ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Uttam: నాలుగేళ్లలో కొత్తగా 30 లక్షల ఎకరాల ఆయకట్టు

ABN, Publish Date - Nov 21 , 2024 | 03:42 AM

రానున్న నాలుగు సంవత్సరాల కాలంలో తెలంగాణలో కొత్తగా 30 లక్షల ఎకరాల ఆయకట్టు అందుబాటులోకి తీసుకొస్తామని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

  • తక్కువ ఖర్చు.. ఎక్కువ ఆయకట్టు ప్రాజెక్టులకు ప్రాధాన్యం: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

  • ప్రతీ పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు: పొంగులేటి

  • విపక్ష నేతల మాటలను తిప్పికొట్టాలి: తుమ్మల

  • నేతన్నలు, రైతన్నల సంక్షేమమే లక్ష్యం: పొన్నం

  • కాంగ్రెస్‌ది ప్రజాస్వామ్య పాలన: దామోదర

వేములవాడ, నవంబరు 20: రానున్న నాలుగు సంవత్సరాల కాలంలో తెలంగాణలో కొత్తగా 30 లక్షల ఎకరాల ఆయకట్టు అందుబాటులోకి తీసుకొస్తామని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు కోసం లక్షా 81 వేల కోట్లు ఖర్చుపెట్టి నామమాత్రపు ఆయకట్టు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్రభుత్వంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు వచ్చే ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా బుధవారం వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం గుడి చెరువు ప్రాంగణలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు స్టేజ్‌-2 ఫేస్‌-1 పనులు త్వరితగతిన పూర్తిచేసి కరీంనగర్‌, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో లక్షా 51 వేల 400 ఎకరాలకు ఈ సంవత్సరంలోనే నీళ్లు అందిస్తామని తెలిపారు. రేషన్‌ కార్డుల ద్వారా సన్నబియ్యం పంపిణీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ వచ్చే నాలుగేళ్లలో లక్ష కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు కట్టించి ఇస్తామని తెలిపారు. ప్రతీ నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున.. ప్రతీ ఊరిలో, ప్రతీ పేదవాడికి ఇల్లు కట్టించి ఇస్తామన్నారు. గత ప్రభుత్వం పేదల భూములను దోచుకునేందుకు 2020 చట్టాన్ని తీసుకొచ్చిందని, రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం దేశంలోనే రోల్‌ మోడల్‌గా ఉండేలా కొత్తగా 2024 రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చి పేదల భూములను రక్షిస్తుందని హామీ ఇచ్చారు.


మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఈ వర్షాకాలం సీజన్‌లో కోటి 53 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి దిగుబడి వచ్చిందని, దేశంలోనే ఇది అత్యధికమని చెప్పారు. రైతన్నలకు 30 వేల కోట్లు రుణమాఫీ చేస్తామని మాట ఇచ్చామని, ఇప్పటికే 18 వేల కోట్ల రుణ మాఫీ చేశామని, త్వరలో మిగతా రుణమాఫీ కూడా చేస్తామన్నారు. రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ప్రతిపక్ష నేతలు చెప్పే మాటలను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని ఇచ్చిన మాటను తప్పి శివునికి సైతం శఠగోపం పెట్టిన చరిత్ర కేసీఆర్‌ది అని విమర్శించారు. రాజన్న ఆలయ అభివృద్ధితో పాటు నేతన్నల, రైతన్నల సంక్షేమానికి ప్రజాప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ.. బీఆర్‌ఎ్‌సకు ఓటేసి గెలిపిస్తే తొమ్మిదిన్నర సంవత్సరాలు నిరంకుశ పరిపాలన చూపించారని, కాంగ్రెస్‌ ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన సాగిస్తోందన్నారు. పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడా ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం ప్రతీ ఒక్కరికి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో వేములవాడ ఎమ్మెల్యే, విప్‌ ఆది శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 21 , 2024 | 03:42 AM