Uttam: సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు
ABN, Publish Date - Dec 17 , 2024 | 04:07 AM
కులగణన సర్వే నివేదిక ఆధారంగా సంక్రాంతి తర్వాత రేషన్ కార్డులు జారీ ప్రక్రియను ప్రారంభించనున్నట్టు మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి సోమవారం వెల్లడించారు. రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల రేషన్‌కార్డులు జారీచేయడం ద్వారా 31లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం అంచనా వేసినట్టు ఆయన పేర్కొన్నారు.
కులగణన ఆధారంగా అర్హుల గుర్తింపు: మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): కులగణన సర్వే నివేదిక ఆధారంగా సంక్రాంతి తర్వాత రేషన్ కార్డులు జారీ ప్రక్రియను ప్రారంభించనున్నట్టు మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి సోమవారం వెల్లడించారు. రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల రేషన్‌కార్డులు జారీచేయడం ద్వారా 31లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని ప్రభుత్వం అంచనా వేసినట్టు ఆయన పేర్కొన్నారు. కొత్త కార్డులతో ప్రభుత్వంపై రూ.956కోట్లకు పైగా అదనపు భారం పడుతుందన్నారు. దీంతో పాటు, ప్రస్తుత రేషన్‌కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డులను ప్రవేశపెట్టనున్నట్లు ఆయన తెలిపారు. సోమవారం శాసనమండలిలో ఎమ్మెల్సీ కోదండరాం తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి ఉత్తమ్ సమాధానం చెబుతూ.. ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో పేర్లు నమోదు కోసం సుమారు 18లక్షల దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయన్నారు.
కాగా, సంక్రాంతి నుంచే రేషన్ ద్వారా సన్నబియ్యం అందించనున్నట్టు ఉత్తమ్ పేర్కొన్నారు. చౌక ధరల దుకాణాల ద్వారా ఇతర నిత్యావసర వస్తువుల పంపిణీ ఆలోచనలేదని స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడక ముందు ఉమ్మడి ఏపీలో తెలంగాణ ప్రాంతంలో 91,68,231 కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు ఉండగా, ఏపీ వారు తమ ప్రాంతాలకు వెళ్లిపోవడంతో 2,46,324 కార్డులు రద్దు అయినట్లు ఉత్తమ్ వివరించారు. అలాగే, 2016 నుండి 2023 వరకు 19లక్షల మంది లబ్ధిదారులను అనర్హులుగా గుర్తించి 5,98,000 ఆహార భద్రత కార్డులను తొలగించినట్టు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 89.95 లక్షల తెల్ల రేషన్ కార్డులతో 2.81 కోట్ల మంది లబ్ధి పొందుతున్నారని ఉత్తమ్ వివరించారు.
Updated Date - Dec 17 , 2024 | 04:07 AM