TS News: 15న ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగం చిరకాల వాంఛ నెరవేరబోతోంది: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ABN, Publish Date - Aug 11 , 2024 | 02:37 PM
ఖమ్మం జిల్లాలోని వైరాలో మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.
వైరా: ఖమ్మం జిల్లాలోని వైరాలో మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగం చిరకాల వాంఛ ఈనెల 15 న నెరవేరబోతోందని అన్నారు. గోదావరి నీటిని కృష్ణా పరీవాహక ప్రాంతానికి తీసుకొచ్చే సీతారామ ప్రాజెక్ట్‌ను ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించబోతున్నారని ప్రకటించారు.
‘‘కేసీఆర్ ప్రభుత్వం రీడిజైన్ పేరుతో రూ.2,400 కోట్లను రూ.18,000 కోట్లకు పెంచి దోచుకున్నారు. రేవంత్ కేబినెట్ సీతారామ ప్రాజక్ట్ పనులు యుద్ధప్రాతిపదికన చేయించి పూర్తి చేస్తోంది. అతి తక్కువ ఖర్చుతో ఎక్కవ ఆయకట్టు తీసుకువచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోంది. రాజీవ్ కెనాల్ ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందించబోతున్నాం. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసి రైతాంగానికి అప్పజెప్పుతున్నాం’’ అని అన్నారు.
‘‘ కేంద్రంతో మాట్లాడి కేంద్ర మంత్రులను ఒప్పించి సీతారామకు 65 టీఎంసీల నీటిని కేటాయిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం జీవో విడుదల చేయించింది. ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కృషి ఫలితంగా సీతారామకు గోదావరి జలాల కేటాయింపు జరిగింది. ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారంటీలలో 5 గ్యారంటీలు ఇప్పటికే అమలు చేశాం. ఆగస్ట్ 15న ముఖ్య మంత్రి రేవంత్ రెండు లక్షల రుణమాఫీ పూర్తి చేస్తారు. ధరణి పేరుతో పేదల భూములు దోచుకున్నారు. రెవెన్యూ చట్టాన్ని సవరించి కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చి ప్రజల ముందు ఉంచాం. త్వరలోనే అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు అందజేస్తాం. ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆ కష్టాలు సమస్యలు అన్నింటిని అధిగమించి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం’’ అని చెప్పారు.
సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు గతంలో అనుమతులు లేవు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి గతంలో ఎలాంటి అనుమతులు లేవని, నీటి కేటాయింపులు లేవని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సెంట్రల్ వాటర్ కమిషన్‌ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి సీతారామకు అన్ని రకాల అనుమతులు తీసుకున్నామని మంత్రి వెల్లడించారు. 67 టీఎంసీల గోదావరి జలాలు సీతారామకు కేటాయించేలా కృషి చేశామని వివరించారు. ‘‘ఏన్కూర్ లింకు కెనాల్‌కు రాజీవ్ కెనాల్‌గా నామకరణం చేసి శరవేగంగా పనులు పూర్తి చేశాం. కేసీఆర్ ప్రభుత్వం రూ.8,000 కోట్లు సీతారామ ప్రాజక్ట్‌కు ఖర్చుచేసి కనీసం పంపులు ఏర్పాటు చేయలేదు. సీతారామ పరిధిలో ఒక్క ఎకరాకు నీరు ఇవ్వలేదు. 15 ఆగస్ట్ 2026 నాటికి సీతారామ ప్రాజక్ట్ పూర్తి చేసి పూర్తి స్థాయిలో వినియోగానికి తీసుకొస్తాం. సీతారామకు సంబంధించి 1,658 ఎకరాల భూసేకరణ చేయాల్సిన అవసరం ఉంది. జిల్లా ప్రజలు సహకరిస్తే భూసేకరణ సేకరణ పూర్తి చేసి ప్రాజక్ట్ పూర్తి చేస్తాం. రెండు సంవత్సరాలలో సీతారామను పూర్తి చేసి పది లక్షల ఎకరాల ఆయకట్టుకు గోదావరి జలాలను అందిస్తాం. ఆగస్టు 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏన్కూర్ లింక్ కెనాల్ ప్రారంభిస్తారు. ఆగస్టు 15న 2 లక్షల రుణమాఫీని పూర్తి చేస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతాంగానికి చెక్కులు అందజేస్తారు’’ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు.
Updated Date - Aug 11 , 2024 | 06:59 PM