DISCOMs: పరిశ్రమలు తరలిపోతాయి..
ABN, Publish Date - Oct 24 , 2024 | 03:32 AM
హెచ్‌టీ కేటగిరిలోని 33కేవీ, 133కేవీ విద్యుత్ చార్జీలను 11కేవీతో సమానంగా పెంచాలని, కొత్తగా స్టాండ్‌బై, గ్రిడ్ సపోర్ట్, అన్‌బ్లాకింగ్ చార్జీలు విధించాలని డిస్కమ్‌లు చేసిన ప్రతిపాదనలపై ‘ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆ్‌ఫ్ కామర్స్ (ఫ్యాప్సీ)’ తీవ్ర అభ్యంతరం తెలిపింది.
హెచ్‌టీ విద్యుత్ చార్జీల పెంపు.. ప్రతిపాదనపై ఫ్యాప్సీ అభ్యంతరం
గతంలో అడ్డగోలుగా ఒప్పందాలు
ఇక పునరుత్పాదక విద్యుత్ ఎందుకు?
ఈఆర్సీ విచారణలో నిపుణులు ప్రశ్న
28న ఈఆర్‌సీ కొత్త టారిఫ్ ఆర్డర్
పేదలు, మధ్య తరగతిపై భారం వేయం: దక్షిణ డిస్కం సీఎండీ
హైదరాబాద్ సిటీ, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): హెచ్‌టీ కేటగిరిలోని 33కేవీ, 133కేవీ విద్యుత్ చార్జీలను 11కేవీతో సమానంగా పెంచాలని, కొత్తగా స్టాండ్‌బై, గ్రిడ్ సపోర్ట్, అన్‌బ్లాకింగ్ చార్జీలు విధించాలని డిస్కమ్‌లు చేసిన ప్రతిపాదనలపై ‘ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్స్ ఆ్‌ఫ్ కామర్స్ (ఫ్యాప్సీ)’ తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఇలాగైతే పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతాయని ఆందోళన వ్యక్తం చేసింది. 2024-25లో రూ.1,221 కోట్ల విద్యుత్ చార్జీల పెంపును ప్రతిపాదిస్తూ ఉత్తర/దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు సమర్పించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదిక (ఏఆర్‌ఆర్)పై బుధవారం విద్యుత్ భవన్‌లో రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) నిర్వహించిన బహిరంగ విచారణలో పెద్ద సంఖ్యలో వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొని మాట్లాడారు.
ఈఆర్‌సీ చైర్మన్ టీ శ్రీరంగారావు, సభ్యులు ఎండీ మనోహర్ రాజు, బండారు కృష్ణయ్య నిర్వహించిన బహిరంగ విచారణలో తొలుత దక్షిణ డిస్కమ్ సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ తమ ప్రతిపాదనలను వివరించారు. ఈ నెల 28న ఈఆర్‌సీ కొత్త టారిఫ్ ఆర్డర్ ఇవ్వనుంది. దాంతో పెరిగిన ఛార్జీలు నవంబరు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అశాస్త్రీయ, అవాస్తవిక అంచనాల ఆధారంగా గతంలో అడ్డగోలుగా చేసుకున్న కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)తోనే వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో పెద్ద మొత్తంలో మిగులు విద్యుత్ ఉండబోతోందని నిపుణులు, పారిశ్రామిక, వాణిజ్య సంఘాల ప్రతినిధులు స్పష్టం చేశారు. ఈ పరిస్థితిల్లో వచ్చే ఐదేళ్లలో కొత్తగా 20 వేల మెగావాట్ల పునరుత్పాద విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనక ఔచిత్యం ఏమిటని ప్రశ్నించారు.
ఫ్యాప్సీ ప్రతినిధి రమణ్‌దీప్ సింగ్, తెలంగాణ ఐరన్, స్టీల్ తయారీదారుల సంఘం ప్రతినిధి వినోద్ అగర్వాల్, ఏపీ, తెలంగాణ ప్లాస్టిక్ తయారీదారుల సంఘం ప్రతినిధి శంకర్ డిస్కమ్‌ల ప్రతిపాదనలను వ్యతిరేకించారు. అడ్డగోలు విధానాలే విద్యుత్ సంస్థల ఆర్థిక సంక్షోభానికి కారణమన్నారు. గత ప్రభుత్వం మూడు పర్యాయాలు విద్యుత్ చార్జీలు పెంచిందని, చివరిసారిగా 2022-23లో ఒకేసారి ఏకంగా రూ.5,596 కోట్ల చార్జీలు పెంచిందన్నారు. రూ.1221 కోట్ల విద్యుత్ చార్జీల పెంపును మాత్రమే ప్రతిపాదించినట్టు ప్రస్తుత ప్రభుత్వం చెప్పుకోవడం ప్రజలను మభ్యపెట్టడమేనన్నారు, 2024-25లో ఇంకా 5 నెలలే మిగిలి ఉన్నాయని, దాంతో ఏటా రూ.3వేల కోట్లకు పైనే చార్జీలు పెరుగుతాయన్నారు. కొత్త విద్యుత్ కనెక్షన్లకు లైన్ చార్జీల వసూలుకు ప్రతిపాదించడం నిబంధనలకు విరుద్ధమన్నారు. దక్షిణ డిస్కం ప్రతిపాదనలు ఒప్పుకుంటే సామాన్యులకు తీవ్ర నష్టం జరుగుతుందని శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూధనాచారి అన్నారు.
పేదలు, మధ్య తరగతిపై భారం వేయం: సీఎండీ
పేద, మధ్యతరగతి ప్రజలపై ఎలాంటి భారం వేయట్లేదని, వారి విద్యుత్ చార్జీలపై ఎలాంటి పెంపు ఉండదని దక్షిణ డిస్కం సీఎండీ ముషారఫ్ ఫరూఖీతెలిపారు. ఇళ్లకు నెలకు 300 యూనిట్లకుపైగా వినియోగించేవారి ఫిక్స్‌డ్ చార్జీలపై స్వల్ప పెంపు ప్రతిపాదించినట్లు చెప్పారు. విద్యుత్ సరఫరా, మరమ్మతుల్లో పారదర్శకత కోసం టీజీఎయిమ్స్ యాప్‌ను తీసుకొస్తున్నామన్నారు. ఎలక్ట్రికల్ వెహికల్ ఛార్జింగ్ స్టేషన్లకు (ఎల్‌టీ-ఈవీ) ఫిక్స్‌డ్ చార్జీల నుంచి మినహాయింపు ఇస్తున్నామన్నారు.
ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతులకు రైతుల కష్టాలు
వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతులకు రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని భారతీయ కిసాన్ సంఘ్ నేత డీ రాము తెలిపారు. క్షేత్రస్థాయి సిబ్బంది రాకపోవడంతో రైతులే మరమ్మతులకు ప్రయత్నించి విద్యుదాఘాతంతో మరణిస్తున్నారన్నారు. పాడి పరిశ్రమకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని యాదవ్ మహాసభ జాతీయ కార్యదర్శి రమేశ్ యాదవ్ కోరారు.
Updated Date - Oct 24 , 2024 | 03:32 AM