Health Department: ఆరోగ్య ఉన్నతాధికారికి మెమో
ABN, Publish Date - Nov 14 , 2024 | 04:49 AM
వైద్య ఆరోగ్యశాఖలోని ఓ కీలక విభాగాధిపతికి సర్కారు షాక్ ఇచ్చింది. కొద్దిరోజుల్లో పదోన్నతి ఉండగా... సదరు ఇన్‌చార్జి హెచ్‌వోడీకి తాజాగా చార్జిమెమో జారీ చేసింది. ఆయనపై రెండు మూడు అంశాల్లో తీవ్ర ఆరోపణలు రావడంతో చార్జిమెమో జారీ చేసినట్లు సమాచారం.
గత సర్కారు హయాంలోనే ఆయనపై తీవ్ర ఆరోపణలు
ఈ ఏడాది ఉద్యోగుల సాధారణ బదిలీల్లోనూ అవకతవకలు
ప్రభుత్వ అనుమతి లేకుండా డిప్యుటేషన్లు, సరెండర్ పోస్టింగ్‌లు
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తీవ్ర ఆగ్రహం
హైదరాబాద్, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి) : వైద్య ఆరోగ్యశాఖలోని ఓ కీలక విభాగాధిపతికి సర్కారు షాక్ ఇచ్చింది. కొద్దిరోజుల్లో పదోన్నతి ఉండగా... సదరు ఇన్‌చార్జి హెచ్‌వోడీకి తాజాగా చార్జిమెమో జారీ చేసింది. ఆయనపై రెండు మూడు అంశాల్లో తీవ్ర ఆరోపణలు రావడంతో చార్జిమెమో జారీ చేసినట్లు సమాచారం. ఈ కారణంగా సదరు అధికారి పదోన్నతి జాబితా నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత ప్రభుత్వం వైద్య ఆరోగ్యశాఖలో కీలకమైన వైద్యవిద్య సంచాలకులు, ప్రజారోగ్య సంచాలకులు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ పోస్టులను పదేళ్లపాటు ఇన్‌చార్జిలతోనే నెట్టుకొచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వైద్య ఆరోగ్యశాఖలో డీఎంఈ, డీహెచ్‌లను మార్చేసింది. అదే సమయంలో హెచ్‌వోడీ పోస్టులన్నీ ఏపీకి వెళ్లినందున కీలకమైన విభాగాఽధిపతి పోస్టులను మంజూరు చేసింది. ఆ పోస్టుల్లో రెగ్యులర్ హెచ్‌వోడీలను భర్తీ చేసేందుకు తాజాగా సిద్ధమైంది.
గత సర్కారు హయాంలోనే...
కాగా ప్రస్తుతం ఇన్‌చార్జి హెచ్‌వోడీగా ఉన్న సదరు అధికారి గత బీఆర్‌ఎస్ సర్కారు హయాంలో వైద్యశాఖలోని ఓ విభాగం ఇన్‌చార్జిగా పనిచేశారు. ఆ సమయంలో కొన్ని ఆరోపణలు రావడంతో నాటి ఉన్నతాధికారులు విచారణ జరిపారు. సదరు అధికారి అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడినట్లు, డబ్బులు చేతులు మారినట్లు ఆ విచారణలో తేలింది. దాంతో ఆ పోస్టు నుంచి తప్పించేశారు. అనంతరం ప్రభుత్వం మారడంతో సీనియారిటీలో ముందు వరుసలో ఉండటంతో సదరు అధికారికి ఇన్‌చార్జి హెచ్‌వోడీగా అవకాశం కల్పించారు. అయితే ఈ ఏడాది చేపట్టిన ఉద్యోగుల సాధారణ బదిలీల్లో కూడా సదరు అధికారిపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. దాంతో సర్కారు విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. మరోవైపు వైద్య ఆరోగ్యశాఖలో డిప్యూటేషన్లను ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో రద్దు చేసింది. ఎవరికైనా డిప్యూటేషన్, వర్క్ ఆర్డర్ కావాలంటే కచ్చితంగా వైద్య ఆరోగ్యశాఖ అనుమతి తీసుకోవాలి. అనుమతి వచ్చిన తర్వాతే వర్క్ ఆర్డర్ ఇవ్వాలి. అలాగే ఉద్యోగుల విజ్ఞప్తి లేఖలు ఉంటే ప్రభుత్వానికి పంపాలి. ఆ ఉద్యోగి కోరిన చోట పోస్టు ఖాళీగా ఉంటే డిప్యూటేషన్‌కు హెల్త్ సెక్రటరీ అనుమతి ఇస్తారు. అప్పుడు మాత్రమే సదరు ఉద్యోగికి డిప్యూటేషన్ ఇవ్వాలి. కానీ ఇటీవలి కాలంలో ప్రభుత్వ అనుమతి లేకుండానే సదరు హెచ్‌వోడీ పలువురు ఉద్యోగులకు డిప్యూటేషన్ ఇచ్చారు. అంతేగాక ఉద్యోగులు కోరుకున్నచోట పోస్టింగ్ వచ్చేలా సరెండర్‌లను ప్రోత్సహించారని ప్రభుత్వానికి సమాచారం అందింది.
వైద్యశాఖలో ప్రస్తుతం డిప్యూటేషన్లకు అవకాశం లేకపోవడంతో కొందరు ఉద్యోగులు తెలివిగా క్షేత్రస్థాయి అధికారుల ద్వారా హెచ్‌వోడీ కార్యాలయానికి సరెండర్ చేయించుకుంటున్నారు. అలా చేయించుకున్న ఉద్యోగులకు ఎక్కడైనా పోస్టింగ్ ఇచ్చే అధికారం హెచ్‌వోడీలకు ఉంటుంది. ఆ వెసులుబాటును ఉపయోగించి సదరు హెచ్‌వోడీ ఇటీవల కాలంలో పలువురికి వారు కోరుకున్న చోట పోస్టింగ్ ఇచ్చినట్లు ప్రభుత్వానికి సమాచారం అందింది. దీని వెనుక కూడా పెద్దయెత్తున డబ్బులు చేతులు మారాయన్న ఆరోపణలున్నాయి. ఇటీవలే ఇటువంటి సరెండర్‌లపై సదరు హెచ్‌వోడీకి వైద్యఆరోగ్యశాఖ మంత్రి, ఉన్నతాధికారులు గట్టిగా క్లాసు తీసుకున్నట్లు సమాచారం. అయినా ఆయన తీరు మారలేదని వైద్యవర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా జిల్ల్లాల్లో పనిచేస్తున్న, తీవ్రమైన ఆరోపణలున్న కొందరు ఉద్యోగులను తన కార్యాలయంలో అత్యవసరం పేరుతో డిప్యూటేషన్‌పై తీసుకురావడంపైనా సర్కారు ఆగ్రహంగా ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా చార్జిమెమో జారీ చేసినట్లు తెలుస్తోంది.
Updated Date - Nov 14 , 2024 | 04:49 AM