Kishan Reddy: సింగరేణిని ప్రైవేటీకరణ అంశంపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ABN, Publish Date - Jul 31 , 2024 | 07:07 PM
సింగరేణిని ప్రైవేటీకరించే ఆలోచనేదీ కేంద్రప్రభుత్వానికి లేదని పార్లమెంటు వేదికగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ.కిషన్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. 24 జూలై నాడు పార్లమెంటు వేదికగా ఓ ప్రశ్నకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మౌఖికంగా సమాధానం ఇచ్చారు.
అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నకు పార్లమెంటు వేదికగా మరోసారి స్పష్టం చేసిన కేంద్రమంత్రి
గనుల వేలం వేయడం నిరంతర ప్రక్రియని వెల్లడించిన కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ: సింగరేణిని ప్రైవేటీకరించే ఆలోచనేదీ కేంద్రప్రభుత్వానికి లేదని పార్లమెంటు వేదికగా కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ.కిషన్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. 24 జూలై నాడు పార్లమెంటు వేదికగా ఓ ప్రశ్నకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మౌఖికంగా సమాధానం ఇచ్చారు. సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించారు. రాష్ట్ర ప్రభుత్వం వాటా 51 శాతం, కేంద్రప్రభుత్వం వాటా 49 శాతం ఉండగా.. కేంద్రం సింగరేణిని ఎలా ప్రైవేటీకరిస్తుందని అన్నారు. ఇదే ప్రశ్నను.. బుధవారం (31 జూలై, 2024) నాడు హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అడగగా కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. గనుల కేటాయింపులో పారదర్శకత ఉండేందుకే వేలం ప్రక్రియను చేపడుతున్నామని, ఇందులో ప్రభుత్వాలతో పాటుగా ప్రైవేటు సంస్థలు కూడా పాల్గొంటాయని చెప్పారు.
ప్రధాని మోదీకి ఎంపీ బాలశౌరి ధన్యవాదాలు..
కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాధాన్యత ఇచ్చి వివిధ రైల్వే ప్రాజెక్టుల కోసం రూ.9,151 కోట్లు కేటాయించినందుకు ప్రధాని మోదీకి మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధన్యవాదాలు తెలిపారు. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు రావాలని, రాష్ట్ర రాజధాని అమరావతికి రైల్వే అభివృద్ధి పనుల నిమిత్తం మరిన్ని నిధులు కావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. మచిలీపట్నం - నర్సాపురం రైల్వే లైన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని, ముఖ్యంగా మచిలీపట్నం - రేపల్లె రైల్వే లైన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ లైన్‌ను నిర్మిస్తే దివిసీమ ప్రజానీకానికి ఉపయోగకరంగా ఉంటుందని అభిలాష వ్యక్తం చేశారు.
గుడివాడ నియోజకవర్గం వడ్లమన్నాడు రైల్వే స్టేషన్‌లో కొన్ని రైళ్లకు స్టాప్‌లు ఇవ్వాలని ఎంపీ బాలశౌరి కోరారు. గతేడాది అక్టోబర్‌లో నిలిచిపోయిన మచిలీపట్నం నుంచి తిరుపతి వయా ధర్మవరం రైలు సర్వీసును భక్తుల కోరిక మేరకు పునరుద్దరించాలని ఎంపీ బాలశౌరి అభ్యర్థించారు.
Updated Date - Jul 31 , 2024 | 07:07 PM