Nalgonda: ధాన్యం కొనుగోళ్లకు టోకెన్లు
ABN, Publish Date - Nov 12 , 2024 | 03:39 AM
నల్లగొండ జిల్లాలో సన్నధాన్యం కొనుగోళ్లలో గందరగోళం తలెత్తకుండా చూసేందుకు ఈ నెల 14 నుంచి రైతులకు టోకెన్ విధానం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రైతుల ఆందోళనల నేపథ్యంలో నిర్ణయం
మిర్యాలగూడ రైస్‌మిల్లర్లతో అదనపు కలెక్టర్ సమీక్ష
నల్లగొండ, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నల్లగొండ జిల్లాలో సన్నధాన్యం కొనుగోళ్లలో గందరగోళం తలెత్తకుండా చూసేందుకు ఈ నెల 14 నుంచి రైతులకు టోకెన్ విధానం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం మిర్యాలగూడలో రైస్‌మిల్లర్లు, అధికారులతో అదనపు కల్టెర్ శ్రీనివాస్ నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మిర్యాలగూడలోని మిల్లు పాయింట్ల వద్ద ధాన్యం కొనుగోలు ఆలస్యమవుతుండడం, సన్నధాన్యానికి మద్దతు ధర కల్పించకపోవడంతో ఆదివారం రైతులు ధర్నాలు, ఆందోళనలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సీరియ్‌సగా తీసుకున్నారు. మిల్లుల వద్ద కొనుగోళ్ల ప్రక్రియను పరిశీలించి రైతులకు ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్‌కలెక్టర్ అమిత్ నారాయణ్‌ను ఆదేశించారు.
దీంతో ఈ అధికారులిద్దరూ సోమవారం మిర్యాలగూడ ప్రాంతంలోని శెట్టిపాలెం, బాదలాపురం వద్ద మిల్లులను తనిఖీ చేశారు. మిల్లు పాయింట్ల వద్ద ధాన్యానికి కనీస మద్దతు ధర కల్పించని విషయాన్ని గుర్తించి.. మిల్లులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. క్రిమినల్ కేసులు కూడా పెట్టాల్సివస్తుందన్నారు. అనంతరం మిర్యాలగూడలో మిల్లర్లు, రైతుల ప్రతినిధులు, మార్కెటింగ్, సివిల్ సప్లయిస్, వ్యవసాయ శాఖ, పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించి.. సన్నధాన్యం కొనుగోళ్లు సాఫీగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. మిర్యాలగూడ పరిసరాల్లోని 84 మిల్లుల సామర్థ్యం రోజుకు 3వేల ట్రాక్టర్ల వరకే ఉంటుందని, అంతకుమించి ధాన్యం రావడం వల్లనే గందరగోళం తలెత్తుతోందని మిల్లర్లు తెలిపారు. ధాన్యం రాకను క్రమబద్ధీకరిస్తే కొనుగోళ్లు సజావుగా సాగుతాయని వారు చెప్పడంతో టోకెన్ విధానం అమలు చేయాలని నిర్ణయించారు.
వరి కోతలు అయిన వెంటనే వ్యవసాయాధికారులు రైతులకు టోకెన్లు ఇస్తే.. సీరియల్ ప్రకారం ఏ రోజు, ఏ సమయానికి, ఏ మిల్లుకు ధాన్యం తీసుకురావాలో సూచిస్తారని, ఆ మేరకు ధాన్యం విక్రయించుకోవచ్చని అన్నారు. కాగా, నల్లగొండ జిల్లా నుంచే కాకుండా సూర్యాపేట జిల్లా నుంచి కూడా మిర్యాలగూడ ప్రాంతంలోని మిల్లులకు ధాన్యం ఎక్కువగా వస్తుండడంతో ఆ జిల్లా అధికారులతోనూ సమన్వయం చేసుకుని టోకెన్లను పంపిణీ చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ధాన్యం కొనుగోళ్లను పర్యవేక్షించేందుకు రెవెన్యూ, సివిల్ సప్లయిస్, మార్కెటింగ్, వ్యవసాయ శాఖతో పాటు పోలీస్ అధికారులతో కలిపి పర్యవేక్షణ కమిటీలను నియమిస్తామని అధికారులు చెప్పారు. మిల్లుల్లో విధిగా కొనుగోళ్ల రిజిస్టర్లు, ధాన్యం వివరాలు, రైతుల, స్టాక్ వివరాలు నమోదు చేయాలన్నారు.
సూర్యాపేట మార్కెట్‌కు 52,499 బస్తాల ధాన్యం
భానుపురి: సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ సోమవారం ధాన్యం రాశులతో కళకళలాడింది. 770 మంది రైతులు 52,499 బస్తాల ధాన్యం తీసుకువచ్చారు. ఈ సీజన్‌లో ఇదే అధికం. ప్రభుత్వ మద్దతు ధర రూ.2,360 కాగా, అత్యధికంగా బీపీటీ పాత రకం ధాన్యానికి రూ.2,649, జై శ్రీరామ్ రకానికి రూ.2,464 పలికింది. భారీగా ధాన్యం వస్తుండటం, ధాన్యం కాంటాలకు, ఎగుమతికి ఆలస్యమవుతుండటంతో ఖరీదుదారుల విన్నపం మేరకు మంగళవారం మార్కెట్‌కు సెలవు ప్రకటించారు.
Updated Date - Nov 12 , 2024 | 03:39 AM