Scheme: ఇందిరమ్మ ఇళ్లకు దారి సుగమం!
ABN, Publish Date - Sep 20 , 2024 | 03:58 AM
ఇల్లు లేని పేదలకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో తీపి కబురు అందించనుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు అవసరమైన విధివిధానాలను ప్రకటించనుంది.
10 రోజుల్లో విధివిధానాలు.. అధికారుల కసరత్తు
పీఎంఏవైకి అనుసంధానించాలని నిర్ణయం
హైదరాబాద్, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): ఇల్లు లేని పేదలకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో తీపి కబురు అందించనుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు అవసరమైన విధివిధానాలను ప్రకటించనుంది. ఈ మేరకు మార్గదర్శకాలు, విధివిధానాలను వారం, పది రోజుల్లో ఖరారు చేయనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆ దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ పథకాన్ని కేంద్రం అందించే ప్రధానమంత్రి ఆవాస యోజన (పీఎంఏవై అర్బన్, రూరల్) పథకానికి అనుసంధానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత ఏడాది డిసెంబర్‌లో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించిన సంగతి తెలిసిందే. వాటిలో.. ఇంటికోసం వచ్చిన దరఖాస్తులు దాదాపు 82 లక్షలు. అర్బన్ పరిధిలో 23.5 లక్షలు, రూరల్‌లో 58.5 లక్షల దరఖాస్తులు వచ్చినట్టు సమాచారం.
ఈ పథకం కింద మొదటి దఫాలో.. అంటే ఈ ఆర్థిక సంవత్సరంలో.. సొంత స్థలం ఉన్నవారికి ఇళ్లను అందించాలని, రెండో దఫాలో స్థలం లేనివారికి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అర్హులైన పేదలకు ఇల్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షల ఆర్థిక సాయం (ఇంటి స్థలం ఉన్న వారికి ఆర్థిక సాయం, స్థలం లేని వారికి స్థలం ఇచ్చి, ఆర్థిక సాయం) అందించనుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొదటి విడతలో నియోజకవర్గానికి 3,500 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4,16,500 ఇండ్లను పేదలకు ఇవ్వాలని.. రిజర్వ్ కోటా కింద మరో 33,500 ఇండ్లను ప్రభుత్వ విచక్షణలో ఉంచాలని నిర్ణయించింది. ఈ పథకం అమలు కోసం బడ్జెట్‌లో రూ.9,184 కోట్లు కేటాయించగా, కేంద్రం నుంచి పీఎంఏవై పథకం కింద దాదాపు రూ.4,600 కోట్లు అందుతాయని సర్కారు అంచనా వేసింది. కాగా.. ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న ఇండ్ల పథకాల మార్గదర్శకాలు, విధివిధానాలు ఏ విధంగా ఉన్నాయనేదానిపై గృహనిర్మాణ సంస్థ ఇప్పటికే అధ్యయనం చేసింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో అధికారుల బృందాలు పర్యటించి, ఒక నివేదికను ప్రభుత్వానికి సమర్పించినట్టు తెలిసింది.
అర్హుల ఎంపిక ప్రక్రియ ఇలా..
ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారు అర్హులా కాదా అనే విషయాన్ని ప్రభుత్వం క్షుణ్నంగా పరిశీలించి ఖరారు చేయనుంది. ఇందుకోసం క్షేత్రస్థాయి పరిశీలన, తనిఖీ చేయాలని నిర్ణయించింది. గ్రామం, పట్టణం, మున్సిపాలిటి, వార్డుల వరకూ ప్రత్యేక పరిశీలన అధికారి, పలు టీములతో కలిసి వెళ్లి దరఖాస్తులను ధ్రువీకరించనున్నారు. లబ్ధిదారులు అర్హులా, కాదా అనే విషయాలను తేల్చేందుకు సర్కారు ఒక ప్రత్యేక ప్రొఫార్మాను తయారుచేసినట్టు తెలిసింది. దాని ప్రకారం.. ఆధార్ కార్డు, తెల్ల రేషన్ కార్డులను పరిశీలిస్తారు. గ్రామంలో ఎప్పటి నుంచి నివాసం ఉంటున్నారు, ప్రస్తుతం ఏ ఇంట్లో ఉంటున్నారనే వివరాలను సేకరిస్తారు. ఆ తరువాత దరఖాస్తుదారు అర్హులు అయి, ఇంటి స్థలం ఉన్న వారైతే సదరు స్థలం సొంతమేనా, డి-ఫారం పట్టానా లేదా పూర్వీకుల ఆస్తి నుంచి సంక్రమించిందా అనే వివరాలను తీసుకుంటారు. ఇంటి స్థలం లేని వారైతే.. వారికి ఇంటి స్థలం ఇవ్వాలని ఫ్రొఫార్మాలో నమోదు చేయనున్నారు. ఈ ప్రక్రియ నిర్వహణకు గ్రామస్థాయి సిబ్బందితో పాటు రెవెన్యూ సిబ్బందిని కూడా వినియోగించుకోనున్నట్టు తెలిసింది.
కొత్త యాప్?
ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలుకు ఒక యాప్‌ను అందుబాటులోకి తీసుకు రావాలనే యోచనలో సర్కారు ఉన్నట్టు సమాచారం. అర్హుల గుర్తింపు, ఇళ్ల నిర్మాణం, అందించే ఆర్థిక సాయం మంజూరు వరకు మొత్తం ప్రక్రియనూ ఆ యాప్ ద్వారానే నిర్వహించాలనే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే వీటికి సంబంధించి కేంద్రం కూడా ఒక యాప్, పోర్టల్‌ను సూచిస్తోంది. ఈ నేపథ్యంలో వాటి ద్వారానే పథకాన్ని అమలుచేద్దామా లేక రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెద్దామా అనే అంశంపై ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నట్టు తెలిసింది.
Updated Date - Sep 20 , 2024 | 03:58 AM