ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Tummala: సాగు భూములకే రైతు భరోసా

ABN, Publish Date - Oct 20 , 2024 | 02:52 AM

రాష్ట్రంలో సాగు భూములకే రైతు భరోసా పథకం అమలు చేస్తామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.

  • మంత్రివర్గ ఉప సంఘం నివేదిక ఇచ్చిన తర్వాతే..

  • వచ్చే పంటకాలం నుంచి అమలు

  • త్వరలో పంటల బీమా: మంత్రి తుమ్మల

హైదరాబాద్‌, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సాగు భూములకే రైతు భరోసా పథకం అమలు చేస్తామని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. శనివారం రైతు సంక్షేమ కమిషన్‌ కార్యాలయంలో కమిషన్‌ చైర్మన్‌ ఎన్‌.కోదండరెడ్డితో కలిసి తుమ్మల మీడియా సమావేశంలో మాట్లాడారు. రైతు భరోసాపై ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క ఆధ్వర్యంలోని మంత్రివర్గ ఉప సంఘం నివేదిక వచ్చాక క్యాబినెట్‌లో చర్చించి, నిర్ణయం తీసుకుంటామన్నారు. వచ్చే పంట కాలం అంటే రబీ నుంచి రైతు భరోసా అమలు చేస్తామన్నారు. ఎకరానికి రూ.7,500 చొప్పున రైతు భరోసా అందిస్తామన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పంటలు సాగు చేయని, పంట యోగ్యత లేని భూములకు కూడా రైతుబంధు కింద డబ్బులు ఇచ్చిందని, అలా రూ.25 వేల కోట్లు దుర్వినియోగం అయ్యాయని తమకు ఫిర్యాదులు వచ్చాయన్నారు.


అందుకే పంట వేసిన భూములకే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. తమ ప్రజా ప్రభుత్వం రైతులకు ఒకేసారి ఏకంగా రూ.18 వేల కోట్ల రుణమాఫీ చేసిందని, ఇది దేశ చరిత్రలో మొదటిసారి అని చెప్పారు. ఎంత రుణమాఫీ చేశామనే వివరాలను నియోజకవర్గాల వారీగా ప్రతి ఎమ్మెల్యేకు పంపించామన్నారు. రూ.2 లక్షల రుణమాఫీని డిసెంబరులోగా పూర్తి చేస్తామని, దీనికి క్యాబినెట్‌లో చర్చించి షెడ్యూల్‌ ప్రకటిస్తామన్నారు. రైతులను రుణవిముక్తులను చేసే బాధ్యత కాంగ్రె్‌సదని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వచ్చే నాటికి గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న రైతుబంధు రూ.7,666 కోట్లు ఇచ్చామన్నారు.


రాష్ట్రంలో త్వరలోనే పంటల బీమా అమలు చేస్తామని, ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుందన్నారు. గత ఐదేళ్లూ పంటల బీమా పథకాన్ని ఎత్తేశారని, ఫలితంగా అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చే అవకాశం లేకపోవడంతో ఎకరానికి రూ.10 వేలు ఇస్తున్నామని చెప్పారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించగా, పత్తి కొనుగోలు కేంద్రాలూ ప్రారంభిస్తున్నామన్నారు. పంట దిగుబడులను కేంద్రం నిర్ణయించిన మద్దతు ధరకు రాష్ట్రం కొనుగోలు చేస్తోందని, కానీ కేంద్రం మాత్రం 25 శాతానికి మించి కొనడం లేదన్నారు. వందల కోట్లతో కోహెడలో మార్కెట్‌తో పాటు కోల్డ్‌ స్టోరేజీ ఏర్పాటు చేయడంతో పాటు అక్కడికి వచ్చే ఉత్పత్తులను ఎగుమతి చేసే స్థాయికి తీసుకువస్తామన్నారు. కోదండరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్త శకం మొదలైందన్నారు. సీఎం రేవంత్‌ రైతాంగానికి ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నారని తెలిపారు.


  • చిరుధాన్యాలకు గొప్ప చరిత్ర

చిరుధాన్యాలకు భారతదేశంతో పాటు, తెలంగాణలో గొప్ప చరిత్ర ఉందని, పూర్వీకులు తమ ఆహారంలో చిరుధాన్యాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చేవారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన అతర్జాతీయ పోషక చిరుధాన్యాల సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. గత కొన్ని దశాబ్దాలుగా జొన్నలు, సజ్జలు, రాగుల వంటి వాటి వినియోగం తగ్గిపోయిందన్నారు. 1980ల్లో చిరుధాన్యాల వినియోగం 9 మిలియన్‌ టన్నులు ఉంటే.. ప్రస్తుతం 4.5 మిలియన్‌ టన్నులకు తగ్గిందన్నారు. వాటిని రాష్ట్రంలో ఒక్కో వ్యక్తి సగటున రోజుకు 20 గ్రాములే తీసుకుంటున్నారని తెలిపారు. రోజువారీ ఆహారంలోకి వాటిని తీసుకురావడానికి ప్రయత్నించాలన్నారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్‌బాపూజీ ఉద్యాన వన విశ్వవిద్యాలయాల వైస్‌చాన్సలర్లుగా నియమితులైన అల్దాస్‌ జానయ్య, దండా రాజిరెడ్డి మంత్రి తుమ్మలను మర్యాదపూర్వకంగా కలిశారు.


  • మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

మార్క్‌ఫెడ్‌ ద్వారా దాదాపు లక్ష మెట్రిక్‌ టన్నుల మొక్కజొన్నలను మద్దతు ధరకు (క్వింటాలు రూ.2,225) కొనుగోలు చేయనున్నట్టు చైర్మన్‌ మార రంగారెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 100 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనుండగా, మొదట జగిత్యాల, నిర్మల్‌ జిల్లాలతో పాటు మరో 12 చోట్ల కేంద్రాలను శనివారమే అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Updated Date - Oct 20 , 2024 | 02:52 AM