Telangana: కేసీఆర్ వల్లే ఇదంతా జరిగింది.. మాజీ ఎంపీ వినోద్ కుమార్ కీలక వ్యాఖ్యలు..
ABN, Publish Date - Nov 18 , 2024 | 03:38 PM
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ ఎంపీ వినోద్ కుమార్ తీవ్ర విమర్శలు గుప్పించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Telangana: రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి పెరగడానికి, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధం లేదని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. ప్రాణహిత నీళ్లను వాడుకునే అవకాశాలను కాళేశ్వరం ప్రాజెక్టు కల్పిస్తోందని.. ఎల్లంపల్లి, మిడ్ మానేరు పంపింగ్ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగం కాదా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏ మాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తట్టెడు మన్ను తీయని రేవంత్ పండిన ధాన్యాన్ని తన ఖాతాలో వేసుకునే హక్కు లేదన్నారు. పంట విస్తీర్ణం భారీగా పెరగడమే ధాన్యం దిగుబడి పెరగడానికి కారణమని అన్నారు. కేసీఆర్ తీసుకున్న రకరకాల రైతాంగ అనుకూల విధానాలు సాగు విస్తీర్ణం పెరగడానికి కారణమని పేర్కొన్నారు.
కేసీఆర్ వల్లే..
కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు.. తమకు ఏనాడైనా నీళ్లు వస్తాయనే దైర్యంతో రైతులు వ్యవసాయం పెంచారని అన్నారు. రేవంత్ రెడ్డి అనాలోచితంగా మాట్లాడుతున్నాడని.. మూసీకి నీళ్లు తెస్తానంటున్న రేవంత్ కాళేశ్వరం నీళ్ళే కదా తెచ్చేది అని కామెంట్స్ చేశారు. 1990 నుంచి 2014 వరకు తగ్గిన వరి పంట విస్తీర్ణం 2014 తర్వాత ఎందుకు పెరిగింది?..కేసీఆర్ రైతు అనుకూల పాలన వల్ల కాదా? అని అన్నారు. కేసీఆర్ తెచ్చిన రైతు బంధు వల్లనే రైతు లో విశ్వాసం పెరిగిందన్నారు. రైతు బంధే రైతులో ధైర్యాన్ని పెంచిందని.. యాభై యేండ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ వ్యవసాయంలో వెనక బడిందని విమర్శలు గుప్పించారు. కేసీఆర్ పదేండ్ల పాలనలోనే రైతు బాగుపడ్డారని అన్నారు. 24 గంటల కరెంటు కేసీఆర్ ఇచ్చారు కనుకే ధాన్యం దిగుబడి పెరిగిందని.. అది కొనసాగుతోందని వ్యాఖ్యానించారు. రైతు పండించిన పంటను నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేయడం కేసీఆర్ మొదలు పెట్టి రైతులో విశ్వాసం పెంచారన్నారు. గులాబీ జెండా వల్లే రైతుకు భరోసా ఇచ్చిందన్నారు.
పది మందిని గెలిపించినా..
మేడిగడ్డ బ్యారేజి ఇంత వర్షాకాలం లోనూ నిలబడిందని.. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే కుంగిన మేడిగడ్డ పిల్లర్ ను ఇప్పటికే బాగు చేసే వాళ్ళమని పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు ఒక్కసారైనా మేడిగడ్డ రిపేర్ గురించి కేంద్ర పెద్దలను అడిగారా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎంపీలు పది మందిని గెలిపించి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని అన్నారు.
ప్రజా వంచన వారోత్సవాలు..
బీఆర్ఎస్వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ..మంత్రి సీతక్క ప్రజా పాలనా విజయోత్సవాలు జరుపుతామంటున్నారని అయితే ప్రజా వంచన వారోత్సవాలు జరుపుకోవాలని సూచించారు. లగచర్లలో గిరిజనులపై దౌర్జన్యాలు జరిగితే స్పందించని సీతక్క లేని గొప్పలు చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యారంటీలు అమలు చేయనందుకు సీతక్క ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Also Read:
ఎన్హెచ్ఆర్సీని కలిసిన లగచర్ల ఫార్మా బాధితులు.. ఏం చెప్పారంటే..
Updated Date - Nov 18 , 2024 | 03:38 PM