Damodar: జర్నలిస్టుల ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలి
ABN, Publish Date - Oct 22 , 2024 | 04:30 AM
రాష్ట్రంలో గత ఐదేళ్లుగా జర్నలిస్టుల ఆరోగ్య పథకం (జేహెచ్‌ఎ్‌స) సక్రమంగా అమలుకాకపోవడంతో జర్నలిస్టులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని,
మంత్రి దామోదరకు టీయూడబ్ల్యూజే వినతి
త్వరలో ఉన్నతస్థాయి భేటీలో చర్చిస్తామన్న మంత్రి
హైదరాబాద్, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గత ఐదేళ్లుగా జర్నలిస్టుల ఆరోగ్య పథకం (జేహెచ్‌ఎ్‌స) సక్రమంగా అమలుకాకపోవడంతో జర్నలిస్టులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే జేహెచ్‌ఎ్‌స అమలయ్యేలా తగిన చర్యలు చేపట్టాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) కోరింది. సోమవారం టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు కె.విరాహత్ అలీ నేతృత్వంలో ప్రతినిధి బృందం బంజారాహిల్స్‌లోని ఆరోగ్యశ్రీ కార్యాలయంలో మంత్రి దామోదర రాజనర్సింహ, రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు ఆర్.వి.కర్ణన్‌ను కలిసి జేహెచ్‌ఎ్‌స అమలుపై చర్చింది.
పథకం అమలుకాకపోవడంతో పలువురు జర్నలిస్టులు అప్పులు చేసి చికిత్స పొందుతున్నట్లు చెప్పారు. వెంటనే ఆరోగ్య పథకాన్ని పునరుద్ధరించి జర్నలిస్టులకు ఆరోగ్య భద్రత కల్పించాలని మంత్రిని కోరారు. కాగా జేహెచ్‌ఎ్‌స విషయంలో జర్నలిస్టులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, ప్రభుత్వ ఉద్యోగులతోపాటు జర్నలిస్టులకు ఆరోగ్య పథకాన్ని పటిష్టంగా అమలుచేసే విషయంలో త్వరలో శాఖాపరంగా ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి చర్చిస్తామని టీయూడబ్ల్యూజే ప్రతినిధి బృందానికి మంత్రి దామోదర హామీ ఇచ్చారు.
Updated Date - Oct 22 , 2024 | 04:30 AM