు స్పష్టం చేశారు. విలువల పెంపు ప్రజలకు భారంగా పరిణమించకూడదన్నారు. అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యమైన విధానాలపై అధికారులు దృష్టిపెట్టాలని సూచించారు. కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలపై, మార్కెట్ విలువను ఏ ప్రాతిపదికన లెక్కిస్తారనే అంశాలపై అధ్యయనం చేసేందుకు అధికారుల బృందాలు ఆయా రాష్ట్రాల్లో పర్యటించనున్నాయి.
20 శాతం పెంచారు, 40 శాతం పెంచారు.. అనే అశాస్త్రీయ ప్రచారాలకు తావు లేకుండా భూముల విలువలను పెంచాలని మంత్రి సూచించారు. ఆయా ప్రాంతాలు, అక్కడ జరిగే క్రయవిక్రయాలు, బహిరంగ మార్కెట్‌లో భూముల ధరలు వంటి అంశాలను పరిశీలించి.. శాస్త్రీయంగా విలువలను పెంచాలని చెప్పారు. ఇదే అంశంపై మహారాష్ట్ర, కర్ణాటక వెళ్లి వచ్చిన బృందాలు ఇచ్చే నివేదిక ఆధారంగా మరోసారి సమావేశమై చర్చించాలని మంత్రి ప్రతిపాదించినట్లు తెలిసింది.
Updated Date - Aug 27 , 2024 | 05:26 AM