Survey : 20 నుంచి సర్వే వివరాల నమోదు!
ABN, Publish Date - Nov 17 , 2024 | 04:49 AM
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వేలో సేకరించిన వివరాలను సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేసేందుకు అవసరమైన డేటా ఎంట్రీ ఆపరేటర్లకు డమ్మీ సాఫ్ట్‌వేర్‌పై ప్రభుత్వం శిక్షణ ఇచ్చింది.
డేటా ఎంట్రీ ఆపరేటర్లకు మాస్టర్ ట్రైనింగ్ పూర్తి
రాష్ట్ర వ్యాప్తంగా 20 వేల మందికి పైగా ఆపరేటర్లు
హైదరాబాద్, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వేలో సేకరించిన వివరాలను సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేసేందుకు అవసరమైన డేటా ఎంట్రీ ఆపరేటర్లకు డమ్మీ సాఫ్ట్‌వేర్‌పై ప్రభుత్వం శిక్షణ ఇచ్చింది. శనివారం హైదరాబాద్‌లోని నారాయణమ్మ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ ట్రైనింగ్ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి జిల్లాకు 5-10 మంది, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి 20 మంది చొప్పున మొత్తం 300 మంది హాజరయ్యారు. సర్వే వివరాలను సాఫ్ట్‌వేర్‌లో నమోదుచేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20వేల మందికిపైగా ఆపరేటర్లు అవసరమవనున్నట్టు ప్రభుత్వం అంచనా వేస్తోంది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ... సర్వే వివరాల నమోదులో ఎలాంటి తప్పులు లేకుండా చూడాలని శిక్షణకు హాజరైన ఆపరేటర్లకు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 50 శాతం సర్వే జరిగినట్లు తెలిపారు. కాగా, ప్రస్తుతం సర్వే ఉమ్మడి జిల్లాల వారీగా కాకుండా కొత్త జిల్లాల వారీగానే సాగుతోంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పాటై, తక్కువ జనాభా ఉన్న జిల్లాల్లో సర్వే వేగంగా జరుగుతోందని అధికారిక వర్గాలు అంటున్నాయి. దీంతో సర్వేలో వచ్చిన వివరాలను సాఫ్ట్‌వేర్‌లో నమోదు చేసే ప్రక్రియను ఈ నెల 20 నుంచి ప్రారంభించే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.
Updated Date - Nov 17 , 2024 | 04:49 AM