ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Teacher Posts: స్పోర్ట్స్‌ కోటాలోనూ బోగస్‌లు

ABN, Publish Date - Nov 14 , 2024 | 04:45 AM

టీచర్‌ పోస్టుల భర్తీలో పొరపాట్లు జరిగినట్లు గుర్తించిన తెలంగాణ విద్యా శాఖ డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా కింద ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాలను పునఃపరిశీలించాలని నిర్ణయించింది.

  • టీచర్‌ పోస్టుల భర్తీలో లొసుగుల పరంపర

  • దిద్దుబాటుకు విద్యాశాఖ చర్యలు.. 20 నుంచి ధ్రువపత్రాల పునఃపరిశీలన

  • అనర్హులని తేలితే ఉద్యోగాల తొలగింపు.. తెలంగాణ విద్యా శాఖ కీలక నిర్ణయం

హైదరాబాద్‌, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): టీచర్‌ పోస్టుల భర్తీలో పొరపాట్లు జరిగినట్లు గుర్తించిన తెలంగాణ విద్యా శాఖ డీఎస్సీ స్పోర్ట్స్‌ కోటా కింద ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాలను పునఃపరిశీలించాలని నిర్ణయించింది. ఈ నెల 20 నుంచి ఈ ప్రక్రియను నిర్వహించాలంటూ తాజాగా సర్క్యులర్‌ను జారీ చేసింది. ఈ మేరకు స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులతో పాటు, ఇదే కోటాలో ఉద్యోగాలకు ఎంపికవని అభ్యర్థులకు కూడా ధ్రువపత్రాల పునఃపరిశీలన చేయనున్నారు. ఫోన్ల ద్వారా అభ్యర్థులకు సమాచారాన్ని అందించారు. రాష్ట్రంలో 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నోటిఫికేషన్‌ను జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 10,006 పోస్టులను భర్తీ చేశారు. గత నెల 9న ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ఈ నియామక పత్రాలను అందజేశారు. డీఎస్సీ పరీక్ష నిర్వహించి, ఈ ఎంపిక ప్రక్రియను పూర్తి చేశారు. అయితే, ఈ ఎంపికలో కొన్ని పొరపాట్లు దొర్లినట్లు గుర్తించారు. ముఖ్యంగా పున:పరిశీలనలో ఈ తప్పులు దొర్లాయని, తద్వారా అర్హులు కానీ వారు కొందరు ఉద్యోగాలకు ఎంపికైనట్లు అంచనా వేస్తున్నారు.


ఇప్పటికే ఖమ్మం జిల్లాలో ఇలాంటి ఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఆ జిల్లాలో పండిట్స్‌ పోస్టులకు ఎంపికైన వారిలో కొందరిని అనర్హులుగా గుర్తించారు. వీరిని ఉద్యోగాల నుంచి తొలగించారు. ఇందుకు బాధ్యులుగా ప్రధానోపాధ్యాయులను సస్పెండ్‌ చేశారు. అయితే, తాజాగా స్పోర్ట్స్‌ కోటాలో టీచర్‌ పోస్టులకు ఎంపికైన వారిలో కూడా కొందరు బోగస్‌ అభ్యర్థులున్నట్టు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. దాంతో ఈ కోటా కింద ఎంపికైన అభ్యర్థులతో పాటు, ఎంపిక కానీ స్పోర్ట్స్‌ కోటా అభ్యర్థుల సర్టిఫికెట్లను పున:పరిశీలించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈ నెల 20 నుంచి 22వ తేదీల మధ్య దోమల్‌గూడలోని ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కాలేజీలో ఈ ధ్రువపత్రాల పున:పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందు కోసం మొత్తం 393 మంది అభ్యర్థులకు సమాచారం అందించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో మొత్తం సుమారు 100 ఉపాధ్యాయ పోస్టుల వరకు స్పోర్ట్స్‌ కోటా కోసం రిజర్వ్‌ చేశారు. అయితే, ఈ కోటాలో సుమారు 32 మంది అభ్యర్థులు టీచర్‌ పోస్టుల కోసం ఎంపికైనట్టు సమాచారం. సరైన సంఖ్యలో అభ్యర్థులు లేకపోవడంతో...ఈ కోటాలోని మిగిలిన పోస్టులను నాన్‌-స్పోర్ట్స్‌ కోటాలో భర్తీ చేశారు. అయితే... ఈ భర్తీ ప్రక్రియ ముగిసిన తర్వాత ఎంపిక కానీ అభ్యర్థుల నుంచి అనేక ఫిర్యాదులు వచ్చాయి. తమ సర్టిఫికెట్లు నిజమైనవే అయినప్పటికీ, అధికారులు వాటిని పరిగణలోకి తీసుకోలేదని, దాంతో తమకు ఉద్యోగ అవకాశం రాలేదనే ఫిర్యాదులు వచ్చాయి. దాంతో పాటు ఈ కోటాలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్లపై కూడా పెద్ద స్థాయిలో ఫిర్యాదులు నమోదయ్యాయి. దాంతో ఈ వ్యవహారాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలని అధికారులు నిర్ణయించారు. అందులో భాగంగా స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులతో పాటు, ఎంపిక కానీ స్పోర్ట్స్‌ కోటా అభ్యర్థులకు సంబంధించిన సర్టిఫికెట్లను మరోసారి పరిశీలించాలని షెడ్యూల్‌ను జారీ చేశారు.


  • అనర్హులుగా తేలితే ఉద్యోగాల తొలగింపు

ఇప్పటికే స్పోర్ట్స్‌ కోటాలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు సంబంధించి తాజాగా నిర్వహించే ఈ సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌లో అనర్హులుగా తేలితే... వారి ఉద్యోగాలను తొలగించే అవకాశం ఉంది. అలాగే... ఇప్పటి వరకు ఉద్యోగాలకు ఎంపిక కానీ వారు.... ఈ సారి నిర్వహించే సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌లో అర్హులుగా స్పష్టమైతే... వారికి ఉద్యోగాలను ఇచ్చే విషయాన్ని పరిశీలించే అవకాశం ఉంది. అయితే.... ఈ విషయంలో సాంకేతిక సమస్య తలెత్తే అవకాశం ఉంది. ఇప్పటికే స్పోర్ట్స్‌ కోటాలోని పోస్టుల మొత్తాన్ని భర్తీ చేశారు. కొత్తగా అర్హులను గుర్తిస్తే... వారికి ఉద్యోగం ఇవ్వడానికి ఖాళీ పోస్టులు ఉండవు. దాంతో ఈ విషయంలో ప్రభుత్వ స్థాయిలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఒక అధికారి అభిప్రాయ పడ్డారు. కాగా, హైదరాబాద్‌ జిల్లాలో టీచర్‌ పోస్టులకు ఎంపికైన వారిలో సుమారు 20 మందిని విత్‌హోల్డ్‌ చేశారు. ఈ అభ్యర్థులు సమర్పించిన బోనఫైడ్‌ సర్టిఫికెట్లపై ఫిర్యాదులు వచ్చాయి. ముఖ్యంగా వీరు సమర్పించిన 1 నుంచి 7వ తరగతి బోనఫైడ్‌ సర్టిఫికెట్లు బోగ్‌సవి అని ప్రాథమికంగా గుర్తించారు. దాంతో ఈ అభ్యర్థుల ఉద్యోగాలను రద్దు చేసే అవకాశం కనిపిస్తున్నది. దీనిపై త్వరలోనే అధికారులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Updated Date - Nov 14 , 2024 | 04:45 AM