Salary Hike: ఉద్యోగులకు దీపావళి కానుక
ABN, Publish Date - Oct 31 , 2024 | 05:02 AM
రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. దీపావళి కానుకగా.. ఒక కరువు భత్యాన్ని/ కరువు సహాయాన్ని (డీఏ/డీఆర్) ప్రకటించింది.
ఒక కరువు భత్యం విడుదల చేసిన సర్కారు.. 1.7.2022 నాటి డీఏ/డీఆర్ 3.64ు మంజూరు
22.75% నుంచి 26.39%కు పెరిగిన కరువు భత్యం
నవంబరు వేతనంతో కలిపి డిసెంబరు నుంచి చెల్లింపు
28 నెలల డీఏ బకాయిలు జీపీఎఫ్ ఖాతాల్లో జమ
సీపీఎస్ ఉద్యోగుల 10% బకాయిలు ‘ప్రాన్’ ఖాతాల్లోకి మిగతా సొమ్ము 17 సమాన వాయిదాల్లో చెల్లింపు
ఉద్యోగులకు పెండింగ్‌లోనే మరో నాలుగు డీఏలు
హైదరాబాద్, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. దీపావళి కానుకగా.. ఒక కరువు భత్యాన్ని/ కరువు సహాయాన్ని (డీఏ/డీఆర్) ప్రకటించింది. మూల వేతనం, పింఛనుపై 3.64 శాతం డీఏ/డీఆర్‌ను చెల్లించనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఉద్యోగులు, పెన్షనర్లకు 22.75 శాతం డీఏ/డీఆర్ అమలవుతోంది. దీనికి 3.64 శాతాన్ని కలిపి 26.39 శాతాన్ని అమలు చేయనుంది. దీనిని నవంబరు వేతనంతో అంటే డిసెంబరు 1 నుంచి చెల్లించనుంది. 28 నెలల బకాయిలను ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్) ఖాతాల్లో జమ చేస్తారు. జీపీఎఫ్ ఖాతాలు లేని ఫుల్ టైమ్ కంటింజెంట్ ఉద్యోగులు; పెన్షనర్లకు 2025 జనవరి వేతనం/ పింఛను అంటే ఫిబ్రవరి 1 నుంచి 17 సమాన వాయిదాల్లో చెల్లిస్తారు.
ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు బుధవారం వేర్వేరుగా 120, 121 జీవోలను జారీ చేశారు. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 1.7.2022, 1.1.2023, 1.7.2023, 1.1.2024, 1.7.2024లకు సంబంధించి ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మూడు; కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మరో రెండు డీఏలు పెండింగ్ పడ్డాయి. వీటిని ఎప్పటికప్పుడు విడుదల చేయాల్సిందిగా ఉద్యోగులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జరిపిన చర్చల మేరకు ఒక డీఏను ఇప్పుడు విడుదల చేసింది. ఈనెల 26న జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో కూడా దీనికి ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
వీరికి కరువు భత్యం వర్తింపు
ప్రభుత్వ ఉద్యోగులతోపాటు 2020నాటి పీఆర్సీ ప్రకారం వేతనాలు పొందుతున్న జిల్లా, మండల పరిషత్, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, వ్యవసాయ మార్కెట్ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సంస్థలు, వర్క్‌చార్జ్‌డ్ సిబ్బంది అందరికీ పెరిగిన 3.64ు డీఏ వర్తిస్తుంది.
2020 నాటి రివైజ్డ్ పే స్కేళ్లు పొందుతున్న ఎయిడెడ్ సంస్థలు, ఎయిడెడ్ పాలిటెక్నిక్‌లలోని బోధన, బోధనేతర సిబ్బందికి పెరిగిన డీఏ వర్తిస్తుంది.
యూనివర్సిటీల్లో 2020 నాటి పే స్కేళ్లు పొందుతున్న బోధన, బోధనేతర ఉద్యోగులకు వర్తిస్తుంది.
2015 నాటి పీఆర్సీ ప్రకారం వేతనాలు పొందుతున్న ఉద్యోగులకు కూడా 4.716 శాతం డీఏను విడుదల చేసింది. వీరి డీఏ 59.196 శాతం నుంచి 63.912 శాతానికి పెరిగింది. ఇలాంటి ఉద్యోగులు చాలా తక్కువ శాతం ఉంటారు. వీరికి కూడా 1.7.2022 నుంచి డీఏ అమల్లోకి వస్తుంది.
రాష్ట్రంలో 2016 నాటి కేంద్ర పీఆర్సీ ప్రకారం యూజీసీ/ఏఐసీటీఈ వేతనాలు పొందుతున్న ఉద్యోగులకు 34 శాతం నుంచి 38 శాతానికి అంటే.. 4 శాతం డీఏను పెంచింది. ఇది కూడా 1.7.2022 నుంచే అమల్లోకి వస్తుంది. యూనివర్సిటీల్లో బోధన, బోధనేతర సిబ్బంది, ప్రభుత్వ ఎయిడెడ్, అనుబంధ డిగ్రీ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, పాలిటెక్నిక్ సిబ్బంది అందరికీ పెరిగిన డీఏ వర్తిస్తుంది.
2006 నాటి కేంద్ర పీఆర్సీ ప్రకారం యూజీసీ/ఏఐసీటీఈ వేతనాలు పొందుతున్న ఉద్యోగులకు 203 శాతం నుంచి 212 శాతానికి పెంచింది. ఇది కూడా 1.7.2022 నుంచి అమల్లోకి వస్తుంది.
2025 మార్చి 31లోపు లేదా అదే తేదీన రిటైర్ అయ్యే ఉద్యోగులకు డీఏ బకాయిలను 17 సమాన వాయిదాల్లో చెల్లిస్తారు.
సీపీఎస్ ఉద్యోగులకు మాత్రం 28 నెలల బకాయిల్లో 10 శాతాన్ని వారి ‘పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్ (ప్రాన్)’ ఖాతాల్లో జమ చేస్తారు. మిగతా 90 శాతం బకాయిల సొమ్మును 2025 జనవరి వేతనంతో కలిపి, ఫిబ్రవరి 1 నుంచి 17 నెలల సమాన వాయిదాల్లో చెల్లిస్తారు.
ఈ ఉత్తర్వులు వెలువడడానికి ముందే ఏ ఉద్యోగి అయినా చనిపోతే.. వారి వారసులకు బకాయిలను ఏకమొత్తంగా ఒకేసారి చెల్లిస్తారు.
వ్యవసాయ మార్కెట్ కమిటీలు, జీహెచ్‌ఎంసీ సిబ్బందికి సంబంధించిన డీఏ చెల్లింపుల మొత్తం వ్యయాన్ని ఆ కమిటీలు, జీహెచ్‌ఎంసీయే భరించాల్సి ఉంటుంది.
పెన్షనర్లకు డీఆర్ చెల్లింపు ఇలా..
1.7.2018 తర్వాత రిటైరై 2020 నాటి పీఆర్సీ వేతనాలు పొందుతున్న పెన్షనర్లకు 3.64 శాతం డీఆర్ వర్తిస్తుంది.
1.7.2018కు ముందు రిటైరై 2021 జూన్ 11న జారీ అయిన జీవో నంబర్ 55 ప్రకారం పెన్షన్ మొత్తం కన్సాలిడేట్ అయినవారికి కూడా డీఆర్ వర్తిస్తుంది.
2015 నాటి పీఆర్సీ ప్రకారం పెన్షన్లు పొందుతున్న పింఛనర్లకు డీఆర్ 59.196 శాతం నుంచి 63.912 శాతానికి అంటే... 4.716 పెరిగింది. యూజీసీ/ఏఐసీటీఈ ప్రకారం పెన్షన్లు పొందుతున్న వారికి 34 నుంచి 38 శాతానికి డీఆర్ పెరిగింది.
మున్సిపాలిటీలు, పంచాయతీరాజ్ సంస్థలు, ఎయిడెడ్ విద్యా సంస్థల్లో బోధన, బోధనేతర రిటైర్డ్ సిబ్బందికి పెరిగిన 3.64 శాతం డీఆర్ వర్తిస్తుంది.
Updated Date - Oct 31 , 2024 | 05:03 AM