Suryapet: ఎన్నారైకు బెదిరింపులు.. మహిళకు వేధింపులు
ABN, Publish Date - Dec 05 , 2024 | 03:54 AM
తన సమస్యను పరిష్కరించాలని ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ మహిళను లైంగికంగా వేధిస్తున్నట్లు, ఓ ఎన్నారై వద్ద కారు తీసుకుని తిరిగి ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్న సూర్యాపేట జిల్లా మఠంపల్లి ఎస్సై రామాంజనేయులు సస్పెన్షన్‌కు గురయ్యారు.
సూర్యాపేట జిల్లా మఠంపల్లి ఎస్సైపై సస్పెన్షన్ వేటు
మఠంపల్లి, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): తన సమస్యను పరిష్కరించాలని ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ మహిళను లైంగికంగా వేధిస్తున్నట్లు, ఓ ఎన్నారై వద్ద కారు తీసుకుని తిరిగి ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలున్న సూర్యాపేట జిల్లా మఠంపల్లి ఎస్సై రామాంజనేయులు సస్పెన్షన్‌కు గురయ్యారు. వ్యక్తిగత సమస్యపై ఫిర్యాదు చేసేందుకు నాలుగు నెలల క్రితం పోలీసుస్టేషన్‌కు వచ్చిన తనను ఎస్సై రామాంజనేయులు లైంగికంగా వేధింపులకు గురి చేయడంతో పాటు డబ్బులు కూడా తీసుకున్నారని ఓ మహిళ ఇటీవల సూర్యాపేట జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఆ గ్రామానికి చెందిన పెద్ద మనుషులతో మాట్లాడి ఆ వివాదాన్ని ఎస్సై పరిష్కరించుకున్నారు. అంతేకాకుండా మరో ముగ్గురు మహిళలతో ఎస్సై అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
అలాగే మట్టపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆమెరికాలో సిర్థపడ్డారు. ఆ ఎన్నారై కారు మట్టపల్లిలోని ఆయన ఇంట్లో ఉందని తెలుసుకున్న ఎస్సై రామాంజనేయులు ఆయన సొంత అవసరాల కోసం కారు వారం రోజుల పాటు కావాలని ఫోన్‌లో సంప్రదించి తీసుకున్నారు. రెండు నెలలవుతున్నా కారు తిరిగి ఇవ్వకపోగా పలు రకాలుగా ఎస్సై రామాంజనేయులు ఎన్నారైను బెదిరిస్తుండడంతో బాధితుడు మెయిల్ ద్వారా డీజీపీతో పాటు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. పలు అవినీతి ఆరోపణలతో పాటు ఎస్సై రామాంజనేయులు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో క్షేత్రస్థాయిలో విచారణ చేయించి ఎస్సై రామాంజనేయులును సస్పెండ్ చేసినట్లు సీఐ తెలిపారు.
Updated Date - Dec 05 , 2024 | 03:54 AM