GP Fund: ఉద్యోగుల జీపీఎఫ్‌కు వడ్డీ ఏదీ?
ABN, Publish Date - Nov 16 , 2024 | 03:26 AM
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు.. తమ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్) విషయంలో అధికారుల తీరు వల్ల పెద్ద ఎత్తున నష్టపోయే పరిస్థితి నెలకొంది.
2023 మిత్తిని ఖాతాల్లో జమ చేయని సర్కారు
ఏడాది వడ్డీ నష్టపోతాం: ఉద్యోగులు, టీచర్లు
జడ్పీ జీపీఎఫ్ ఖాతాల వారికే ప్రధాన సమస్య
కొత్త జిల్లాలకు మారడం వల్లే ఈ పరిస్థితి
పాత జిల్లాల నుంచి ఖాతాల బదిలీతోనే సరి
గత ఏడాది వడ్డీని బదిలీ చేయని అధికారులు
హైదరాబాద్, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు.. తమ జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్) విషయంలో అధికారుల తీరు వల్ల పెద్ద ఎత్తున నష్టపోయే పరిస్థితి నెలకొంది. 2023 సంవత్సరానికి సంబంధించి జీపీఎ్‌ఫకు ప్రభుత్వం కలపాల్సిన వడ్డీని ఇప్పటికీ కలపకపోవడమే ఇందుకు కారణం. ఏయేటికాయేడు వడ్డీ జమ అయితే.. అది అసలు సొమ్ము (ప్రిన్సిపల్ అమౌంట్)గా మారుతుందని, దానిపై మళ్లీ వడ్డీ కలుస్తూ రావాలని ఉద్యోగులు చెబుతున్నారు. కానీ, గత ఏడాదికి సంబంధించిన వడ్డీ జమ కాకపోవడంతో అటు వడ్డీ రూపంలో నష్టంతోపాటు ప్రిన్సిపల్ అమౌంట్ రూపంలోనూ నష్టపోవాల్సి వస్తోందని అంటున్నారు. తమ సొమ్మును జీపీఎ్‌ఫలో జమ చేసే బదులు.. ఏ బ్యాంకులోనో జమ చేసుకుంటే కచ్చితంగా వడ్డీ వచ్చేదని పేర్కొంటున్నారు. అయితే రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ తరువాత ఉద్యోగులు, ఉపాధ్యాయులు కొత్త జిల్లాలకు బదిలీ కావడంతోనే ఈ సమస్య తలెత్తిందని చెబుతున్నారు. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు భవిష్య నిధి (జీపీఎఫ్) ఖాతాలు ఉంటాయి. ప్రతి నెలా వారి మూల వేతనాల నుంచి కనీసం 6 శాతం సొమ్మును మినహాయించి జీపీఎఫ్ ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుంటుంది. కొంత మంది.. ఆదాయ పన్ను మినహాయింపు కోసం ఎక్కువ మొత్తంలో కూడా జీపీఎఫ్ కింద మినహాయింపజేసుకొని ఆ ఖాతాల్లో జమ చేయించుకుంటుంటారు. పదవీ విరమణ పొందిన తర్వాత ఈ జీపీఎఫ్ ఖాతాలోని సొమ్మును ఉద్యోగి వెనక్కి తీసుకునే వెసులుబాటు ఉంటుంది. సర్వీసు మధ్యలో కూడా ఇళ్ల నిర్మాణం, పిల్లల పెళ్లిళ్ల కోసం ‘పార్ట్ ఫైనల్ ఉపసంహరణ’ కింద కొంత సొమ్మును తన ఖాతా నుంచి తీసేసుకోవచ్చు.
ఉద్యోగులకు వేర్వేరు జీపీఎఫ్ ఖాతాలు..
జీపీఎఫ్ ఖాతాలు అందరు ఉద్యోగులకు ఒకేలా ఉండవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన సొమ్ము ‘అకౌంటెంట్ జనరల్ జీపీఎఫ్ (ఏజీజీపీఎఫ్)’ ఖాతాల్లో జమ అవుతుంది. జిల్లా పరిషత్‌లు, మండల పరిషత్‌ల కింద పనిచేసే ఉపాధ్యాయులు, పంచాయతీరాజ్ శాఖలోని ఎస్టాబ్లి్‌షమెంట్ ఉద్యోగులు, ఇంజనీర్ల సొమ్ము మాత్రం ‘జిల్లా పరిషత్ జీపీఎఫ్ (జడ్పీ జీపీఎఫ్)’ ఖాతాల్లో జమ అవుతుంటుంది. అయితే ఈ ఖాతాలన్నీ రాష్ట్ర ప్రభుత్వ అధీనంలోనే ఉంటాయి. ఈ దృష్ట్యా ఉద్యోగుల ఖాతాల్లో జమ అయిన భవిష్యనిధి సొమ్మును ప్రభుత్వం తన అవసరాలకు వినియోగించుకుంటుంది. ఇలా వినియోగించుకుంటున్నందుకుగాను ఉద్యోగుల సొమ్ముకు ప్రభుత్వం వడ్డీని కలపాల్సి ఉంటుంది. జీపీఎఫ్ సొమ్ముపై 7.8 శాతం మేర వార్షిక వడ్డీని జమ చేయాల్సి ఉంటుంది. దీంతో జీపీఎఫ్ ఖాతాలో రూ.4 లక్షల సొమ్ము కలిగి ఉన్న ఉద్యోగికి.. ఏడాదికిగాను వడ్డీ రూపంలో దాదాపు రూ.30 వేల దాకా జమ అవుతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల జీపీఎఫ్ సొమ్ముకు 2023 సంవత్సరానికి సంబంధించిన వడ్డీని ఇప్పటివరకు కలపలేదని ఉద్యోగ సంఘాలు తెలిపాయి. ముఖ్యంగా జడ్పీ జీపీఎఫ్ ఖాతాలున్న ఉపాధ్యాయులు, ఉద్యోగులకే ఈ సమస్య ఎక్కువగా ఉందని పేర్కొన్నాయి.
కొత్త జిల్లాల ఏర్పాటు తరువాతే సమస్య..!
జీపీఎఫ్ సొమ్ముకు ప్రభుత్వం వడ్డీ కలపని సమస్య రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత తలెత్తిందని ఉద్యోగ సంఘాలు చెప్పాయి. రాష్ట్ర ప్రభుత్వం 2016లో ఉమ్మడి 10 జిల్లాలను పునర్వ్యవస్థీకరించి 33 జిల్లాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులను కొత్త జిల్లాలకు సర్దుబాటు చేయాల్సి వచ్చింది. ఇలా కొత్త జిల్లాలకు వెళ్లిన ఉపాధ్యాయులు, ఉద్యోగుల జడ్పీ జీపీఎఫ్ ఖాతాలను పాత జిల్లాల నుంచి కొత్త జిల్లాలకు బదలాయించాల్సి ఉంటుంది. కానీ, ఈ ప్రక్రియ చాలా ఆలస్యమైంది. 2016లో కొత్త జిల్లాలు ఏర్పాటైనప్పటికీ.. రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ, జోన్ల ఏర్పాటు వంటి ప్రక్రియల నేపథ్యంలో ఖాతాలు బదిలీ కాలేదు. ఎట్టకేలకు 2023లో కొన్ని ఖాతాలను బదలాయించారు. ఇంకా కొన్ని ఇప్పటికీ బదిలీ కాలేదు. బదిలీ అయిన ఖాతాలకు కూడా 2023కు సంబంధించిన వడ్డీ బదిలీ కాలేదని ఉద్యోగ సంఘాలు తెలిపాయి. కొత్త జిల్లాలకు వచ్చిన ఖాతాలకు.. ఆయా జిల్లా పరిషత్ అధికారులు గత ఏడాదికి సంబంధించిన వడ్డీ శాతాన్ని లెక్కగట్టి జమ చేయడం లేదని చెప్పాయి. 2024 నుంచే వడ్డీ జమ అవుతుంది తప్ప.. 2023 వడ్డీతో తమకు సంబంధం లేదంటున్నారని వివరిస్తున్నాయి. దీంతో తాము ఏడాది వడ్డీని నష్టపోవాల్సి వస్తోందని, ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించి, తమకు న్యాయం చేయాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.
Updated Date - Nov 16 , 2024 | 03:26 AM