Hyderabad: మూసీ, హన్ నదులకు సారూప్యం
ABN, Publish Date - Nov 16 , 2024 | 05:04 AM
కామన్వెల్త్ కాన్ఫరెన్స్ అసోసియేషన్ స్టడీ టూర్‌లో భాగంగా తెలంగాణ శాసన బృందం శుక్రవారం దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లోని హన్, చియాంగ్‌చాన్ నదులను సందర్శించింది.
పునరుజ్జీవంతో మూసీ కూడా సుందరంగా మారుతుంది
శాసనసభ స్పీకర్ ప్రసాద్‌కుమార్
హైదరాబాద్/వికారాబాద్, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): కామన్వెల్త్ కాన్ఫరెన్స్ అసోసియేషన్ స్టడీ టూర్‌లో భాగంగా తెలంగాణ శాసన బృందం శుక్రవారం దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లోని హన్, చియాంగ్‌చాన్ నదులను సందర్శించింది. స్పీకర్ ప్రసాద్‌కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ ముదిరాజ్, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు ఆయా నదులను పునరుద్ధరించిన తీరును తెలుసుకున్నారు. సియోల్ నగరం మధ్య నుంచి ప్రవహించే హన్ నది గతంలో మురికి, కాలుష్యంతో ఉండేదని, ఈ నదిని 20 ఏళ్ల కిందట శుద్ధి చేసి, సుందరీకరించామని స్థానిక అధికారులు తెలిపారు.
మౌలిక వసతులూ కల్పించడంతో పర్యాటక ప్రదేశంగా మారిందన్నారు. అదేవిధంగా చియాంగ్‌చాన్ నది వెంట కూడా మౌలిక వసతులు ఏర్పాటు చేయడంతో పర్యాటకంగా, వ్యాపార పరంగా అభివృద్ధి చెందిందని స్థానిక వ్యాపారులు, ప్రజలు చెప్పారు. ఈ సందర్భంగా సియోల్‌లోని హన్ నదికి, హైదరాబాద్‌లోని మూసీ నదికి పోలిక ఉందని స్పీకర్ ప్రసాద్‌కుమార్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన పునరుజ్జీవ ప్రాజెక్టు పూర్తయితే మూసీ కూడా పరిశుభ్రంగా, పర్యాటక ప్రదేశంగా మారుతుందని చెప్పారు.
Updated Date - Nov 16 , 2024 | 05:04 AM