High Court: ఒకే నేరంపై అనేక ఎఫ్‌ఐఆర్‌లు ఎందుకు?
ABN, Publish Date - Nov 26 , 2024 | 04:22 AM
ఒకే నేరానికి సంబంధించి అనేక ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం ఎందుకు? అని హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది.
పట్నం నరేందర్‌రెడ్డి కేసులపై హైకోర్టు
వేర్వేరు చోట్ల జరిగిన నేరాలు, ఫిర్యాదులన్న ఏఏజీ
3 కేసులపై పట్నం పిటిషన్.. తీర్పు రిజర్వు
హైదరాబాద్/వికారాబాద్, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఒకే నేరానికి సంబంధించి అనేక ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడం ఎందుకు? అని హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది. వికారాబాద్ జిల్లా లగచర్లలో భూసేకరణ విచారణకు వచ్చిన కలెక్టర్, ఇతర అధికారులపై జరిగిన దాడి ఘటనపై పోలీసులు అదనంగా మరో రెండు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ ఈ కేసులో ఏ-1గా ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ కె.లక్ష్మణ్ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది టీవీ రమణారావు వాదిస్తూ.. ఒకే నేరానికి సంబంధించి అనేక ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడాన్ని తప్పుపడుతూ సుప్రీంకోర్టు, ఈ హైకోర్టు పలు తీర్పులు ఇచ్చాయని తెలిపారు. పిటిషనర్ సహా ఇతర నిందితులను ఇబ్బంది పెట్టడానికి ఇలా చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ రజినీకాంత్‌రెడ్డి వాదిస్తూ.. లగచర్ల గ్రామంలోనే వేర్వేరు చోట్ల జరిగిన నేరాలని, ఫిర్యాదుదారులు, బాధిత అధికారులు సైతం వేర్వేరని తెలిపారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. మూడు ఫిర్యాదులను పరిశీలించింది. మూడు ఫిర్యాదులు వేర్వేరు వ్యక్తులు ఇచ్చినప్పటికీ పోలీ్‌సస్టేషన్‌లో ఉన్న రైటర్.. ఫిర్యాదుదారుల పేర్లు మార్చి ఒక్కటే ఫిర్యాదును మూడింటికీ కాపీ చేశారని పేర్కొంది. ప్రభుత్వ అధికారులైన ఫిర్యాదుదారులు తమ ఫిర్యాదు తాము కూడా రాసుకోలేరా? అని ప్రశ్నించింది. ఈ మేరకు తీర్పు రిజర్వు చేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు లగచర్ల ఘటనకు ముందు దుద్యాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిపై దాడి ఘటనలో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పట్నం నరేందర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సదరు ఎఫ్‌ఐఆర్‌లో నరేందర్‌రెడ్డి నిందితుడిగా లేకపోయినప్పటికీ.. ముందస్తు బెయిల్ కోరారు.
బెయిల్, కస్టడీపై తీర్పు వాయిదా
పట్నం నరేందర్‌రెడ్డి బెయిల్, కస్టడీ పిటిషన్లపై తీర్పు ప్రకటన మరోసారి వాయిదా పడింది. లగచర్ల ఘటనకు ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న నరేందర్‌రెడ్డిని తమ కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు కొడంగల్ జే ఎఫ్‌ఎంసీలో పిటిషన్ దాఖలు చేయగా, కోర్టు తీర్పు రిజర్వు చేసిన విషయం తెలిసిందే. సోమవారం మరోసారి ఈ పిటిషన్ కోర్టు ముందుకు రాగా, తీర్పును డిసెంబరు 2కు వాయిదా వేసింది. ఇదిలా ఉంటే.. వికారాబాద్ ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి కోర్టులో పట్నం నరేందర్‌రెడ్డి తరపున దాఖలు చేసిన బెయిల్ పిటిషన్.. జడ్జి సెలవులో ఉన్న కారణంగా అదనపు జిల్లా జడ్జి కోర్టులో విచారణకు రాగా, ఈనెల 27వ తేదీకి వాయిదా వేశారు.
స్వతంత్ర కమిషనర్‌ను నియమించండి
హైదరాబాద్, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): వికలాంగుల హక్కుల చట్టంలోని సెక్షన్ 79 (1)లో పేర్కొన్న విధంగా స్వతంత్ర రాష్ట్ర కమిషనర్‌ను నియమించాలని పేర్కొంటూ ఆలిండియా కాన్ఫెడరేషన్ ఆఫ్ ది బ్లైండ్ (ఏఐసీబీ), డెవల్‌పమెంట్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ బ్లైండ్ (డీడబ్ల్యూఏబీ) సంస్థలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ చేపట్టి న జస్టిస్ సూరేపల్లి నంద ధర్మాసనం.. ఈ అంశంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. విచారణ డిసెంబరు 2కు వాయిదా పడింది.
Updated Date - Nov 26 , 2024 | 04:22 AM