Mancherail District : ఈ పాపం ఎవరిది?
ABN, Publish Date - Nov 08 , 2024 | 03:44 AM
దొరికిందేదో తింటూ వీధుల్లో తిరిగే ఆ శునకాలు మునిసిపల్ సిబ్బంది కంటపడకుండా ఉంటే బాగుండేదేమో.. ప్రాణాలతో ఉండేవి ఎప్పట్లానే హాయిగా సంచరించేవి. కానీ వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించే సిబ్బంది చేతికి చిక్కి...
పది రోజులుగా తిండి లేక వీధి కుక్కల మృతి
మంచిర్యాల
పశు సంరక్షణ కేంద్రంలో దారుణం
కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న మరో 12 శునకాలు
మంచిర్యాల, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): దొరికిందేదో తింటూ వీధుల్లో తిరిగే ఆ శునకాలు మునిసిపల్ సిబ్బంది కంటపడకుండా ఉంటే బాగుండేదేమో.. ప్రాణాలతో ఉండేవి ఎప్పట్లానే హాయిగా సంచరించేవి. కానీ వీధి కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించే సిబ్బంది చేతికి చిక్కి... తినడానికి తిండి దొరక్క ఆకలితో అలమటించి నరకయాతన అనుభవిస్తూ చచ్చిపోయాయి. ఇలా ఒకటి, రెండు కాదు.. మంచిర్యాల పశు సంరక్షణ కేంద్రంలో ఏకంగా ఎనిమిది వీధి కుక్కలు మృత్యువాత పడగా.. మరో 12 శునకాలు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాయి. ఆ ఆస్పత్రి నుంచి భరించలేని దుర్వాసన వస్తుండడంతో ఈ దారుణం గురువారం తెలిసింది. అసలేం జరిగిందంటే... వీధి కుక్కలకు కు.ని ఆపరేషన్లు చేసేందుకు మంచిర్యాలలో ప్రత్యేకంగా ఓ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు.
ఇందులో ఓ ఆపరేషన్ థియేటర్, శస్త్రచికిత్స అనంతరం శునకాలను అబ్జర్వేషన్‌లో ఉంచేందుకు మరో గది ఉన్నాయి. హైదారాబాద్‌కు చెందిన యానిమల్ వెల్ఫేర్ సొసైటీ.. మునిసిపాలిటీ నిర్వహించిన టెండరు ప్రక్రియలో ఆస్పత్రి నిర్వహణ బాధ్యతను దక్కించుకుంది. ఆస్పత్రిలో ఓ వెటర్నరీ వైద్యుడు, ఇద్దరు వెటర్నరీ అసిస్టెంట్లు, ఓ వాచ్‌మన్, హెల్పర్‌ను నియమించింది. ఆస్పత్రిలో రోజూ 15 శునకాలకు శస్త్రచికిత్సలు చేస్తుంటారు. ఈ క్రమంలో 15 రోజుల క్రితం 20 శునకాలను సిబ్బంది ఆస్పత్రికి తరలించారు.
అయితే, సెప్టెంబరు, అక్టోబరు నెలల జీతాలు ఇవ్వకపోవడంతో సిబ్బంది తమ యాజమాన్యాన్ని నిలదీయగా డాక్టర్ మినహా అందరినీ పది రోజుల క్రితం ఉద్యోగం నుంచి తీసేశారు. అప్పట్నించి సిబ్బంది ఎవరూ ఆస్పత్రికి ఎవరూ రావడం లేదు. అప్పటికే ఆస్పత్రిలో ఉన్న శునకాలకు ఇదే శాపమైంది. ఆలనాపాలన చూసే వారు లేక, ఆకలితో అలమటించి ఎనిమిది కుక్కల వారం క్రితం చనిపోయాయి. మరణించిన శునకాల కళేబరాలు తొలగించే వారు కూడా లేకపోవడంతో ఆ ప్రాంతమంతా తీవ్ర దుర్గంధం వ్యాపించడంతో మూగ ప్రాణాల నరకయాతన బయటకు తెలిసింది. కాగా, ఈ విషయమై ఆస్పత్రి వైద్యుడిని సంప్రదించగా అతను బదులివ్వడం లేదు.
Updated Date - Nov 08 , 2024 | 03:45 AM