RRR: ఆర్‌ఆర్‌ఆర్ డీపీఆర్‌కు గడువు పెంపు!
ABN, Publish Date - Dec 17 , 2024 | 03:13 AM
రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) దక్షిణ భాగం రహదారికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదికను అందించే కన్సల్టెన్సీ సంస్థ ఎంపిక కోసం ఆహ్వానించిన టెండర్లకు రాష్ట్ర ప్రభుత్వం గడువు పెంచింది.
దక్షిణ భాగం కన్సల్టెన్సీ ఎంపిక టెండర్ల
గడువు ఈ నెల 27 వరకు పొడిగింపు
అదే రోజు తెరుచుకోనున్న బిడ్లు
నోటిఫికేషన్‌లో మార్పులుచేర్పుల వల్లే..
హైదరాబాద్, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) దక్షిణ భాగం రహదారికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదికను అందించే కన్సల్టెన్సీ సంస్థ ఎంపిక కోసం ఆహ్వానించిన టెండర్లకు రాష్ట్ర ప్రభుత్వం గడువు పెంచింది. సోమవారంతోనే గడువు ముగియగా.. దాన్ని ఈ నెల 27 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. టెండర్ల ప్రక్రియను ప్రభుత్వం నవంబరు 25న ప్రారంభించింది. డిసెంబరు 16ను టెండర్లకు చివరి తేదీగా ప్రకటించింది. అయితే టెండర్ల ప్రక్రియలో పాల్గొనే పలు సంస్థలు నోటిఫికేషన్‌లో కొన్ని మార్పులుచేర్పులు చేయాల్సి ఉందని సూచించినట్లు సమాచారం.
సంస్థల సూచనల మేరకు మార్పులు చేయడంతో పాటు టెండర్ల దాఖలుకు గడువును పెంచుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. టెండర్ దాఖలుకు గడువు పెంచడంతో ఈ నెల 27న బిడ్లు తెరవనున్నారు. కాగా, సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను ఖరారు చేసేందుకు కన్సల్టెన్సీ సంస్థ ఎంపిక కోసం ప్రభుత్వం ‘ఇంటర్నేషనల్ కాంపిటీటివ్ బిడ్డింగ్’ విధానంలో టెండర్లు ఆహ్వానించింది. రహదారి మార్గం నుంచి రోడ్డు నిర్మాణ విధానం సహా పలు అంశాలన్నీ డీపీఆర్‌లో తేలనున్నాయి.
Updated Date - Dec 17 , 2024 | 03:13 AM