‘బిల్డ్‌నౌ’గా టీజీ-బీపాస్
ABN, Publish Date - Dec 03 , 2024 | 04:54 AM
భవనాలు.. లేఅవుట్ల అనుమతులు, ఆక్యుపెన్సీ పత్రాల జారీ, భూవినియగ మార్పిడి వంటి సేవలకు ప్రభుత్వం ఆధునికతను జోడించింది.
5 నిమిషాల్లో డిజైన్లకు అనుమతి
ఏఆర్‌తో భవనాలు, లేఅవుట్ల వీక్షణ
జీవోల నిబంధనల కోసం ఏఐ సేవలు
తొలుత జీహెచ్‌ఎంసీలో పరిచయం
ఫిబ్రవరి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా..
హైదరాబాద్, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): భవనాలు.. లేఅవుట్ల అనుమతులు, ఆక్యుపెన్సీ పత్రాల జారీ, భూవినియగ మార్పిడి వంటి సేవలకు ప్రభుత్వం ఆధునికతను జోడించింది. ఈ తరహా సేవలను ఏక గవాక్ష(సింగిల్ విండో) విధానంలో అందజేస్తున్న టీజీ-బీపా్‌సను ‘బిల్డ్‌నౌ’గా మార్చి.. ‘ఒకే రాష్ట్రం.. ఒకే విధానం’ పేరుతో ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుంది. ప్రజల్లో విశ్వాసాన్ని పెంచేలా.. ఈ విధానంలో మార్పులకు శ్రీకారం చుట్టింది. ఆమ్యామ్యాలు ముట్టచెబితేగానీ అనుమతులు దొరకవనే పరిస్థితి నుంచి.. ఆన్‌లైన్‌లో అంతా పారదర్శకంగా, అవినీతిరహితంగా వ్యవస్థను పరిచయం చేయనుంది. లేఅవుట్, భవనాల డ్రాయింగ్ పరిశీలనకు వారాల సమయం పట్టేది. ఇకపై ఆ ప్రక్రియను నిమిషాల్లో పూర్తిచేసేలా చర్యలు తీసుకోనుంది. దరఖాస్తుదారుల సందేహాల నివృత్తికి, సమస్యలను తక్షణం పరిష్కరించడానికి, దరఖాస్తుల్లో లోపాలుంటే.. వాటిని ఎత్తిచూపుతూ.. సంబంధిత జీవోను.. వాటిల్లోని నిబంధనలను దరఖాస్తుదారులకు అర్థమయ్యేలా కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. డిజైన్లకు అనుగుణంగా నిర్మాణాలున్నాయా? లేదా? అనే విషయాన్ని గుర్తించేందుకు అగ్మెంటెడ్ రియాల్టీ(ఏఆర్) విధానాన్ని ఉపయోగించనుంది. ఇలా మార్పులు చేసిన బిల్డ్‌నౌ వివరాలను.. ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పురపాలక అధికారులు వివరించారు.
5 నిమిషాల్లో అనుమతులు
డ్రాయింగ్ పరిశీలనలను వేగవంతం చేయడం వల్ల.. అనుమతుల ప్రక్రియ 5 నిమిషాల్లోనే పూర్తికానుందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇతర రాష్ట్రాల్లో ఈ ప్రక్రియకు 2 నుంచి 30 రోజుల సమయం పడుతోంది. 40, అంతకంటే ఎక్కువ అంతస్తులున్న భవనాల డ్రాయింగ్ పరిశీలనకు 20-30 రోజులు తప్పనిసరిగా మారింది. అయితే.. బిల్డ్‌నౌ విధానంలో ఈ ప్రక్రియలన్నీ 3 నిమిషాల్లో పూర్తయ్యి.. అనుమతులు వస్తాయి. 150 కంటే ఎక్కువ విల్లాలను నిర్మించే లేఅవుట్‌లకు సంబంధించిన అనుమతులకు 10-15 రోజులు పడుతుండగా.. కొత్త విధానంలో 5 నిమిషాల్లో పూర్తికానుంది. ఇక ఓపెన్ ప్లాట్స్ లేఅవుట్ అనుమతి నిమిషంలో పూర్తవ్వనుంది. ఇక ఆక్యుపెన్సీ జారీకి ఇప్పటి వరకు 15 రోజుల సమయం పడుతుండగా.. కొత్త విధానంలో 10 రోజులకు కుదించినట్లు అధికారులు చెబుతున్నారు.
ఏఆర్ టెక్నాలజీతో..
బిల్డ్‌నౌలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏఆర్ విధానంలో కియో్‌స్కలు అందుబాటులోకి రానున్నాయి. ఈ విధానంలో భవన నిర్మాణానికి ముందే ఆకృతి ఎలా ఉండబోతుందో చూసుకునేలా 3డీ విజువలైజేషన్ ఉంటుంది. ఇంటరాక్టివ్ 3డీ మోడల్స్ ద్వారా కంప్యూటర్ లేదా హెడ్‌సెట్‌లో డిజైన్ ప్రకారం భవన నిర్మాణం పూర్తయితే ఎలా ఉంటుందో చూసే వీలు కలుగుతుంది. రూల్స్ అసిస్టెంట్ సిస్టమ్ పేరుతో ఏఐ విధానంలో ప్లాట్ విస్తీర్ణం, భవనం ఎత్తు, వెడల్పు, సెట్ బ్యాక్ ఎలా ఉండాలి అనే అంశాలను తెలుసుకునేలా మార్పులు చేశారు. తక్షణ డేటా విశ్లేషణకు ఏఐని వినియోగిస్తారు. జీఐఎస్ ఇంటిగ్రేషన్, సులభతరమైన పేమెంట్ గేట్‌వే, అనుబంధ విభాగాలతో అనుసంధానం, డాక్యుమెంట్ మేనేజ్‌మెంట్ సిస్టిమ్(డీఎంఎస్) వంటి వ్యవస్థలను బిల్డ్‌నౌలో పరిచయం చేస్తారు. అంతేకాదు.. బ్లాక్‌చైన్ టెక్నాలజీ ద్వారా దరఖాస్తుదారుడు ఎప్పటికప్పుడు పురోగతిని తెలుసుకునే వీలుంటుంది.
ఫిబ్రవరి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి
ప్రస్తుతానికి బిల్డ్‌నౌ పేరుతో టీజీ-బీపా్‌సను ఆధునీకరించాం. తొలుత జీహెచ్‌ఎంసీ, ఆ తరువాత హెచ్‌ఎండీలో దీన్ని అమలు చేస్తాం. ఫిబ్రవరి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థానిక సంస్థల్లోనూ ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తాం. కొత్త విధానంపై పట్టణ ప్రణాళిక సిబ్బందికి శిక్షణ ఇవ్వాల్సి ఉంది.
- ఎస్. దేవేందర్ రెడ్డి, డీటీసీపీ
Updated Date - Dec 03 , 2024 | 04:54 AM