Hyderabad: గిరిజన ఆడబిడ్డకు ప్రభుత్వ చేయూత
ABN, Publish Date - Jul 25 , 2024 | 04:44 AM
చదువు కొనసాగించేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిరిసిల్ల జిల్లా గిరిజన ఆడబిడ్డకు ప్రభుత్వం అండగా నిలిచింది. ఐఐటీలో చేరేందుకు ఆ విద్యార్థినికి ఆర్థిక సహాయం చేసింది.
ఐఐటీలో చేరేందుకు ఆర్థిక సాయం.. అండగా ఉంటామని హామీ
హైదరాబాద్, జూలై 24 (ఆంధ్రజ్యోతి): చదువు కొనసాగించేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిరిసిల్ల జిల్లా గిరిజన ఆడబిడ్డకు ప్రభుత్వం అండగా నిలిచింది. ఐఐటీలో చేరేందుకు ఆ విద్యార్థినికి ఆర్థిక సహాయం చేసింది. వీర్నపల్లి మండలం గోనేనాయక్ తండాకు చెందిన బాదావత్ మధులత జేఈఈలో ర్యాంకు సాధించి పట్నా ఐఐటీలో సీటు పొందింది. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఐఐటీకి వెళ్లలేక ఆగిపోయింది. అందుకు సంబంధించి మీడియాలో వచ్చిన కథనాలపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి, సదరు విద్యార్థినికి తక్షణమే సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు.
దాంతో బుఽధవారం సచివాలయంలో విద్యార్థినికి గిరిజనశాఖ కార్యదర్శి శరత్ రూ.1,51,831 చెక్‌ను అందించారు. మధులత కోరిక మేరకు కంప్యూటర్ కొనుగోలు కోసం రూ.70 వేలు, అదనంగా మరో రూ.30 వేలు కూడా ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారు. భవిష్యత్తులోనూ అండగా ఉంటామని తెలిపారు. కాగా, పేదరిక కష్టాలను ఎదుర్కొని, ప్రఖ్యాత ఐఐటీలో సీటు సాధించినందుకు మధులతకు సీఎం రేవంత్ ఎక్స్(ట్విటర్)లో అభినందనలు తెలిపారు. ఏ ఆటంకం లేకుండా ఐఐటీలో ఆమె రాణించి, తెలంగాణకు మరింత మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నానని సీఎం పేర్కొన్నారు.
Updated Date - Jul 25 , 2024 | 04:44 AM