ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Loan Waiver; నేడే మూడో విడత రుణమాఫీ

ABN, Publish Date - Aug 15 , 2024 | 02:56 AM

రైతుల రుణమాఫీకి సంబంధించి మూడో విడత అమలుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు రుణం పొందిన రైతులను రుణవిముక్తులను చేయడానికి నిధులు సమకూర్చింది.

  • 2 లక్షల వరకు రుణాలున్న రైతుల ఖాతాల్లో జమ.. వైరా సభలో చెక్కులు అందజేయనున్న రేవంత్‌

హైదరాబాద్‌, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి): రైతుల రుణమాఫీకి సంబంధించి మూడో విడత అమలుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు రుణం పొందిన రైతులను రుణవిముక్తులను చేయడానికి నిధులు సమకూర్చింది. ఈ కేటగిరీలో సుమారు 6 లక్షల మంది రైతులు ఉండగా.. వీరికి రుణమాఫీ చేసేందుకు సుమారు రూ.6 వేల కోట్లు అవసరమవుతున్నాయి. ఇందుకోసం ఆర్‌బీఐ నిర్వహించిన ఈ-వేలం ద్వారా ప్రభుత్వం గతవారం రూ.3 వేల కోట్లు, మంగళవారం మరో రూ.3 వేల కోట్లు కలిపి రూ.6 వేల కోట్లను రుణంగా తీసుకుంది. ఈ మొత్తాన్ని మూడో విడత రుణమాఫీకి వినియోగించనుంది.


గురువారం పంద్రాగస్టు రోజున ఖమ్మం జిల్లా వైరాలో నిర్వహించే బహిరంగ సభలో మూడో విడత రుణమాఫీ కార్యక్రమాన్ని అమలు చేపట్టనున్నారు. వైరా సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. రైతులకు చెక్కులు పంపిణీ చేయనున్నారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా రూ.2 లక్షల కేటగిరీలో ఉన్న రైతుల ఖాతాల్లో రుణమాఫీ సొమ్మును జమ చేస్తారు. రాష్ట్రంలో రుణమాఫీ ప్రక్రియ జూలై 15 తేదీన ప్రారంభమైన విషయం తెలిసిందే. కాగా, జూలై 18న మొదటి విడతలో రూ.లక్ష వరకు బకాయిలున్న 11,34,412 మంది రైతులకు రూ.6,035 కోట్ల రుణమాఫీ చేశారు.


ఆతర్వాత జూలై 30న రెండో విడతలో రూ.1.50 లక్షల కేటగిరీలో ఉన్న 6,40,823 మంది రైతులకు రూ.6,190 కోట్లు మాఫీ చేశారు. రెండు విడతల్లో కలిపి 17,75,235 మంది రైతులకు రూ.12,225 కోట్ల రుణమాఫీ చేశారు. మూడో విడతలో మరో 6 లక్షల మందికి రుణమాఫీ చేస్తే.. రుణమాఫీ పొందిన రైతుల సంఖ్య 23.75 లక్షలు దాటుతుంది. మొత్తం రూ.18 వేల కోట్లకు పైగా రుణమాఫీ చేసినట్లు అవుతుంది. దీంతో రుణమాఫీలో కీలక ఘట్టం పూర్తవుతుంది. ఇక రూ.2 లక్షల కంటే ఎక్కువ అప్పులున్న రైతులు, రేషన్‌ కార్డులు లేని రైతు కుటుంబాలు, సాంకేతిక సమస్యలతో రుణమాఫీ పొందని అర్హులైన రైతులు మిగిలిపోతారు. వీరికి ఈ నెల 15 తర్వాత ప్రక్రియ ప్రారంభమవుతుంది.


  • 2లక్షల పైనున్న అప్పులు పంద్రాగస్టు తర్వాత

ఇప్పటికే మొదటి, రెండో విడతల్లో రుణమాఫీ పొందని అర్హులైన రైతుల నుంచి గ్రీవెన్సులు స్వీకరిస్తున్నారు. సాంకేతిక సమస్యలను పరిష్కరించే ప్రయత్నాలు చేస్తున్నారు. నిధుల కేటాయింపులు చేసిన నేపథ్యంలో.. సాంకేతిక సమస్యలు పరిష్కారమైతే రుణమాఫీ చేయాలని కూడా ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఇక రేషన్‌ కార్డులు లేకుండా, రుణమాఫీ పథకంలో అర్హత పొందిన రైతులు 6 లక్షలకు పైగా ఉన్నారు. పంద్రాగస్టు తర్వాత ఈ కేటగిరీలో ఉన్న రైతులపై ప్రభుత్వం దృష్టి పెట్టనుంది. ఇదిలా ఉండగా రూ.2 లక్షలకు మించి పంట రుణాలున్న రైతులకు కూడా రూ.2 లక్షల వరకు మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.


అయితే రూ.2 లక్షలకు పైనున్న మొత్తాన్ని రైతులు చెల్లిస్తే.. మిగిలిన రూ.2 లక్షలను మాఫీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ కేటగిరీలో ఉన్న రైతులు కూడా పంద్రాగస్టు తర్వాత నుంచే ముందుకొచ్చే అవకాశాలున్నాయి. అయితే రూ.2 లక్షలకు మించి ఉన్న రుణాల్లో రూ.2 లక్షల చొప్పున మాఫీ చేసేందుకు రూ.9 వేల కోట్లు అవసరమవుతాయని రాష్ట్ర ఆర్థిక శాఖ తొలుత అంచనా వేసింది. కానీ, పీఎం- కిసాన్‌ నిఽబంధనలను పరిగణనలోకి తీసుకొని రుణమాఫీ అమలు చేస్తుండటంతో.. రైతుల సంఖ్య, రుణమాఫీ బడ్జెట్‌ క్రమంగా తగ్గుతోంది. దీంతో నాలుగో విడతకు రూ.9 వేల కోట్ల కంటే తక్కువ నిధులే ఖర్చయ్యే అవకాశాలున్నాయి.


  • రూ.26 వేల కోట్లతోనే రుణమాఫీ పూర్తి!

రైతుల నుంచి వచ్చే అర్జీలు, తప్పొప్పుల సవరణల ద్వారా ప్రతి స్లాబ్‌లో మరో 4 లక్షల మంది రైతులు అదనంగా పెరిగే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ప్రతి స్లాబ్‌కు రూ.1,000 కోట్ల చొప్పున మరో రూ.4 వేల కోట్ల నిధులు అవసరమవుతాయని ఆర్థికశాఖ అంచనాలు వేసింది. ఇవన్నీ కలిపి 32.50 లక్షల మంది రైతులకు రూ.31 వేల కోట్ల నిధులు అవసరమవుతాయనే అంచనాతో రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించింది. కానీ, బడ్జెట్‌ (2024- 25)లో మాత్రం రూ.26 వేల కోట్ల కేటాయింపులు మాత్రమే చేసింది. అయితే పీఎం- కిసాన్‌ మార్గదర్శకాలు, సాంకేతిక సమస్యల కారణంగా లబ్ధిదారుల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో.. 26 వేల కోట్లతో రుణమాఫీ పథకం పూర్తికావొచ్చనే అభిప్రాయాలను అధికారులు వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Aug 15 , 2024 | 02:56 AM

Advertising
Advertising
<