ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ponguleti: నవంబరు నుంచి కొత్త రిజిస్ట్రేషన్‌ చార్జీలు!

ABN, Publish Date - Sep 27 , 2024 | 03:24 AM

భూముల మార్కెట్‌ విలువలు పెంచాలని సర్కారు నిర్ణయించిన నేపథ్యంలో నవంబరు 1 నుంచి సవరించిన కొత్త రిజిస్ట్రేషన్‌ విలువలు అమల్లోకి రానున్నాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు.

  • సీఈజీఐఎస్‌ నివేదిక, అధికారుల ప్రతిపాదనలు పరిశీలించి తుది నిర్ణయం

  • అక్టోబరు నుంచి కొత్త ఆర్వోఆర్‌ చట్టం

  • ధరణి సమస్యలకు పూర్తి పరిష్కారం

  • పరీక్షతో గ్రామ రెవెన్యూ ఉద్యోగుల ఎంపిక

  • పాతవారూ పరీక్ష రాయాల్సిందే

  • మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి

హైదరాబాద్‌, సెప్టెంబరు 26(ఆంధ్రజ్యోతి): భూముల మార్కెట్‌ విలువలు పెంచాలని సర్కారు నిర్ణయించిన నేపథ్యంలో నవంబరు 1 నుంచి సవరించిన కొత్త రిజిస్ట్రేషన్‌ విలువలు అమల్లోకి రానున్నాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. పెంచనున్న మార్కెట్‌ విలువలపై విమర్శలు తలెత్తకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. గురువారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. విలువల పెంపు శాస్ర్తీయంగా ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు.


కాంట్రాక్టు ఏజెన్సీ అయిన సెంటర్‌ ఫర్‌ ఎఫెక్టివ్‌ గవర్నెన్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ స్టేట్స్‌ (సీఈజీఐఎస్‌) ఇచ్చే నివేదికపైనే ఆధారపడకుండా, రిజిస్ట్రేషన్‌ శాఖ అధికారుల నుంచి కూడా ప్రతిపాదనలనూ పరిశీలించి తుది నిర్ణయం తీసుకోనున్నామన్నారు. అక్టోబరు 15 లోపల నివేదిక ఇస్తుందని, ఆ వెంటనే మార్కెట్‌ విలువల సవరణపై నిర్ణయం తీసుకుంటామన్నారు. కాగా, ప్రస్తుతం చదరపు అడుగు ఫ్లాట్‌ ధర రిజిస్ట్రేషన్‌ శాఖ విలువ ప్రకారం నగరాల్లో సగటున రూ.3200గా ఉంటే దీన్ని 30 శాతం(రూ.960) మించకుండా పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. సాగు భూములు, స్థలాల విషయంలో ఇప్పుడున్న విలువను సవరించి గజం ధర రూ.1,000 ఉంటే దాన్ని రూ.2 వేలకు పెంచాలనే ప్రతిపాదనలున్నాయి.


  • వచ్చే నెల నుంచి అమల్లోకి..

వచ్చే నెల నుంచి కొత్త రికార్డ్‌ ఆఫ్‌ రైట్స్‌ (ఆర్వోఆర్‌-2024) చట్టం అమల్లోకి రానుందని మంత్రి తెలిపారు. ఇందుకు అవసరమైన సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించారు. ఆర్వోఆర్‌ ముసాయిదాపై వివిధ వర్గాల నుంచి సేకరించిన సలహాలు, సూచనలు, కలెక్టర్లు పంపిన నివేదికలపై ఇప్పటికే తుది నిర్ణయం తీసుకున్నామన్నారు. అయితే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి చట్టం తేవడమా లేక ఆర్డినెన్స్‌ ద్వారా తీసుకురావడమా అనే దానిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. గత నెలలో కర్ణాటక పర్యటనకు వెళ్లి వచ్చిన ధరణి కమిటీ సభ్యులు.. ప్రతిపాదించిన అంశాలనూ చట్టంలో పొందుపరిచే విషయాన్ని పరిశీలిసున్నామన్నారు. కొత్త చట్టం అమల్లోకి వస్తే ధరణితో పాటు చాలావరకు భూసమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చెప్పారు.


ధరణిలో 3.10 లక్షల పెండింగ్‌ దరఖాస్తుల్లో ఇప్పటికీ 1.10లక్షలు అపరిష్కృతంగా ఉన్నాయని.. వీలైనంత త్వరగా వాటిని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్లు వెల్లడించారు. గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థను తిరిగి బలోపేతం చేస్తామని చెప్పారు. వీఆర్‌వో, వీఆర్‌ఏ నియామకాలకు సంబంధించి... అభ్యర్థుల సామర్థ్యాలను గుర్తించేందుకు పరీక్ష పెట్టి ఎంపిక చేస్తామని వివరించారు. అభ్యర్థులకు డిగ్రీ విద్యా అర్హతగా నిర్ణయించామన్నారు. పాత వారిని తిరిగి రెవెన్యూ సర్వీసులోకి తీసుకోవాలన్నా పరీక్ష రాయాల్సిందేనని స్పష్టం చేశారు. కాగా, రిజిస్ట్రేషన్‌ శాఖలో ఇటీవల జరిగిన బదిలీల్లో కొంతమంది అధికారులు వసూళ్లకు పాల్పడటంపై మంత్రి పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని బదిలీలు చేసినా.. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చిన వారిని ఈడ్చి కొడతానని ఘాటుగా వ్యాఖ్యానించారు. బదిలీల్లో ఎవరు వసూళ్లకు పాల్పడ్డారో ఆ వివరాలు తన దగ్గర ఉన్నాయని, వారిని ఉపేక్షించేది లేదన్నారు.

Updated Date - Sep 27 , 2024 | 08:58 AM