Ponguleti: జిల్లాలు యథాతథం..
ABN, Publish Date - Dec 17 , 2024 | 03:51 AM
రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో లేవని రెవిన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి స్పష్టం చేశారు. కొత్తగా జిల్లాలను ఏర్పాటు చేయడం కానీ, ఉన్న జిల్లాలను తొలగించేది కానీ లేదని చెప్పారు.
అమరావతిలో వరద భయం
పెట్టుబడిదారులు హైదరాబాద్‌కు
ఇక్కడ రియల్ ఎస్టేట్ పెరిగింది
ఫార్ములా ఈ పెట్టుబడుల లెక్కలు రూ.55 కోట్లో.. రూ.700 కోట్లో ఏసీబీ విచారణలో తేలుతుంది
మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో లేవని రెవిన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి స్పష్టం చేశారు. కొత్తగా జిల్లాలను ఏర్పాటు చేయడం కానీ, ఉన్న జిల్లాలను తొలగించేది కానీ లేదని చెప్పారు. ప్రశ్నోత్తరాల సందర్భంగా సోమవారం శాసనమండలిలో బీఆర్‌ఎస్ సభ్యులు తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, కల్వకుంట్ల కవిత తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి శ్రీనివా్‌సరెడ్డి సమాధానం చెబుతూ.. రాష్ట్రానికి రావలిసిన నిధుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపగానే వ్యాగన్‌లలో డబ్బుకట్టలు రావని వ్యాఖ్యానించారు. తెలంగాణ దేశంలోని ఒక రాష్ట్రమని రాష్ట్రానికి రావలిసిన నిధుల కోసం మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతిపాదనలు రూపొందించి నివేదించడం జరుగుతుందన్నారు. కానీ, కేంద్రంలో ఒక పార్టీ, రాష్ట్రంలో మరో పార్టీ అధికారంలో కొనసాగుతున్న క్రమంలో రావలిసిన నిధుల విడుదల పరిస్థితి ఎలా ఉంటుందో తెలిసిందేనని పేర్కొన్నారు. మీరు (బీఆర్‌ఎస్) అధికారంలో ఉన్నప్పుడు ఏమేరకు నిధులు తీసుకురాగలిగారో... గతంలో ఎంపీలుగా పని చేసిన అనుభవంలో తె లిసిన విషయమేనని అన్నారు. ఏపీ రాజధాని అమరావతికి వరదలొచ్చాక.. పెట్టుబడిదారులు అక్కడ పెట్టేందుకు జంకుతున్నారంటూ మంత్రి పొంగులేటి.. అసెంబ్లీ లాబీల్లోని తన చాంబర్లో సోమవారం మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. వారు ఇప్పుడు హైదరాబాద్, బెంగళూరుల్లో పెట్టుబడులు పెడుతున్నారన్నారు. ఏపీకి చంద్రబాబు సీఎం కాగానే రియల్ రంగ పెట్టుబడులు అక్కడికి పోతాయన్నది ప్రచారం మాత్రమేనని, వాస్తవంలో హైదరాబాద్ రియల్ వ్యాపారం పడిపోలేదని చెప్పారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక తెలంగాణ రియల్ ఎస్టేట్ రంగంలో కొంత అభద్రతా భావం ఉండేదని, ఇటీవల అమరావతికి వరదలు వచ్చాక అది తొలగి పోయిందని అన్నారు. పెట్టుబడిదారులంతా మళ్లీ ఇప్పుడు తెలంగాణ బాట పట్టారని, గత మూడేళ్ల రాబడులతో పోలిస్తే తెలంగాణలో స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్ ఆదాయం పెరిగిందని వివరించారు.
మూడు నెలల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారమూ పెరిగిందని తెలిపారు. హైడ్రా విషయంలోనూ మొదట్లో తప్పుడు ప్రచారం జరిగినా ఇప్పుడు ప్రజలు వాస్తవాలు తెలుసుకున్నారని, హైడ్రా పట్ల వారిలో భయం తొలగిపోయిందని చెప్పారు. డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కపై ప్రివిలైజ్ మోషన్ పెట్టాలంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కోరడం అర్థరహితమన్నారు. తెలంగాణ అప్పులు రూ. 3.89 లక్షల కోట్లని ఆర్బీఐ నివేదిక స్పష్టం చేస్తుందంటూ మాట్లాడుతున్న కేటీఆర్.. కార్పొరేషన్ రుణాలతో కలిపి ఎంత మేరకు అప్పు అయిందీ బయటపెట్టాలని, కార్పొరేషన్ల పేరుతో చేసిన అప్పులూ ప్రభుత్వ ఖాతాలోకే వస్తాయన్న సంగతి ఆయన తెలుసుకోవాలని సూచించారు. కార్పొరేషన్ రుణాలతో కలుపుకుని తెలంగాణ అప్పులు రూ.7.20 లక్షల కోట్లని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి వస్తే బాగుంటుందని, అసెంబ్లీలో ఆయనతో కూర్చుని మాట్లాడాలన్న కోరిక వ్యక్తిగతంగా తనకు ఉందని తెలిపారు. కాంగ్రెస్ ఏడాది పాలనపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకతా లేదని, వైఎ్‌సఆర్ హయాంలోనూ ఇలానే ప్రచారం జరిగిందని, ఆ తర్వాత రెండు, మూడేళ్లలో వర్షాలు పడి అన్నీ సర్దుకున్నాయని పేర్కొన్నారు. అదానీ విషయంలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానమే ఇక్కడా అమలవుతుందని చెప్పారు.
భూమిలేని 15 లక్షల కుటుంబాలకు లబ్ధి
భూమిలేని నిరుపేదలకు ఏడాదికి రూ.12 వేల చొప్పున ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంతో 15లక్షల కుటుం
మీడియా పాసుల్లో తెలంగాణ తల్లి బొమ్మ
అసెంబ్లీ సమావేశాలను కవర్ చేసే జర్నలిస్టులకు ప్రభుత్వం అందించే కొత్త గుర్తింపు కార్డుల్లో ‘తెలంగాణ తల్లి’ బొమ్మను పొందుపరచాలని అసెంబ్లీ డిప్యూటీ కార్యదర్శిని మంత్రి పొంగులేటి ఆదేశించారు. కొత్తగా అందించబోయే కార్డుల రంగును కూడా మార్చాలన్నారు. అసెంబ్లీలో మీడియాకు సౌకర్యాలు సరిగా లేవని, భోజనంలో నాణ్యత లోపిస్తుందంటూ మీడియా ప్రతినిధులు ఆయన దృష్టికి తెచ్చారు. లాబీలో డ్యూటీ చేసే జర్నలిస్టులు కూడా బయట మీడియా పాయింట్ దగ్గరకు వెళ్లాల్సి వస్తుందని తెలిపారు. వెంటనే అసెంబ్లీ డిప్యూటీ సెక్రటరీని పిలిపించిన ఆయన.. తానే మీడియా ప్రతినిధులతో కలిసి భోజనం చేస్తానని, నాణ్యత లేకుంటే చర్యలు తీసుకుంటామన్నారు.
Updated Date - Dec 17 , 2024 | 03:51 AM