Hostel Charges: డైట్, కాస్మెటిక్ చార్జీలను పెంచిన ప్రభుత్వం
ABN, Publish Date - Nov 02 , 2024 | 04:37 AM
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వసతి గృహాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల హాస్టళ్ల పరిధిలోని విద్యార్థులందరికీ ప్రభుత్వం డైట్, కాస్మెటిక్ చార్జీలను పెంచింది.
కొత్త చార్జీలు పది రోజుల్లో అమల్లోకి
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు
7.65లక్షల మంది విద్యార్థులకు లబ్ధి
హైదరాబాద్, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వసతి గృహాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల హాస్టళ్ల పరిధిలోని విద్యార్థులందరికీ ప్రభుత్వం డైట్, కాస్మెటిక్ చార్జీలను పెంచింది. పెంచిన చార్జీలను పది రోజుల్లో అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత శాఖల అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. అదే విధంగా విద్యార్థులకు పోషకాహారం అందేలా డైట్‌లో మార్పులు చేర్పులు చేయాలని సూచించారు. పెంచిన చార్జీలతో రాష్ట్రంలో 7.65 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ఈ సందర్భంగా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, సంక్షేమ విభాగాల సెక్రటరీలు సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
చార్జీల పెంపు విషయంలో కమిటీ ప్రతిపాదనను యథాతథంగా అమలు చేయడంపై అధికారులు హర్షం వ్యక్తం చేశారు. కాగా దీపావళి (31-10-2024) రోజు రాష్ట్ర ప్రభుత్వం డైట్, కాస్మెటిక్ చార్జీలను పెంచుతూ జీవో ఎం.ఎస్ నెంబర్ 9ని విడుదల చేసింది. రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులందరికీ ఇదే అసలైన దీపావళి పండుగ అని మంత్రి సీతక్క తెలిపారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో రేవంత్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. చార్జీలు పెరగడంతో ఇకపై హాస్టళ్ల విద్యార్థులు అర్ధాకలితో అవస్థలు పడే అవసరంలేదన్నారు. పెంచిన ఈ చార్జీలను గ్రీన్ చానల్ ద్వారా చెల్లిస్తామన్నారు.
థ్యాంక్యూ సీఎం సార్.. ఎస్సీ గురుకుల విద్యార్థుల హర్షం
అన్ని ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో డైట్, కాస్మొటిక్ చార్జీలను రాష్ట్ర ప్రభుత్వం పెంచడంతో ఆయా పాఠశాలల విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని పలు ఎస్సీ గురుకుల పాఠశాల విద్యార్థులు ‘‘థ్యాంక్యూ సీఎం సార్’’ అనే ప్లకార్డులు పట్టుకుని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
Updated Date - Nov 02 , 2024 | 04:37 AM