Fraud: ప్రీ లాంచ్ పేరుతో మోసాలు
ABN, Publish Date - Nov 26 , 2024 | 04:28 AM
ప్రీ లాంచ్ ఆఫర్‌లో తక్కువ ధరకే ఇళ్లు ఇస్తామని పలువురిని మోసం చేసిన ఇద్దరిని సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం అధికారులు అరెస్ట్ చేశారు. కూకట్‌పల్లికి చెందిన చక్క భాస్కర్, అతడి భార్య సుధాణి చైర్మన్, ఎండీలుగా ఆర్ హోమ్స్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ పేరుతో సంస్థను స్థాపించారు.
200 మంది నుంచి రూ.48 కోట్లు వసూళ్లు
బాధితుల ఫిర్యాదుతో దంపతుల అరెస్ట్
హైదరాబాద్ సిటీ, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): ప్రీ లాంచ్ ఆఫర్‌లో తక్కువ ధరకే ఇళ్లు ఇస్తామని పలువురిని మోసం చేసిన ఇద్దరిని సైబరాబాద్ ఆర్థిక నేరాల విభాగం అధికారులు అరెస్ట్ చేశారు. కూకట్‌పల్లికి చెందిన చక్క భాస్కర్, అతడి భార్య సుధాణి చైర్మన్, ఎండీలుగా ఆర్ హోమ్స్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ పేరుతో సంస్థను స్థాపించారు. ఘట్‌కేసర్ యామన్నపేటలో బ్లిస్ హైట్స్ ప్రాజెక్ట్, పటాన్‌చెరు కర్దనూరులో ఓఆర్‌ఆర్ హైట్స్ ప్రాజెక్ట్.. నారాయణఖేడ్, సంగారెడ్డి జిల్లా కారముంగి ప్రాంతాల్లో ఫామ్‌లాండ్ ప్రాజెక్ట్‌ల పేరుతో వెంచర్లను ప్రారంభించారు. మార్కెట్ ధర కంటే తక్కువ ధరలోనే ప్లాట్లు, ఇళ్లు ఇస్తామని చెప్పి దాదాపు 200 మంది నుంచి రూ.48 కోట్లు వసూలు చేశారు.
తమ ప్రాజెక్టులలో పెట్టుబడి పెడితే మూడేళ్లలో ఇళ్లు కట్టి ఇస్తామని.. లేని పక్షంలో డబుల్ బెడ్ రూంకు నెలకు రూ.6 వేలు, ట్రిపుల్ బెడ్‌రూంకు రూ.8 వేల చొప్పున అద్దె చెల్లిస్తామని అగ్రిమెంట్లు చేశారు. వీరి మాటలు నమ్మిన పలువురు 2021 నుంచి 2023 వరకు డబ్బులు కట్టారు. మూడేళ్లయినా పనులు ప్రారంభం కాకపోవడంతో బాధితులు నిర్వాహకులను సంప్రదించారు. వారిచ్చిన చెక్కులు చెల్లకపోయేసరికి మోసపోయామని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Updated Date - Nov 26 , 2024 | 04:28 AM