Smart City: ఫోర్త్‌సిటీకి స్మార్ట్ సొబగులు!
ABN, Publish Date - Oct 24 , 2024 | 02:56 AM
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక నగరంగా నిర్మించనున్న ఫోర్త్‌సిటీకి స్మార్ట్ సొబగులు అద్దాలని యోచిస్తోంది. కాలుష్యరహిత విధానాలు అనుసరిస్తూ.. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో అభివృద్ధి చేసే యోచనలో ఉంది.
నగరాన్ని సందర్శించిన మంత్రుల బృందం
ఇంచియాన్‌లో అన్ని సేవలూ ఆన్‌లైన్‌లోనే
ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో అభివృద్ధి
పునరుత్పాదక విద్యుత్తు, పునర్వినియోగ
నీటి పద్ధతులు, కాలుష్య రహిత విధానాలు
వీటినే ఫోర్త్‌సిటీకి అనుసరించే యోచన
హైదరాబాద్ , జిల్లా కేంద్రాల్లోనూ స్మార్ట్ సేవలు
కొరియా స్పోర్ట్స్ వర్సిటీతో త్వరలో ఒప్పందం
క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు సహకారం
(సియోల్ నుంచి ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక ప్రతినిధి) : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక నగరంగా నిర్మించనున్న ఫోర్త్‌సిటీకి స్మార్ట్ సొబగులు అద్దాలని యోచిస్తోంది. కాలుష్యరహిత విధానాలు అనుసరిస్తూ.. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో అభివృద్ధి చేసే యోచనలో ఉంది. ఇందుకోసం సియోల్‌కు 30 కిలోమీటర్ల దూరంలో స్మార్ట్ సిటీగా ఉన్న ఇంచియాన్ నగరంలో అమలు చేస్తున్న విధానాలను ఫోర్త్‌సిటీలో అనుసరించాలని భావిస్తోంది. ఈ మేరకు.. సియోల్ పర్యటనలో ఉన్న రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ నేతృత్వంలోని బృందం బుధవారం ఇంచియాన్ స్మార్ట్ సిటీని, అందులో భాగంగా ఉన్న చియోంగ్న, సాంగడో, ఇయాంగ్జాంగ్ ప్రాంతాలను సందర్శించింది. అక్కడి అధికారులతో చర్చలు జరిపింది. ఇంచియాన్ నగరంలో పునరుత్పాదక విద్యుత్తు, పునర్వినియోగ నీటి పద్ధతులు, పవన, సోలార్ విద్యుత్తు వ్యవస్థలు, ఇళ్లలో ఏసీ, ఉష్ణోగ్రతల నిర్వహణ, సెక్యూరిటీ, విద్యుత్తు సరఫరా నియంత్రణ తదితర సేవలను సాంకేతికత సహాయంతో అందిస్తున్న తీరును అడిగి తెలుసుకుంది. తక్కువ భూభాగంలోనే ఈ నగరాలను అభివృద్ధి చేస్తున్నారని, ఇంతకంటే ఎక్కువ స్థలం ఉన్న ఫోర్త్‌సిటీని అన్ని హంగులతో నిర్మించవచ్చనే అభిప్రాయానికి వచ్చింది.
ఇంచియాన్‌లో స్మార్ట్‌గా సేవలు..
ఇంచియాన్ స్మార్ట్ సిటీలో ప్రజలకు అవసరమయ్యే అన్ని సేవలు దాదాపు ఆన్‌లైన్‌లోనే అందుతున్నాయి. ఐటీ, ఐవోటీలను ఉపయోగించి మొత్తం స్మార్ట్ సేవలకు శ్రీకారం చుట్టారు. ట్రాఫిక్ నియంత్రణ, రక్షణ వ్యవస్థల నిర్వహణతోపాటు చలికాలం ఇళ్లలోని ఏసీల ద్వారా వేడి రావడం, వేసవిలో చల్లగాలి వచ్చేలా నియంత్రించడం వరకు అంతా స్మార్ట్‌గా అందిస్తున్నారు. అంతేకాదు.. దక్షిణ కొరియాలోనే మొట్టమొదటి ఫ్రీ ఎకనామిక్ జోన్ (ఎఫ్‌ఈజడ్) కూడా ఇక్కడే ఏర్పాటైంది. ఈ నగర అభివృద్ధికి ప్రైవేటు సంస్థలు కూడా ముందుకొచ్చాయి. పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్యం పద్ధతిలో అభివృద్ధి జరిగింది. అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఇంచియాన్‌లోనే ఉంది. దీంతో హైదరాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో నిర్మించబోతున్న ఫోర్త్‌సిటీలో కూడా ఇంచియాన్ నగరంలోని స్మార్ట్ విధానాలనే అనుసరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాకుండా హైదరాబాద్, జిల్లాల కేంద్రాల్లో కూడా అవసరమైన మేరకు ఈ స్మార్ట్ సేవలను తీసుకువచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది.
శిక్షణ ఇచ్చేందుకు రావాలి..
కొరియా స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా రాష్ట్ర మంత్రుల బృందం సందర్శించింది. అక్కడి సౌకర్యాలను పరిశీలించింది. యూనివర్సిటీలో శిక్షణ పొందిన అనేకమంది క్రీడాకారులు ఒలింపిక్స్‌లో దక్షిణ కొరియాకు పతకాలు సాధించి పెట్టారు. కాగా, ఫోర్త్‌సిటీలో ఏర్పాటు చేయనున్న యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో క్రీడాకారులకు శిక్షణ కోసం కొరియా స్పోర్ట్స్ యూనివర్సిటీతో ఎంవోయూ చేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఆగస్టులో దక్షిణ కొరియా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కూడా ఈ యూనివర్సిటీని సందర్శించారు. ఆయన కూడా ఇక్కడి అధికారులతో మాట్లాడారు. ఇప్పుడు మంత్రులు ఆ చర్చలను మరింత ముందుకు తీసుకెళ్లారు. ఫోర్త్‌సిటీలో ఏర్పాటుచేస్తున్న యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలోని క్రీడాకారులకు శిక్షణ ఇచ్చేందుకు రావాలని కోరారు. ఇందుకు అక్కడి అధికారులు సానుకూలంగా స్పందించారు. ఈ సహకారానికి సంబంధించి త్వరలోనే అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడానికి అంగీకారం కుదిరింది.
ఫోర్త్ సిటీలో పెట్టుబడులకు ప్రపంచంలోని పలు కంపెనీలు సిద్ధం
ఐటీ రంగంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉండే కాలుష్యర హిత కంపెనీలను స్మార్ట్ ఫోర్త్‌సిటీలో ఏర్పాటుచేసేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇంచియాన్ స్మార్ట్‌సిటీతో చూస్తే ఫోర్త్‌సిటీకి ఉన్న ప్రదేశం ఇంకా ఎక్కువ అని, భవిష్యత్తులో మరింత అద్భుతంగా అభివృద్ధి చేయవచ్చునని పేర్కొన్నారు. ఫార్మా రంగంలో కూడా కాలుష్య రహితమైనవే వస్తాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల్లోని పలు కంపెనీలు ఫోర్త్‌సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాయన్నారు. కొరియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో శిక్షణ పొందిన ఒక అమ్మాయే ఒలింపిక్స్‌లో ఏకంగా మూడు బంగారు పతకాలు సాధించిందని తెలిపారు. ఇక్కడి నుంచి వచ్చే కోచ్‌లు ఇచ్చే శిక్షణతో యంగ్ ఇండియా యూనివర్సిటీలో మెరికల్లాంటి క్రీడాకారులను తయారుచేస్తామన్నారు. భారత్ తరఫున హైదరాబాద్‌ను స్పోర్ట్స్ హబ్‌గా చేసి... తెలంగాణ బిడ్డల్ని కూడా పతక విజేతలుగా చేస్తామని చెప్పారు.
ప్రతిపక్ష నేతలవి అవాకులు, చవాకులు..
ప్రధాన ప్రతిపక్ష నేతలు కొన్ని అవాకులు, చవాకులు పేలారని పొంగులేటి మండిపడ్డారు. ఒకరోజు పిల్లకాలువ అని, మరో పెద్ద కాలువ అని రకరకాలుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. సియోల్ నదులను ఎత్తుకొచ్చి తెలంగాణలో పెట్టమని, ఇక్కడ ఆ నదుల అభివృద్ధి కోసం అనుసరించిన విధానాలను అమలుచేస్తామని అన్నారు. దశాబ్దాలుగా మూసీలో మగ్గుతున్న వారికి మెరుగైన జీవితాలు ఇచ్చేలా, వారి పిల్లలకు ఉద్యోగ భవిష్యత్తు ఉండేలా విధానాలు రూపొందిస్తామన్నారు. మూసీని ప్రక్షాళన చేసే విషయంలో బాధితులను కష్టపెట్టబోమని స్పష్టం చేశారు. కాగా, బీజేపీ నేతలు మూసీ నదిని సందర్శించి రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారని మంత్రి పొన్నం ప్రభాకర్ తప్పుబట్టారు. వాళ్లు అవకాశవాద రాజకీయాలు మానుకోవాలని, తెలంగాణ అభివృద్ధి కావాలనుకుంటే మూసీ విషయంలో సహకరించాలని అన్నారు. చిత్తశుద్ది ఉంటే విమర్శలు మాని.. సూచనలు ఇవ్వాలన్నారు.
Updated Date - Oct 24 , 2024 | 02:57 AM