Komatireddy Venkatareddy: రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలు పెరుగుతాయి
ABN, Publish Date - Dec 17 , 2024 | 03:54 AM
కేంద్ర ప్రభుత్వం త్వరలో చేపట్టబోయే జనాభా గణన తరువాత దేశంలో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని, దాంతోరాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలు పెరుగుతాయని ఆర్ అండ్ బీ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
సుమారు 34 అసెంబ్లీ, 7 ఎంపీ సీట్లు పెరగొచ్చు
రాజకీయాల్లో హుందాతనం ఉండాలి
కేటీఆర్, హరీశ్‌కు అది తెలియదు: కోమటిరెడ్డి
హైదరాబాద్, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి) : కేంద్ర ప్రభుత్వం త్వరలో చేపట్టబోయే జనాభా గణన తరువాత దేశంలో నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని, దాంతోరాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలు పెరుగుతాయని ఆర్ అండ్ బీ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శాసనసభ విరామ సమయంలో అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో మీడియాతో సోమవారం ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. పునర్విభజనతో తెలంగాణలో సుమారు 34 అసెంబ్లీ స్థానాలు, 7 పార్లమెంటు స్థానాలు పెరిగే అవకాశం ఉందని చెప్పారు. జమిలి ఎన్నికలపై కేంద్రం అన్ని అంశాలను సిద్ధం చేసుకుందన్నారు. రాజకీయాల్లో హుందాతనం ఉండాలని, అది చాలా ముఖ్యమన్నారు. కానీ దురదృష్టవశాత్తు కేటీఆర్, హరీశ్‌రావులకు హుందాతనం లేదన్నారు. మళ్లీ అధికారంలోకి వస్తామన్న నమ్మకం లేకనే.. కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని వ్యాఖ్యానించారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి ఐదారుగురు సభ్యులున్నా కూడా కాంగ్రెస్ తరఫున భట్టి విక్రమార్క సభకు హాజరయ్యారని, అలాంటిది 30 మంది ఎమ్మెల్యేలున్నా.. కేసీఆర్ ఎందుకు రావడం లేదంటూ నిలదీశారు.
ప్రతిపక్ష హోదా లేకపోయినా.. పార్లమెంటుకు తమ జాతీయ నాయకులు ఖర్గే వెళుతున్నారంటూ గుర్తుచేశారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష నేత పాత్ర పోషించాలని, ఆయన ఏ విషయం గురించి ప్రశ్నించినా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని.. ఇందిరాగాంధీ, ఎన్టీఆర్‌లాంటి నేతలు కూడా ఒకానొక సమయంలో ఓటమిని చవి చూశారన్నారు. ఇక ప్రజల్లో పరపతి లేని కేటీఆర్, హరీశ్ గురించి మాట్లాడొద్దని సీఎంకు చెప్పానని తెలిపారు. అందుకే పాలమూరు, నల్గొండ జిల్లాల్లో నిర్వహించిన సభల్లో వారి పేరు ఎత్తలేదన్నారు. పబ్లిక్‌లో వాళ్లిద్దరూ పెద్ద జోకర్లుగా మారారని ఎద్దేవా చేశారు. ఇక సర్పంచ్‌ల పెండింగ్ బిల్లుల విషయంలో బీఆర్‌ఎస్ సభ్యులు చెప్పిన గణాంకాలు తప్పని అన్నారు.
శాసనసభ నిర్వహణపై బీఆర్‌ఎస్ వాళ్లకు మాట్లాడే హక్కు లేదని, గత పదేళ్లలో ఎన్ని రోజులు అసెంబ్లీని నిర్వహించారనే వివరాలు అసెంబ్లీ రికార్డుల్లో ఉంటాయని, అవి చూస్తే వాస్తవం తేలుతుందన్నారు. సీఎం, మంత్రులు ప్రజలకు అందుబాటులో ఉంటున్నామని చెప్పారు. ఇక కాంగ్రెస్ పార్టీలో, మంత్రివర్గ విస్తరణలో పదవులు ఎవరికి వస్తాయనేదానిపై ఎవరూ అంచనా వేయలేరని చెప్పారు. ఈ విషయంలో అధిష్టానం, ముఖ్యమంత్రిదే తుది నిర్ణయమన్నారు. అయితే మంత్రివర్గ విస్తరణలో పాలమూరు జిల్లా నుంచి వాకిటి శ్రీహరికి కచ్చితంగా అవకాశం ఉంటుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో చావు నోట్లో తలపెట్టి వచ్చానని కేసీఆర్ అంటున్నారని.. కానీ వాస్తవంగా తెలంగాణ కోసం చావు నోట్లోకి వెళ్లొచ్చింది తానేనని చెప్పారు. దీక్ష చేసిన సమయంలో దాదాపు 17 కిలోలకు పైగా బరువు తగ్గి, నీరసించానని వివరించారు. కేసీఆర్‌లా తాను దొంగ దీక్ష చేయలేదన్నారు. ఇక ఉద్యమంలో ఒకాయనకు అగ్గిపెట్టే దొరకలేదంటూ హరీశ్‌రావును ఉద్దేశించి ఎద్దేవా చేశారు.
Updated Date - Dec 17 , 2024 | 03:54 AM