Tummala: మలేషియా తరహాలో తెలంగాణలో పామాయిల్ బోర్డు!
ABN, Publish Date - Oct 31 , 2024 | 03:35 AM
ఆయిల్‌పామ్ సాగు, పామాయిల్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించిన మలేషియా తరహా విధానాలను తెలంగాణలో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
స్వయం సమృద్ధి సాధించటమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి తుమ్మల
హైదరాబాద్, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): ఆయిల్‌పామ్ సాగు, పామాయిల్ ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించిన మలేషియా తరహా విధానాలను తెలంగాణలో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు మలేషియాలో విజయవంతంగా నడుస్తున్న ‘పామాయిల్ బోర్డు’ను తెలంగాణలో కూడా ఏర్పాటు చేయాలని, బోర్డుతోపాటు సీడ్ గార్డెన్లు, విత్తన మొలకల తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఇటీవల మూడు రోజులపాటు మలేషియాలో పర్యటించిన ఆయన అక్కడ పామాయిల్ సాగు, విత్తనాభివృద్ధి, ప్రాసెసింగ్ యూనిట్లు, యాంత్రీకరణను పరిశీలించారు. రాష్ట్రంలో పామాయిల్ ఉత్పత్తి, స్వయం సమృద్ధికి మలేషియా తరహా విధివిధానాలు అమలుచేస్తామని బుధవారం వెల్లడించారు.
మలేషియాలో అధ్యయనం అనంతరం పలు కీలక నిర్ణయాలు తీసుకోవటంతోపాటు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ఇందులో కీలకమైన ది ‘పామాయిల్ బోర్డు’. మలేషియాలో ఉన్న ఎంపీవోబీ(మలేషియా పామాయిల్ బోర్డు) తరహాలో ‘‘తెలంగాణ పామాయిల్ బోర్డు’’(టీజీపీవోబీ) ఏర్పాటుచేస్తామని తుమ్మల తెలిపారు. మలేషియాలో ఉన్న ‘ఎఫ్‌జీవీ’(ఫెల్డా గ్లోబల్ వెంచర్స్) తరహాలో రాష్ట్రంలో కూడా సీడ్ గార్డెన్, విత్తన మొలకల తయారీ యూనిట్లను ఏర్పాటు చేసి... రాష్ట్రానికి పామాయిల్ విత్తన మొలకలను తక్కువ ఖర్చు, ఎక్కువ నాణ్యతతో ఇక్కడే తయారుచేసి, రైతులకు సరఫరా చేస్తామని తుమ్మల వెల్లడించారు. ఈమేరకు ఎఫ్‌జీవి అధికారులు కూడా రాష్ట్రంలో నాణ్యమైన మొలకల ఉత్పత్తి, ఆయిల్‌పామ్ విత్తన తోటల స్థాపనకు సహకారం అందిస్తామని హామీ ఇచ్చినట్లు తుమ్మల స్పష్టంచేశారు. ఉత్పత్తి యూనిట్లు ఆయిల్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న కర్మాగారాల సామర్థ్యం పెంచి, ముడి పామాయిల్ ఉత్పత్తి, రిఫైనరీ, మార్కెటింగ్ చేసి... రైతులకు టన్నుకు రూ. 20 వేలు ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు.
Updated Date - Oct 31 , 2024 | 03:35 AM