ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Mamunur Airport: ఓరుగల్లుకు.. ఎయిర్‌బస్‌ 320!

ABN, Publish Date - Nov 18 , 2024 | 02:58 AM

వరంగల్‌ జిల్లాలోని మామునూరు విమానాశ్రయ నిర్మాణానికి అడుగులు వడివడిగా పడుతున్నాయి. దీనికి అదనంగా కావాల్సిన 280.30 ఎకరాల భూ సేకరణ చేపట్టాలని వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించిన ప్రభుత్వం..

  • పెద్ద విమానాలు తిరిగేలా విమానాశ్రయ నిర్మాణం!

  • 949 ఎకరాలు అవసరం.. ఏఏఐ పరిధిలో 696 ఎకరాలు

  • మరో 280 ఎకరాల సేకరణకు రూ.205 కోట్లు మంజూరు

  • ఎయిర్‌పోర్టుకు లైన్‌క్లియర్‌ అని ముందే చెప్పిన ‘ఆంధ్రజ్యోతి’

హైదరాబాద్‌/వరంగల్‌, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): వరంగల్‌ జిల్లాలోని మామునూరు విమానాశ్రయ నిర్మాణానికి అడుగులు వడివడిగా పడుతున్నాయి. దీనికి అదనంగా కావాల్సిన 280.30 ఎకరాల భూ సేకరణ చేపట్టాలని వరంగల్‌ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించిన ప్రభుత్వం.. అందుకోసం రూ.205 కోట్లు మంజూరు చేస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. సేకరించిన భూమిలో 253 ఎకరాలను రన్‌వే, ఇతర అవసరాల కోసం అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. మిగతా భూమిని కూడా విమానాశ్రయ పరిధిలోనే ఉంచి, వివిధ అవసరాలకు వినియోగించనున్నారు. ‘150 కిలోమీటర్ల నిబంధన’పై శంషాబాద్‌ విమానాశ్రయ నిర్వహణ సంస్థ అయిన ‘జీఎంఆర్‌’ పక్కకు తప్పుకుని ప్రభుత్వానికి నిరభ్యంతర పత్రం(ఎన్‌వోసీ) సమర్పించడంతో మామునూరు ఎయిర్‌పోర్టు నిర్మాణానికి ఉన్న ప్రధాన ఆటంకం తొలగిపోయింది. ఇప్పుడు భూసేకరణ సమస్యకు ప్రభుత్వం తెరదించింది. జీఎంఆర్‌ ఎన్‌వోసీ ఇవ్వనున్న విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ ముందే చెప్పింది.


దీనిపై అక్టోబరు 24న ‘మామునూరుకు మోక్షం’ శీర్షికన కథనం ప్రచురించింది. కాగా, మామునూరులో ఏ-320 (ఎయిర్‌బస్‌-320) లాంటి పెద్ద విమానాలు రాకపోకలు సాగించేలా విమానాశ్రయం నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి డిజైన్లు, వివిధ సాంకేతిక అంశాలు కొలిక్కివచ్చినట్టు తెలిసింది. ఏ-320 స్థాయి విమానమంటే 180 మంది ప్రయాణించే అవకాశం ఉంటుంది. అదే సమయంలో వివిధ సంస్థలకు దేశ, విదేశాల నుంచి సామగ్రి, ముడి పదార్థాలను తీసుకొచ్చే పెద్ద కార్గో విమానాలు కూడా దిగేందుకు వీలుగా రన్‌ వే ఏర్పాటు చేయనున్నారు. 2,800 మీటర్ల పొడవు, 75 మీటర్ల వెడల్పుతో రన్‌వే నిర్మించనున్నట్టు తెలిసింది. మామునూరును భవిష్యత్తులో అంతర్జాతీయ విమానాశ్రయంగా అభివృద్ధి చేసే అవకాశాలు కనబడుతున్నాయి.


ప్రస్తుతం దీనికి ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) పరిధిలో 696 ఎకరాలు ఉండగా.. కొత్తగా సేకరించే భూములతో కలిపితే 949 ఎకరాలు అవుతుంది. దీన్నిబట్టి అంతర్జాతీయ విమానాశ్రయాల ఏర్పాటు నిబంధనల మేరకే భూమి కేటాయింపు జరిగిందని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. 2023 జూలై, 2024 ఏప్రిల్‌లో ఏఏఐ నిర్వహించిన భూ పరీక్షలు, టెక్నో ఎకనామికల్‌ ఫీజిబిలిటీ స్టడీ నివేదికను కేంద్రానికి సమర్పించింది. మూడు విమానాలతో ఎయిర్‌ వ్యూను కూడా చేపట్టి, విమానాల రాకపోకలకు వాతావరణం ఏ సమయాల్లో ఎలా ఉందనే అంశాన్ని కూడా పరిశీలించారు. ఈ పరీక్షల నేపథ్యంలో మామునూరు నుంచి అంతర్జాతీయ విమానాలను నడిపేందుకు సానుకూల వాతావరణం ఉన్నట్టు తెలిపినట్టు సమాచారం.


  • 1930లోనే వరంగల్‌లో ఎయిర్‌పోర్టు..

మామునూరులో 1930లో నిజాం హయాంలోనే విమానాశ్రయం ఏర్పాటవ్వగా వివిధ కారణాలతో 1980లో మూతపడింది. విమానాశ్రయం కోసం నిజాం కాలంలోనే 1,875 ఎకరాలు కేటాయించారు. ఆ భూమి నుంచే ప్రస్తుతం నవోదయ విద్యాలయానికి 23.20 ఎకరాలు, పోలీసు శిక్షణ కేంద్రానికి 59, ఏసీపీ కార్యాలయానికి 10, వరంగల్‌ సెంట్రల్‌ జైలుకు 101, ఫోర్త్‌ బెటాలియన్‌కు 241, వెటర్నరీ యూనివర్సిటీకి 675 ఎకరాలు కేటాయించారు. ఇవి పోగా ప్రస్తుతం ఏఏఐ పరిధిలో 696.14 ఎకరాల భూమి ఉంది. విమానాశ్రయం ఏర్పాటుకు మరో 253 ఎకరాల భూమి కావాలని ఏఏఐ ప్రభుత్వాన్ని కోరింది. గత ప్రభుత్వ హయాంలోనే ఈ భూమి కేటాయింపునకు చర్చలు జరిగినా పూర్తిస్థాయిలో సఫలం కాలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత మంత్రి కొండా సురేఖ శ్రద్ధ వహించి, రైతులతో మాట్లాడి, భూములు ఇచ్చేలా ఒప్పించడంతో సమస్య కొలిక్కివచ్చింది. ఈ విమానాశ్రయ నిర్మాణం పూర్తయితే ఢిల్లీ సహా ఇతర ప్రాంతాలకు ‘ఎయిర్‌ కనెక్టివిటీ’ పెరగడంతో పాటు పరిశ్రమల స్థాపనకు పెద్ద కంపెనీలు ఆసక్తి కనబరుస్తాయి. తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి.


  • 2007 నుంచే ప్రయత్నాలు..

దేశంలో అభివృద్ధి చెందుతున్న నగరాలకు రాష్ట్ర, దేశ రాజధాని ప్రాంతాలతో ‘ఎయిర్‌ కనెక్టివిటీ’ కల్పించాలని నిర్ణయించిన కేంద్రం 2017లో ‘ఉడాన్‌’ పథకాన్ని తీసుకురాగా, మామునూరుకు ఇందులో అవకాశం కల్పించింది. ఈ క్రమంలోనే ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటు, ఇప్పటికే ఉన్న వాటి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. భూ సేకరణ సహా సాంకేతిక సమస్యలు పరిష్కారమవడంతో మామునూరు విమానాశ్రయ నిర్మాణ పనులు త్వరలోనే పట్టాలెక్కనున్నాయి.

  • వరంగల్‌ ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది

ఉమ్మడి వరంగల్‌ జిల్లా అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి ఎంతగానో సహకరిస్తున్నారు. మామునూరు విమానాశ్రయ నిర్మాణానికి సీఎం వేగంగా చర్యలు తీసుకోవడంతో పాటు, భూ సేకరణకు రూ.205 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసి వరంగల్‌ ప్రజల దశాబ్దాల చిరకాల వాంఛను నెరవేర్చారు. విమానాశ్రయం ఏర్పాటు నా రాజకీయ ప్రస్థానంలో ఒక మైలురాయిగా నిలుస్తుంది.

- కొండా సురేఖ, రాష్ట్ర మంత్రి

Updated Date - Nov 18 , 2024 | 02:58 AM