Tummala: 4లోగా పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించండి
ABN, Publish Date - Nov 03 , 2024 | 03:29 AM
ఈ నెల 4వ తేదీ వరకు రాష్ట్రంలో పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.
తేమ శాతంపైనా సడలింపివ్వండి
సీసీఐని కోరిన మంత్రి తుమ్మల
హైదరాబాద్, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): ఈ నెల 4వ తేదీ వరకు రాష్ట్రంలో పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చిన 279 జిన్నింగ్ మిల్లులను అందుబాటులోకి తీసుకురావాలని కూడా ఆయన సూచించారు. శనివారం సచివాలయంలో మార్కెటింగ్, సీసీఐ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. పత్తి కొనుగోలు కేంద్రాల్లో రైతులు గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. అలాగే తేమ శాతంపైనా సడలింపులు ఇవ్వాలని, తద్వారా రైతులు మద్దతు ధర పొందే అవకాశం ఉందన్నారు.
రైతులు కూడా సీసీఐ ప్రమాణాలకు అనుగుణంగా తేమ 8-12శాతం మేర ఉండేలా పంటను మార్కెట్‌కు తీసుకురావాలని సూచించారు. కొనుగోళ్ల కోసం రూపొందించిన కొత్త యాప్‌ను ఉపయోగించి కొనుగోలు కేంద్రాలను పరిశీలిస్తూ, తనిఖీలు చేయాలన్నారు. రైతులెవరూ పత్తిని తక్కువ ధరకు విక్రయించుకోవద్దని మంత్రి సూచించారు. సీతారామ ఎత్తిపోతల పథకం పనుల్లో రానున్న 6 నెలలు కీలకమని, సత్తుపల్లి ట్రంక్, ట్రంక్ కెనాల్, యాతలకుంట దాకా పనులు చేసుకుంటే వచ్చే సీజన్‌లో సాగునీటిని అందించే అవకాశం ఉంటుందని, ఆ దిశగా టెండర్లు పిలిచే ప్రక్రియను పూర్తిచేయాలని తుమ్మల కోరారు. నీటిపారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి, ప్రాజెక్టు పనులపై సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టులోని వివిధ పనుల డిజైన్లను ఖరారుచేసి, టెండర్ల ప్రక్రియ పూర్తయ్యే విధంగా చొరవ తీసుకోవాలని మంత్రి ఉత్తమ్‌ను తుమ్మల కోరారు.
Updated Date - Nov 03 , 2024 | 03:29 AM