Warangal: ఓరుగల్లుకు నిధుల వరద..
ABN, Publish Date - Nov 19 , 2024 | 01:59 AM
రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరంగా ఉన్న వరంగల్ అభివృద్ధిపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. వరంగల్ నగరంలో వివిధ అభివృద్ధి పనుల కోసం గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ.4962.47 కోట్లు మంజూరు చేసింది.
రూ.4962 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం
అధికంగా భూగర్భ డ్రైనేజీకి రూ.4,170 కోట్లు
విమానాశ్రయ భూసేకరణకు రూ. 205 కోట్లు
కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కుకు 161 కోట్లు
నేడు వరంగల్ పర్యటనకు సీఎం రేవంత్‌రెడ్డి
ప్రజా పాలన విజయోత్సవ సభకు హాజరు
కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభించనున్న సీఎం
22 జిల్లాల మహిళా భవనాలకు శంకుస్థాపన
ఎంజీఎంలో ట్రాన్స్‌జెండర్ క్లినిక్ ప్రారంభం
మహిళల రుణాల చెక్కుల పంపిణీకి శ్రీకారం
హైదరాబాద్‌కు దీటుగా వరంగల్: శ్రీధర్‌బాబు
హైదరాబాద్/వరంగల్/హనుమకొండ, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రెండో పెద్ద నగరంగా ఉన్న వరంగల్ అభివృద్ధిపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. వరంగల్ నగరంలో వివిధ అభివృద్ధి పనుల కోసం గతంలో ఎన్నడూ లేనివిధంగా రూ.4962.47 కోట్లు మంజూరు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొన్ని పనులకు పరిపాలన అనుమతులు కూడా మంజూరు చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవ సభలు నిర్వహిస్తోంది. 20 రోజులపాటు నిర్వహించనున్న ఈ సభల ద్వారా ఏడాది కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేరుస్తున్న తీరు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, కార్యక్రమాల ప్రగతిని వివరించనుంది. ఈ విజయోత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సెంటిమెంట్ ప్రకారం వరంగల్ ఆర్ట్స్ కాలేజీ మైదానాన్ని తొలి వేదికగా ఎంచుకున్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా రైతు డిక్లరేషన్ సభ నిర్వహించిన హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ మైదానంలోనే మంగళవారం ప్రజాపాలన విజయోత్సవ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభకు సీఎం రేవంత్‌రెడ్డి హాజరవుతున్న నేపథ్యంలో.. వరంగల్ అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ వివరాలను మంగళవారం పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించనున్నారు.
నెరవేరనున్న 30 ఏళ్ల కల..
వరంగల్ అభివృద్ధికి ప్రభుత్వం మంజూరు చేసిన నిధుల్లో అత్యధికంగా వరంగల్ భూగర్భ డ్రైనేజీకి రూ.4,170 కోట్లు కేటాయించింది. దీంతో వరంగల్ నగర ప్రజల 30 ఏళ్ల కలను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సాకారం చే యనుంది. జూన్ 29న సీఎం రేవంత్‌రెడ్డి హనుమకొండలో పర్యటించి, కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో భూగర్భ డ్రైనేజీ కోసం ప్రతిపాదనలు తయారు పంపించాలని నగర కమిషనర్‌ను ఆదేశించారు. ఆ తర్వాత అధికారుల నుంచి వచ్చిన ప్రతిపాదనల మేరకు ఈ మొత్తాన్ని కేటాయించారు. ఈ నిధులను నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో పాటు ముంపు ప్రాంతాలకు నష్టం జరగకుండా కాలువల అభివృద్ధి, తాగునీటి సరఫరాను మెరుగు పరచడం, నీటి వనరులకు పునరుజ్జీవం కల్పించడం, జలాశయాల నిర్వహణ ప్రణాళికకు బ్లూ, గ్రీన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రూపకల్పనతో పాటుగా విద్యుత్తు, టెలిఫోన్, కేబుల్, ఇంటర్నెట్ తదితర సేవలకు ఆటంకం కలగకుండా భూగర్భ డ్రైనేజీ పనులు చేపట్టడం కోసం వినియోగించనున్నారు. తొలి విడతలో రూ.3,087 కోట్లు, రెండో విడతలో రూ.597కోట్లు, మూడో విడతలో రూ.486 కోట్లు విడుదల చేస్తారు. ఈ మేరకు పనులను మూడు విడతల్లో పూర్తి చేయనున్నట్లు ప్రభుత్వం జీవోలో వెల్లడించింది. దీంతోపాటు మామునూరు ఎయిర్‌పోర్ట్ అభివృద్ధికి భూసేకరణకూ నిధులు మంజూరు చేసింది. మొత్తం 949 ఎకరాల్లో విమానాశ్రయాన్ని అందుబాటులోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 669 ఎకరాలు ఉండగా.. అదనంగా మరో 280 ఎకరాలను సేకరించనుంది. ఇందుకోసం రూ.205 కోట్లు కేటాయించింది.
మెగా టెక్స్‌టైల్ పార్క్‌కు నిధులు..
ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ సంస్థలు పరిశ్రమలు నెలకొల్పిన కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ అభివృద్ధికీ ప్రభుత్వం రూ.194 కోట్లు కేటాయించింది. టెక్స్‌టైల్ పార్క్‌కు భూములు ఇచ్చిన 863 మంది రైతులకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వనున్నారు. ఇందుకోసం రూ.43.15 కోట్లు కేటాయించారు. దీంతోపాటు మెగా టెక్స్‌టైల్ టౌన్‌షి్‌పలో నూతనంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చోంగ్తు సోమవారం జీవో జారీ చేశారు. ఇక హనుమకొండలో ఏర్పాటుచేసిన కాళోజీ కళాక్షేత్రానికి అదనంగా మరో రూ.85 కోట్లు మంజూరు చేశారు. అలాగే పరకాల నుంచి ఎర్రగట్టు గుట్ట వరకు రోడ్డు విస్తరణ చేపట్టేందుకు రూ.65 కోట్లు, కరీంనగర్-హన్మకొండ ప్రధాన రహదారిపై నయీంనగర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.8.3 కోట్లు మంజూరు చేశారు. ఇవే కాకుండా.. వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ భవనానికి రూ.32.50 కోట్లు, ఇన్నర్ రింగు రోడ్డుకు రూ.80 కోట్లు, పాలిటెక్నిక్ కాలేజీ కొత్త భవన నిర్మాణానికి రూ.28 కోట్లు, గ్రేటర్ వరంగల్ మునిసిపాలిటీ పరిధిలో రోడ్ల నిర్మాణాలకు 49.50 కోట్లు వరంగల్ ఉర్దూ భవన్, షాదీ ఖానాలకు 1.50 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది.
సీఎం పర్యటన సాగుతుందిలా..
వరంగల్ పర్యటనలోభాగంగా సీఎం రేవంత్ మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు హయగ్రీవచారి గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకోనున్నారు. 3గంటలకు ప్రజాకవి కాళోజీ నారాయణరావు పేరిట రూ.92 కోట్ల వ్యయంతో నిర్మించిన కాళోజీ కళాక్షేత్రాన్ని ప్రారంభిస్తారు. కవులు, కళాకారులతో ముచ్చటిస్తారు. మధ్యాహ్నం 3.10 గంటలకు అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి మ.3.20కి ఆర్ట్స్ కాలేజీకి చేరుకుంటారు. మధ్యాహ్నం 3.50 గంటల వరకు ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి స్టాళ్లను పరిశీలించి, ఎస్‌హెచ్‌జీ, ఎంఎస్, జడ్‌ఎస్ మహిళా గ్రూపు సభ్యులతో మాట్లాడనున్నారు. మధ్యాహ్నం 3.55 గంటలకు విజయోత్సవ సభ వేదికపైకి చేరుకుంటారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో నిర్మించనున్న 22 మహిళా శక్తి భవనాలకు వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రంలో పది జిల్లాలో ఇప్పటికే ఈ భవనాలు ఉండగా, మిగిలిన జిల్లాల్లో కొత్తగా నిర్మించనున్నారు. ఎంజీఎంలో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌జెండర్ క్లినిక్‌నూ ముఖ్యమంత్రి వర్చువల్‌గా ప్రారంభిస్తారు. మహిళలకు బ్యాంకు లింకేజీ చెక్కులను పంపిణీ చేస్తారు., అనంతరం విజయోత్సవ సభలో ప్రసంగిస్తారు. సాయంత్రం 5గంటలకు హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమవుతారు.
హైదరాబాద్‌కు దీటుగా వరంగల్ అభివృద్ధి: శ్రీధర్‌బాబు
హనుమకొండ సిటీ/వడ్డెపల్లి, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): వరంగల్ నగరాన్ని హైదరాబాద్‌కు దీటుగా అభివృద్ధి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి డి.శ్రీధర్‌బాబు అన్నారు. ఎన్నికల సమయంలో వరంగల్ అభివృద్ధికి ఇచ్చిన హామీలను ఏడాదిలోనే నెరవేరుస్తున్నామని తెలిపారు. హనుమకొండలో మంగళవారం నిర్వహించనున్న విజయోత్సవ సభ ఏర్పాట్లను మంత్రి కొండా సురేఖ, పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డితో కలిసి మంత్రి శ్రీధర్‌బాబు పరిశీలించారు. అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదని, పదేళ్ల బీఆర్‌ఎస్ పాలన నిర్లక్ష్యం, స్వార్థపూరిత పాలనే ఇందుకు కారణమని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సమస్యల పరిష్కారం సవాలుగా మారిందని, అయినా భయపడకుండా ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటనూ నిలబెట్టుకుంటున్నామని తెలిపారు.
Updated Date - Nov 19 , 2024 | 01:59 AM