మధ్యాహ్న భోజనంలో సమస్యలున్నాయ్
ABN, Publish Date - Nov 28 , 2024 | 03:36 AM
మధ్యాహ్న భోజన పథకంలో మార్పులు చేస్తామని, ఇందుకోసం ఓ సాఫ్ట్‌వేర్‌ను తీసుకువస్తామని తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి తెలిపారు.
త్వరలోనే పథకంలో మార్పులు
విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి
ఇబ్రహీంపట్నం, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): మధ్యాహ్న భోజన పథకంలో మార్పులు చేస్తామని, ఇందుకోసం ఓ సాఫ్ట్‌వేర్‌ను తీసుకువస్తామని తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి తెలిపారు. ఆహారం కలుషితమవుతుండంతో విద్యార్ధులు అస్వస్థతకు గురువుతున్న ఘటనలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో బుధవారం ఆయన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని శేరిగూడ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. తర్వాత అక్కడే విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. సిబ్బందితో మాట్లాడి లోపం ఎక్కడ జరుగుతుందని ఆరా తీశారు. ప్రభుత్వం సరాఫరా చేస్తున్న బియ్యంలో పురుగులు ఉంటున్నాయని సిబ్బంది వివరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ... మధ్యాహ్న భోజనం అందించడంలో రాష్ట్రవ్యాప్తంగా సమస్యలు కనబడుతున్నాయని తెలిపారు. కూరగాయలు, సామగ్రి కోసం ఒక్కో విద్యార్థికి కేటాయిస్తున్న బిల్లులు సరిపోవడం లేదని, కాబట్టే ఆహారంలో నాణ్యత తగ్గిపోయిందని పేర్కొన్నారు. ఈ పాఠశాలలో మెనూ ప్రకారం కాకుండా మరోకూరతో వడ్డించినా భోజనం బాగానే ఉందన్నారు. వంటగదిలో మెరుగైన వసతులు కల్పించాల్సి ఉందన్నారు. కాగా, గ్యాస్ కోసం అదనంగా డబ్బులు ఇప్పించాలని, గుడ్లను తక్కువ ధరకు అందించాలని సిబ్బంది ఆయనను కోరారు. అలాగే పెండింగ్ బిల్లులను త్వరగా విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
Updated Date - Nov 28 , 2024 | 03:43 AM