Siddipet: డెంగీతో ముగ్గురి మృతి
ABN, Publish Date - Aug 25 , 2024 | 03:07 AM
డెంగీ బారిన పడి రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్ల చిన్నారి సహా ఒకేరోజు ముగ్గురు మృతిచెందారు. సిద్దిపేటలోని రాజు, రజిత దంపతుల కుమారుడు అయాన్ష్ (5)కు ఈ నెల 19న జ్వరమొచ్చింది.
సిద్దిపేట టౌన్, ఖానాపూర్, తొర్రూరు, ఆగస్టు24: డెంగీ బారిన పడి రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్ల చిన్నారి సహా ఒకేరోజు ముగ్గురు మృతిచెందారు. సిద్దిపేటలోని రాజు, రజిత దంపతుల కుమారుడు అయాన్ష్ (5)కు ఈ నెల 19న జ్వరమొచ్చింది. పట్టణంలోని పిల్లల ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించి మాత్రలు రాసిచ్చి ఇంటికి పంపారు. జ్వరం తగ్గకపోవడంతో ఈ నెల 22న మరోసారి బాలుడిని అదే ఆస్పత్రికి తీసుకెళ్లారు. రక్త పరీక్షలు చేశాక చిన్నారికి డెంగీ అని నిర్ధారణ జరిగింది. బాలుడికి వెంటనే చికిత్స ప్రారంభించారు.
మరుసటి రోజు రాత్రి బాలుడికి తీవ్ర జ్వరం రావడంతో మెరుగైన వైద్యం కోసం శనివారం ఉదయం 3:30 గంటల ప్రాంతంలో పట్టణంలోని మరో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో తొంటికూరి రంజిత్ (30) వారం రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నాడు. నిర్మల్‌లో వైద్య పరీక్షలు నిర్వహించగా డెంగీ అని తేల్చారు. హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో రంజిత్ చేరగా అక్కడ చికిత్స పొందుతూ రంజిత్ మృతిచెందాడు.
రంజిత్‌కు భార్య ప్రవళిక, రెండేళ్ల కూతురు ఉన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు వాస్తవ్యుడు, బీటెక్ విద్యార్థి బేతమల్లు ప్రేమ్ కుమార్ (23) డెంగీతో మృతిచెందాడు. 22న అతడికి తీవ్రస్థాయిలో జ్వరం వచ్చింది. నిర్మల్ ఆస్పత్రికి తరలించగా డెంగీ అని నిర్ధారించారు. ఖమ్మంలోని సురక్ష ఆస్పత్రికి తరలించగా శనివారం తెల్లవారుజామున 4 గంటలకు మృతిచెందాడు.
Updated Date - Aug 25 , 2024 | 03:07 AM