Thimmapur: ‘భూదాన్’పై నజర్!
ABN, Publish Date - Oct 29 , 2024 | 04:17 AM
రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ భూదాన భూముల కుంభకోణంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. తక్షణమే విచారణ జరిపి, చర్యలు చేపట్టాలని సీఎం కార్యాలయం ఆదేశించింది.
తిమ్మాపూర్ భూ కుంభకోణంపై ప్రభుత్వం ఆరా
తక్షణమే చర్యలకు సీఎంవో ఆదేశం.. భూముల్ని పరిశీలించిన అధికారులు
ఆక్రమణ బాధ్యులపై క్రిమినల్ కేసులకు రంగం సిద్ధం
భూముల స్వాధీనం తర్వాత ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేసే ఆలోచన!
(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి): రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ భూదాన భూముల కుంభకోణంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. తక్షణమే విచారణ జరిపి, చర్యలు చేపట్టాలని సీఎం కార్యాలయం ఆదేశించింది. హైదరాబాద్ శివార్లలోని కందుకూరు మండలం తిమ్మాపూర్‌లో 200 కోట్ల విలువైన 40 ఎకరాల భూదాన భూములు అన్యాక్రాంతంపై సోమవారం ‘ఆంధ్రజ్యోతి’ కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో ఎన్నికలకు ముందు బడా నేతలు బినామీలను అడ్డుపెట్టుకుని భూదాన భూములను దొడ్డిదారిన పట్టా భూములుగా మార్చిన వైనంపై ‘నాయకుల భూదాహం.. అధికారుల భూదానం’ శీర్షికతో ప్రచురితమైన కథనం కలకలం రేపింది.
ఈ కథనంపై స్పందించిన సీఎంవో తక్షణమే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. ఆ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం చర్యలకు దిగింది. ఈ కుంభకోణం వెనక ఎవరు ఉన్నా వదిలిపెట్టొద్దని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ శశాంక్ ఆదేశాల మేరకు ఇన్‌చార్జి ఆర్డీవో అనంతరెడ్డి, తహసీల్దారు కె.గోపాల్, సీఐ సీతారామ్, రెవెన్యూ సర్వే అధికారులు సోమవారం ఉదయం ఈ భూములను పరిశీలించారు. గ్రామంలోని భూదాన భూములన్నింటినీ సర్వే చేయడం ప్రారంభించారు. సర్వే సమయంలో స్థానిక పోలీసుల సహకారం తీసుకున్నారు. తిమ్మాపూర్ భూముల పరిశీలన అనంతరం రెవెన్యూ, పోలీసు అధికారులు ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు.
గ్రామంలో మొత్తం భూదాన భూముల్లో ధరణికి ముందు ఎంత భూమి చేతులు మారింది? తర్వాత ఎంత మారింది? అనేదానిపై వివరాలు సేకరిస్తున్నారు. ఈ భూముల రికార్డులను ఎలా మార్చారనేదానిపైనా విచారణ చేపట్టారు. ఈ 40 ఎకరాలు కాకుండా మిగతా భూములకు సంబంధించిన రికార్డు కూడా మార్చే ప్రయత్నం ఏమైనా చేశారా? అని పరిశీలిస్తున్నారు. మరోవైపు తిమ్మాపూర్‌లోని భూదాన భూముల వివరాల పంపించాలంటూ రెవెన్యూ అధికారులు భూదాన బోర్డుకు లేఖ రాశారు.
ఇళ్ల స్థలాలకు కేటాయింపు?
అన్యాక్రాంతమైన ఈ 40 ఎకరాల భూములను తిరిగి స్వాధీనం చేసుకుని ఇందులో పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. సాధారణంగా అసైన్డ్, భూదాన భూములు అన్యాక్రాంతమైతే ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుని లబ్ధిదారులకే ఇవ్వాలని చట్టం చెబుతోంది. అయితే లబ్ధిదారులు ఉద్దేశపూర్వకంగా దీన్ని ఇతరులకు విక్రయిస్తే ప్రభుత్వం స్వాధీనం చేసుకుని.. వాటిని ఇతర పేదలకు పంపిణీ చేసే అవకాశం ఉంది. దీంతో తిమ్మాపూర్ భూముల్లో పేదలకు ఇళ్లపట్టాలు ఇవ్వాలని సర్కారు భావిస్తున్నట్లు సమాచారం.
అన్ని కోణాల్లో విచారించి కేసులు పెడతాం
తిమ్మాపూర్ భూదాన భూముల అన్యాక్రాంతంపై విచారణ చేపట్టాం. సర్వే నంబరు 6, 129, 130,147, 167, 197, 444, 453, 454, 455, 573, 574, 575ల్లోని భూదాన భూములన్నింటిపై సమగ్ర విచారణ జరుపుతున్నాం. దీనిపై పూర్తి నివేదికను ప్రభుత్వానికి పంపుతాం. అన్ని కోణాల్లో దీనిపై విచారణ జరిపి భూదాన భూముల అక్రమాలకు కారకులపై కేసు పెడతాం.
- కె.గోపాల్, తహసీల్దారు, కందుకూరు
Updated Date - Oct 29 , 2024 | 04:17 AM