Telangana: హరీష్ రావుకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్..
ABN, Publish Date - Nov 18 , 2024 | 04:02 PM
వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో బీఆర్ఎస్ ఉండదని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు కూడా పక్క చూపులు చూస్తున్నాడన్నారు. చివరికి పార్టీలో తండ్రి, కొడుకు, కూతురు తప్ప ఎవరూ మిగలరని ఎద్దేవా చేశారు.
Telangana: సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా TPCC చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్వేచ్ఛ ఏ పార్టీలో లేదన్నారు. సీఎం రేవంత్ ని వ్యతిరేకించిన అది పార్టీ కోసమే కానీ వ్యక్తి గతం కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొంత నారాజ్ ఉన్నారని.. తాము మీకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. మన ప్రభుత్వంలో చేస్తున్న అభివృద్ధి పనులను ప్రతి ఒక్క కార్యకర్త ప్రజలకు వివరించాలని సూచించారు. జనవరిలో కొంతమంది పార్టీ నాయకులకు పదవులు ఇస్తామని చెప్పుకొచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మన సత్తా చాటాలని అన్నారు.
కుట్రలు చేస్తున్నాయి..
అధికారంలోకి వచ్చి 11 నెలల్లోనే ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మకై కాంగ్రెస్ పార్టీపై కుట్ర పన్నుతున్నాయన్నారు. కార్యకర్త కూడా సీఎంను కలిసే వెసులుబాటు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉందని వ్యాఖ్యానించారు. కార్యకర్తలు నారాజ్ అయితే తాము కుర్చీ దిగాల్సిందేనన్నారు. మరోసారి మనం అధికారంలోకి రావాలి.. ఢిల్లీలో రాహుల్ గాంధీ ప్రధాని కావాలి అని కామెంట్స్ చేశారు.
వారు తప్ప ఎవరూ మిగలరు..
కేసీఆర్ రాష్ట్రాన్ని ఆగం చేస్తే కాంగ్రెస్ పార్టీ రిపేర్లు చేస్తుందన్నారు. బంగారు తెలంగాణ అంటే కేసీఆర్ కుటుంబం మాత్రమే బంగారుమయం అయ్యిందని సెటైర్లు వేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో బీటలు బారుతున్నాయని.. కాంగ్రెస్ పార్టీ కట్టిన ప్రాజెక్టు 70 ఏళ్లయిన చెక్కు చెదరలేదని అన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. మీరు పదేళ్లలో ఎంత అభివృద్ధి చేశారో చెప్పండి..మేము 11 నెలల్లో ఎంత అభివృద్ధి చేశామో చూపిస్తామని ఛాలెంజ్ చేశారు. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో బీఆర్ఎస్ ఉండదని సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావు కూడా పక్క చూపులు చూస్తున్నాడని.. చివరికి పార్టీలో తండ్రి, కొడుకు, కూతురు తప్ప ఎవరూ మిగలరని ఎద్దేవా చేశారు.
Also Read:
కేసీఆర్ వల్లే ఇదంతా జరిగింది.. మాజీ ఎంపీ వినోద్ కుమార్ కీలక వ్యాఖ్యలు..
Updated Date - Nov 18 , 2024 | 04:02 PM