Bhatti: 2035కల్లా 40 గిగావాట్ల గ్రీన్ పవర్!
ABN, Publish Date - Sep 17 , 2024 | 01:57 AM
తెలంగాణలో 2035 నాటికి అదనంగా 40వేల మెగావాట్ల(40గిగావాట్లు) గ్రీన్ పవర్(సౌర, పవన, జల విద్యుత్)ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు.
లక్ష్యంగా పెట్టుకున్నామన్న ఉప ముఖ్యమంత్రి భట్టి
గుజరాత్‌లో ప్రపంచ పునరుత్పాదక ఇంధన వనరుల పెట్టుబడిదారుల సమావేశానికి హాజరు
హైదరాబాద్, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో 2035 నాటికి అదనంగా 40వేల మెగావాట్ల(40గిగావాట్లు) గ్రీన్ పవర్(సౌర, పవన, జల విద్యుత్)ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. గుజరాత్ గాంధీనగర్‌లో సోమవారం జరిగిన ‘ప్రపంచ పునరుత్పాదక ఇంధన వనరుల పెట్టుబడిదారుల’ 4వ సమావేశంలో ఆయన పాల్గొ ని మాట్లాడారు. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తికి రాష్ట్రంలో చాలా అనుకూలత ఉందని చెప్పారు. ఏడాదిలో 300 రోజుల పాటు సౌరవిద్యుత్ ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుందని, సోలార్ విద్యుత్‌కు సంబంధించి రాష్ట్రంలో 26.4 గిగావాట్ల సామర్థ్యం కలిగిన ప్లాంట్లను ఏర్పా టు చేయడానికి అవకాశాలున్నాయని చెప్పారు.
దేశంలో బలంగా గాలులు వీచే తొలి 8 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని, 150 మీటర్ల ఎత్తుతో 5.4 గిగావాట్ల సామర్థ్యం కలిగిన పవన విద్యుత్ ప్లాంట్లు పెట్టడానికి తెలంగాణలో అనుకూల పరిస్థితులు ఉన్నాయన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లతో పాటు బొగ్గు నిల్వలు అంతరించిపోయిన ఓపెన్‌కాస్టు గనుల్లో కూడా పంప్డ్ స్టోరేజీ ప్లాంట్‌లు పెట్టి జలవిద్యుత్ ఉత్పత్తి చేయడానికి వీలుందన్నారు. వీటితోపాటు గ్రీన్ హైడ్రోజన్, జియో థర్మల్ అన్నీ కలిపి మొత్తం గా 40వేల మెగావాట్ల గ్రీన్ పవర్‌ను ఉత్పత్తి చేయడానికి వనరులున్నాయని వివరించారు. గ్రీన్ పవర్ ఉత్పత్తికి సంబంధించిన ప్రణాళికను కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి అందించారు.
రాబోయే రోజుల్లో ఏఐ సిటీ, ఫోర్త్ సిటీతో పాటు మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్‌తో తెలంగాణ ముఖచిత్రమే మారనుందన్నారు. ప్రాంతీయ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్)తో కీలక పారిశ్రామిక కారిడార్లను అనుసంధానం చేస్తామన్నారు. పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. భారతదేశం 2030కల్లా 500 గిగా వాట్ల గ్రీన్ పవర్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్న విషయాన్ని భట్టి గుర్తు చేశారు. కార్యక్రమంలో ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు, మహారాష్ట్ర, ఛత్తీ్‌సగఢ్, గోవా, రాజస్థాన్ సీఎంలు హాజరయ్యారు. అనంతరం సోలార్ రంగంలో పెట్టుబడుల కోసం దాదాపు 40 మంది పారిశ్రామిక వేత్తలతో భట్టి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆయన వెంట ఎస్‌పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ, ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి, తదితరులు ఉన్నారు.
Updated Date - Sep 17 , 2024 | 01:57 AM