ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rice Defaults: బకాయిలున్న మిల్లర్లకు ధాన్యం ఇవ్వబోం

ABN, Publish Date - Oct 17 , 2024 | 03:34 AM

గత కొన్ని సీజన్లుగా బియ్యం బకాయిలున్న రైస్‌మిల్లర్లకు వానాకాలం సీజన్‌లో ధాన్యం ఇవ్వకూడదని ధాన్యం సేకరణ పాలసీ- 2024పై నియమించిన మంత్రి వర్గ ఉపసంఘం నిర్ణయించింది.

  • ఉపేక్షించేది లేదు.. కఠిన వైఖరి అవలంబిస్తాం

  • మంత్రివర్గ ఉప సంఘం సమావేశంలో నిర్ణయం

  • సన్న ధాన్యం మిల్లింగ్‌ చేస్తే వచ్చేది 58ు బియ్యమే

  • నష్ట పరిహారం చెల్లించాలని కోరిన రైస్‌ మిల్లర్లు

హైదరాబాద్‌, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): గత కొన్ని సీజన్లుగా బియ్యం బకాయిలున్న రైస్‌మిల్లర్లకు వానాకాలం సీజన్‌లో ధాన్యం ఇవ్వకూడదని ధాన్యం సేకరణ పాలసీ- 2024పై నియమించిన మంత్రి వర్గ ఉపసంఘం నిర్ణయించింది. బియ్యం బకాయిదారుల విషయంలో కఠిన వైఖరి అవలంబించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేదిలేదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌ స్పష్టం చేశారు. సచివాలయంలో బుధవారం మంత్రివర్గ ఉపసంఘం రెండోసారి సమావేశమైంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బియ్యం బకాయిలున్న రైస్‌మిల్లర్లు... వెంటనే ప్రభుత్వానికి బియ్యం అప్పగించాలని సూచించారు.


ధాన్యం కేటాయించే సమయంలో రైస్‌మిల్లర్ల గత చరిత్ర, రికార్డులను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో రైస్‌మిల్లర్ల అభిప్రాయాలను కూడా తీసుకున్నారు. దొడ్డు ధాన్యం 100 కిలోలు మిల్లింగ్‌ చేస్తే... 67 కిలోల బియ్యం వస్తాయని, కానీ సన్న ధాన్యం 100 కిలోలు ఉడిస్తే... 58 కిలోల సన్నబియ్యం మాత్రమే వస్తాయని రైస్‌మిల్లర్లు వివరించారు. 9 కిలోల మేర తమకు నష్టం వాటిల్లుతున్నందున క్వింటాల్‌కు రూ.300 నష్ట పరిహారం ఇవ్వాలని రైస్‌మిల్లర్లు కోరారు. గత ప్రభుత్వ హయాం నాటి రవాణా, కస్టోడియన్‌, మిల్లింగ్‌ చార్జీల బకాయిలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని, వాటిని తక్షణమే మంజూరు చేయాలని విజ్ఞప్తిచేశారు.


ఈ అంశంపై ప్రభుత్వం ఆలోచన చేస్తుందని, త్వరలో నిర్ణయం తీసుకుంటామని మంత్రులు హామీ ఇచ్చారు. సన్న ధాన్యం మిల్లింగ్‌కు సంబంధించి మిల్లర్లు లేవనెత్తిన అంశంపై చర్చించి, నిర్ణయం తీసుకుంటామని ఉత్తమ్‌ ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో రైస్‌మిల్లర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని, ధాన్యాన్ని ఎక్కడికక్కడ అమ్ముకున్నారని ఆరోపించారు. ఈ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తాము ప్రయత్నిస్తున్నామని, ఇకపై అలాంటి చర్యలను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. బకాయిలు లేని మిల్లర్లకు ధాన్యం ఇచ్చే క్రమంలో ఎలాంటి గ్యారెంటీ తీసుకోవాలనే అంశంపైనా చర్చలు జరుగుతున్నాయని ‘ఆంధ్రజ్యోతి’కి మంత్రి ఉత్తమ్‌ తెలిపారు.

Updated Date - Oct 17 , 2024 | 03:34 AM