ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Himayat Sagar: హిమాయత్‌ సాగర్‌లో.. ఆక్రమణల నివేదికపై అస్పష్టత

ABN, Publish Date - Sep 24 , 2024 | 04:00 AM

హిమాయత్‌సాగర్‌లో ఆక్రమణల గుర్తింపునకు సంబంధించిన నివేదికపై అస్పష్టత నెలకొంది.

  • కూల్చివేతలపై హైడ్రా సందిగ్ధం.. జలాశయంలో ఆక్రమణలపై పలు ఫిర్యాదులు

  • ఎఫ్‌టీఎల్‌ నోటిఫై కాకపోవడంతో.. ఆక్రమణల గుర్తింపులో హైడ్రాకు ఇబ్బందులు

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబర్‌ 23 (ఆంధ్రజ్యోతి): హిమాయత్‌సాగర్‌లో ఆక్రమణల గుర్తింపునకు సంబంధించిన నివేదికపై అస్పష్టత నెలకొంది. జలాశయం వద్ద క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించిన వాటర్‌బోర్డు, నీటి పారుదల శాఖ అధికారులు.. ఇటీవల హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఎసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ(హైడ్రా)కు ఆక్రమణల వివరాలు అందజేశారు. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌లో 83 నిర్మాణాలున్నట్టు నివేదికలో పేర్కొన్నారు. అయితే.. పర్యావరణ వేత్తలు, స్వచ్ఛంద సంస్థలు, ఇతరులు ఫిర్యాదు చేసిన పలు ఆక్రమణల వివరాలు నివేదికలో కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో మరోసారి సమగ్ర పరిశీలన చేపట్టాల్సిందిగా వాటర్‌బోర్డు, నీటి పారుదల శాఖ అధికారులను కోరాలని హైడ్రా భావిస్తోంది.


దాంతోపాటు నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ (ఎన్‌ఆర్‌ఎ్‌ససీ) నుంచి రెండు, మూడు దశాబ్దాల క్రితం నాటి జలాశయం మ్యాపులు తీసుకోవాలని నిర్ణయించింది. హిమాయత్‌సాగర్‌కు సంబంధించి గత, ప్రస్తుత మ్యాపులు ఇవ్వాలని కోరింది. మ్యాపుల ఆధారంగా ఆక్రమణలపై సూత్రప్రాయ అంచనాకు రావొచ్చని అధికారులు భావిస్తున్నారు. దీంతో జలాశయంలో ఆక్రమణల తొలగింపును వాయిదా వేసిన హైడ్రా.. పూర్తిస్థాయి స్పష్టత వచ్చిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. ఫిర్యాదుల్లో పేర్కొన్న నిర్మాణాలు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో ఉన్నాయా? లేదా? నిర్ధారించుకున్న అనంతరం కూల్చివేతలు ఉంటాయని సంస్థ వర్గాలు పేర్కొన్నాయి.


  • ఇదీ నేపథ్యం..

రాజధాని నగర తాగునీటి అవసరాల కోసం 1927లో రూ.93 లక్షలతో 19.63 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో హిమాయత్‌సాగర్‌ను నిర్మించారు. అయితే, కాలగమనంలో జలాశయం ఆక్రమణకు గురైంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు రావాల్సిన కాలువలపై అక్రమ నిర్మాణాలు వెలిశాయి. దీంతో జలాశయంలోకి నీటి రాక తగ్గింది. ఇదే అదనుగా కొందరు మట్టి నింపి నిర్మాణాలు చేపట్టారు. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో అతిథి గృహాలు, ఫామ్‌ హౌస్‌లు, ఇతరత్రా నిర్మాణాలు చేపట్టారు. హైడ్రా ఏర్పాటుతో చెరువుల పరిరక్షణకు నడుం బిగించిన ప్రభుత్వం హిమాయత్‌సాగర్‌లోని ఆక్రమణలూ తొలగించాలని ఆదేశించింది. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌లో నిర్మాణాల లెక్కలు తేల్చే పని వాటర్‌బోర్డు, నీటిపారుదల శాఖలకు అప్పగించారు. వారు ఇచ్చిన నివేదికపై పున:పరిశీలన మొదలైంది.


  • నోటిఫై కాని ఎఫ్‌టీఎల్‌

హిమాయత్‌సాగర్‌ ఎఫ్‌టీఎల్‌ ఇంకా నోటిఫై కాలేదు. నగర, శివారు ప్రాంతాల్లోని పలు చెరువుల ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లకు సంబంధించి ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసిన హెచ్‌ఎండీఏ.. ఈ జలాశయ ఎఫ్‌టీఎల్‌ నిర్ధారణకు మాత్రం చర్యలు తీసుకోలేదు. ఇది ఆక్రమణల గుర్తింపునకూ ఇబ్బందికరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఒకటికి, రెండుసార్లు పూర్తి వివరాలు పరిశీలించాలని హైడ్రా భావిస్తోంది.


  • ఆక్రమణలపై ఫిర్యాదులివీ..

హిమాయత్‌సాగర్‌లో ఆక్రమణలపై పలు స్వచ్ఛంద సంస్థలు హైడ్రాకు ఫిర్యాదు చేశాయి. ఎన్‌ఆర్‌ఎ్‌ససీ, ధరణి కెడస్ట్రియల్‌ లేయర్‌, హెచ్‌ఎండీఏ మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం ఆనందసాయి కన్వెన్షన్‌.. జలాశయం లోపల ఉందని సామాజిక కార్యకర్త లుబ్నా సార్వత్‌ ఫిర్యాదు చేశారు. యేటురూ ఫార్మ్స్‌కు సంబంధించిన ప్రహరీ గోడలు, ఇతర నిర్మాణాలూ హిమాయత్‌సాగర్‌లోనే ఉన్నాయని పేర్కొన్నారు. జలాశయం ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో.. బీటీ రోడ్లు, కాంపౌండ్‌ వాల్స్‌, షెడ్లు తదితర ఆక్రమణల వివరాలను పలు ఎన్జీవోలు హైడ్రాకు సమర్పించాయి.

Updated Date - Sep 24 , 2024 | 04:00 AM