Nalgonda: కాటేసిన కరెంట్ తీగలు!
ABN, Publish Date - Nov 11 , 2024 | 03:47 AM
పొలం నుంచి గడ్డి కట్టలు తెచ్చేందుకు ట్రాక్టర్‌పై బయలుదేరిన నవదంపతులు ఊహించని ప్రమాదానికి గురయ్యారు. ట్రాక్టర్ ట్రాలీకి అమర్చిన ఇసుప పైపులకు మార్గమధ్యలో కరెం టు తీగలు తగలడంతో.. విద్యుదాఘాతం బారిన పడ్డారు.
భార్య మృతి.. భర్త పరిస్థితి విషమం
రెండున్నర నెలల కిందే వివాహం
నల్లగొండ జిల్లా కనగల్‌లో విషాదం
కనగల్, నవంబరు 10: పొలం నుంచి గడ్డి కట్టలు తెచ్చేందుకు ట్రాక్టర్‌పై బయలుదేరిన నవదంపతులు ఊహించని ప్రమాదానికి గురయ్యారు. ట్రాక్టర్ ట్రాలీకి అమర్చిన ఇసుప పైపులకు మార్గమధ్యలో కరెం టు తీగలు తగలడంతో.. విద్యుదాఘాతం బారిన పడ్డారు. ఈ ఘటనలో భార్య మృతి చెందగా, భర్త కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. ఆదివారం నల్లగొండ జిల్లా కనగల్ మండలం కుమ్మరిగూడెంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కుమ్మరిగూడేనికి చెందిన మాచర్ల అంజిబాబుకు గుర్రంపోడు మండలం నడికుడకు చెందిన మనీషా(18)తో రెండున్నర నెలల కింద వివాహం జరిగింది. ఆదివారం అంజిబాబు మనీషాతో కలసి పొలంలోని వరి గడ్డికట్టలను తెచ్చేందుకు ట్రాక్టర్‌లో ఇంటి నుంచి బయల్దేరాడు.
మార్గంమధ్యలో 11 కేవీ విద్యుత్తు తీగలు కిందికి జారి ఉండగా.. గమనించని అంజిబాబు వాటి కిందుగా వెళ్లడంతో ట్రాక్టర్ ట్రాలీకి అమర్చిన ఓ ఇనుప పైపు తీగలకు తగిలింది. దీంతో విద్యుత్తు సరఫరా కావడంతో ట్రాక్టర్ నడుపుతున్న అంజిబాబు, అతడి పక్కనే కూర్చొన్న మనీషా తీవ్రంగా గాయపడ్డారు. ట్రాక్టర్ ముందు టైర్లు కాలిపోయాయి. పరిసర ప్రాంతాల రైతులు 108 అంబులెన్సులో నల్లగొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిని పరిశీలించిన వైద్యులు మనీషా మృతి చెందిందని.. అంజిబాబు పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.
Updated Date - Nov 11 , 2024 | 03:47 AM