CM Revanth Reddy: ఉద్యోగులకు రెండు డీఏలు!
ABN, Publish Date - Oct 25 , 2024 | 03:09 AM
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుక్రవారం తీపి కబురు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగుల డీఏ బకాయిలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో చర్చించి శుక్రవారం నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
భట్టితో చర్చించి చెబుతానన్న సీఎం రేవంత్
ఉద్యోగ ఐకాసతో ముఖ్యమంత్రి సుదీర్ఘ భేటీ
మార్చి దాకా ఆర్థిక అంశాలపై ఒత్తిడి తేవొద్దు
ఇతర సమస్యలపై భట్టి నేతృత్వంలో కమిటీ
దీపావళి తర్వాత కమిటీ సమావేశమవుతుంది
ఆర్థికేతర అంశాలన్నీ సానుకూలంగా చేస్తాం
జీవో 317పై క్యాబినెట్‌లో చర్చించి చెబుతాం
ధర్నాలు చేస్తే కేసులు, అరెస్టులు ఉండవు
ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం వ్యాఖ్యలు
13 ఏళ్ల తరువాత ఐకాసతో సీఎం భేటీ ఇదే
డిసెంబరు 9 నుంచి ఉద్యోగ ఆరోగ్య బీమా
నేడు సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్
ఒక్కొక్కరికి సగటున రూ.93,750 చెల్లింపు
హైదరాబాద్, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుక్రవారం తీపి కబురు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగుల డీఏ బకాయిలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో చర్చించి శుక్రవారం నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఉద్యోగులకు రావాల్సినవి ఐదు డీఏలు పెండింగులో ఉండగా, గరిష్ఠంగా రెండు డీఏలు ఇచ్చేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ఉద్యోగుల ఇతర సమస్యలను కూడా చర్చించి, తక్షణ పరిష్కారం చూపేందుకు భట్టి నేతృత్వంలో మరో ఉప సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఇందులో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు సభ్యులుగా, ప్రత్యేక ఆహ్వానితుడిగా ప్రభుత్వ సలహాదారు కేశవరావు ఉంటారని చెప్పారు. ఈ కమిటీ దీపావళి తరువాత ఉద్యోగులతో శాఖల వారీగా సమావేశం అవుతుందని, ఆర్థికేతర అంశాలను వెంటనే పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు.
గురువారం ఆయన, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి రెండు బృందాలుగా వచ్చిన ఉద్యోగ సంఘాల నేతలతో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో గురువారం సమావేశమయ్యారు. తొలి బృందంలో 45 మంది రాగా, రెండో బృందంలో 20 మంది వచ్చారు. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ప్రతిపాదించిన 50 డిమాండ్లపై ఆయా సంఘాల ప్రతినిధుల వాదనలు ఓపికగా విన్నారు. పదమూడేళ్ల తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రి సుదీర్ఘ సమయం ఉద్యోగ సంఘాల నేతలతో కూర్చొని చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ ఉద్యోగులు తీసుకొచ్చిన ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. ఉద్యోగుల్లో ప్రభుత్వం పట్ల విశ్వాసం పెంచేందుకే ఒకటో తేదీన వేతనాలు ఇస్తున్నామని ప్రస్తావించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఈ సమావేశం అందుకు తొలిమెట్టని చెప్పారు. ఐదు డీఏలు పెండింగులో ఉన్నాయని ఉద్యోగులు సీఎం దృష్టికి తెచ్చారు. నాలుగు ఇవ్వాలని కోరారు.
తక్షణం మూడైనా ఇవ్వాలని పట్టుబట్టారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందిస్తూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సరిగా లేదని, ఉద్యోగులు అర్థం చేసుకోవాలని కోరారు. ప్రతి నెలా రూ.22 వేల కోట్ల ఖర్చులు ఉంటే ప్రభుత్వ రాబడి రూ.18 వేల కోట్లే ఉందని ప్రస్తావించారు. ఆదాయం తగ్గిందని, రూ.4 వేల కోట్ల లోటు ఉందని ఆర్థిక పరమైన ఇబ్బందులను ఉద్యోగులకు వివరించారు. నెలవారీ వేతనాలకు రూ.6,800 కోట్లు, అప్పులకు వడ్డీలు చెల్లించేందుకు రూ.6,500 కోట్లు ఇవ్వాల్సి వస్తోందని గుర్తు చేశారు. కొత్తగా ఉద్యోగులు రావడం, జీఎ్‌సటీ, ఎక్సైజ్ ఆదాయం ఆశించిన మేర పెరగక పోవడం, రైతుల రుణ మాఫీ చెల్లింపులు, ఇంకా కొన్ని హామీలు అమలు చేయాల్సి ఉండటం వంటివి ఉద్యోగుల దృష్టికి తీసుకొచ్చారు. వచ్చే ఏడాది మార్చి వరకు ప్రభుత్వంపై ఒత్తిడి చేయకుండా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని ఉద్యోగులు చెబుతున్నారు.
ఐకాస 50 డిమాండ్లలో ఆర్థికేతర అంశాలన్నీ పరిశీలించి ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. 317 జీవోకి సంబంధించి కూడా నివేదిక అందిందని, దానిపై ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను తీసుకుంటామని చెప్పారు. మంత్రివర్గ ఉపసంఘం సీల్డ్ కవర్‌లో ఇచ్చిన నివేదిక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వద్ద ఉందని, ఉద్యోగులు కూడా ఆ నివేదికపై చర్చించి తమ అభిప్రాయాలు తెలపాలని కోరారు. 26న జరగనున్న మంత్రివర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సమావేశం ముగిసిన తర్వాత ఉద్యోగ సంఘాల నేతలు డీఏ ప్రకటన గురించి మరోసారి సీఎంను, భట్టిని అడిగారు. గరిష్ఠంగా రెండు డీఏల వరకు ప్రయత్నం చేయొచ్చని భట్టి సీఎంకు సూచించారు. రెండింటికైనా ప్రభుత్వం కట్టుబడాలని ఒకరిద్దరు నేతలు అన్నారు. అందుకు సీఎం, డిప్యూటీ సీఎం సుముఖంగానే కనిపించారని, శుక్రవారం ప్రకటనలో రెండు డీఏలు ఉంటాయని ఉద్యోగ సంఘాల నేతలు భావిస్తున్నారు.
సీఎంను నవ్వించిన టీచర్ల సంఘం నేత
ఉపాధ్యాయ సంఘానికి చెందిన ఓ నాయకుడు ఉద్యోగులకు రైతు బంధు పథకాన్ని ఆపకుండా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీంతో సీఎం ఒక్కసారిగా గట్టిగా నవ్వారు. ఆయనతోపాటు సమావేశంలో ఉన్న ఉద్యోగ సంఘాల నేతలంతా నవ్వడం ప్రారంభించారు. ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు మాట్లాడుతూ, ఉద్యోగులు ఎప్పుడూ వేతనాలు పెంచాలని, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తారే తప్ప ఒక్కసారి అయినా విద్యా వ్యవస్థ బలోపేతానికి, విద్యార్థులకు మెరుగైన బోధన అందించే అంశాల మీద ప్రభుత్వంతో చర్చించారా? అని చమత్కరించారు. దానికోసం ప్రభుత్వం ప్రత్యేక సమావేశం పెట్టాలని, తప్పకుండా వచ్చి తమవంతు పాత్ర పోషిస్తామని ఉద్యోగసంఘాల ప్రతినిధులు చెప్పారు.
కేసులు, అరెస్టులు ఉండవు
తమది ఉద్యోగుల అనుకూల ప్రభుత్వమని, డిమాండ్ల సాధనకోసం ఆందోళనలు చేసినా, ధర్నాలు చేపట్టినా ఎవరిని ఏమీ అనబోమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఏ ఉద్యోగి మీద కేసులు పెట్టేది లేదని, అరెస్టు చేసేది లేదని అన్నారు. తమ హక్కుల సాధన కోసం ఉద్యోగులు నిరసన తెలపడంలో తప్పు లేదని, వారి ప్రజాస్వామిక హక్కులకు భంగం కలిగించే విధంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిడి, ఇబ్బంది ఉండబోదని అన్నారు. తొలి బృందంలో ఐకాస ఛైర్మన్ మారెం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివా్‌సరావులు తమకు పోటీగా ఉన్న మరో ఐకాస నేత లచ్చిరెడ్డిపై సీఎం రేవంత్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆయన ఉద్యోగుల మధ్య గందరగోళం, విభేదాలు సృష్టించేలా ప్రకటనలు చేస్తున్నారన్నారు. గుర్తింపు లేని సంఘాలతో ఉద్యోగులను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. సీఎం తనకు బంధువని, తన మాట వింటే పెండింగ్‌లో ఉన్న 5 డీఏలతోపాటు అన్ని డిమాండ్లను వెంటనే పరిష్కరిస్తానని లచ్చిరెడ్డి చెబుతున్నారని రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు.
ఆయనతో తనకు ఎలాంటి బంధుత్వం లేదని, తన పేరు ఎవరైనా వాడుకుంటే వారి విషయం చూస్తానని రేవంత్ హామీ ఇచ్చారు. సాయంత్రం 7:30 గంటలకు రెండో ఐకాస చైర్మన్ వి.లచ్చిరెడ్డి బృందంతో సీఎం సమావేశమయ్యారు. రెండు బృందాల్లో సీఎంను కలిసిన వారిలో టీజీవో నాయకులు శ్యాం, సత్యనారాయణ, డిప్యూటీ కలెక్టర్ల సంఘం అధ్యక్షుడు చంద్రమోహన్, ట్రెసా అధ్యక్షుడు వంగా రవీందర్‌రెడ్డి, కార్యదర్శి గౌతమ్, పీఆర్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్‌రెడ్డి, ఇంటర్ ఐకాస ఛైర్మన్ మధుసూదన్‌రెడ్డి, యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి చావా రవి, సీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ తదితరులు పాల్గొన్నారు. సీపీఎస్ రద్దు, పాత పింఛను విధానం పునరుద్ధరణ అంశాలను స్థితప్రజ్ఞ సీఎం దృష్టికి తెచ్చారు. ఇతర కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు అమలు చేశాయని, దానివల్ల ఒక్క పైసా అదనపు భారం పడదని సీఎంకు వివరించారు. ఎన్నికల సమయంలో బదిలీ అయిన తహసీల్దార్లను తిరిగి సొంత జిల్లాలకు బదిలీ చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి అంగీకరించారని ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె. గౌతమ్ తెలిపారు. రెవెన్యూ ఉద్యోగుల మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి చేయాలని అడిగారు.
డిసెంబరు 9 నుంచి వైద్య ఆరోగ్య పథకం
ప్రభుత్వ ఉద్యోగుల వైద్య పథకాన్ని వచ్చే డిసెంబరు 9న ప్రారంభించడానికి ప్రభుత్వం అంగీకరించిందని వి.లచ్చిరెడ్డి తెలిపారు. 3.50 లక్షల ప్రభుత్వ ఉద్యోగులు, మరో 3.50 లక్షల పింఛనుదారులు, 2 లక్షల మంది పొరుగు సేవల ఉద్యోగులు మూలవేతనం నుంచి ప్రతి నెలా ఒక శాతాన్ని ఈహెచ్‌ఎ్‌స పథకానికి జమ చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన సీఎంతో భేటీ సందర్భంగా చెప్పారు. సీపీఎస్ మీద చర్చించడానికి భట్టితో కమిటీ వేస్తామని సీఎం చెప్పారన్నారు.
Updated Date - Oct 25 , 2024 | 03:09 AM